సాక్షి, గుంటూరు : గుంటూరు మిర్చియార్డులో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన ప్రభుత్వం 22 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వేణుగోపాలరావును సర్కారు శనివారం సస్పెండ్ చేసింది. డీఈఈ ప్రసాద్‌పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంది. నవంబర్ 30న ఉద్యోగ విరమణ చేసిన మార్కెటింగ్‌శాఖ ఎస్‌ఈ రాధాకృష్ణమూర్తి హయాంలో జరిగిన అవకతవకలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన యార్డు ఉద్యోగులపై రెండు మూడు రోజుల్లో కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
నాలుగేళ్లలో ఎన్నో కుంభకోణాలు
గుంటూరు మిర్చియార్డులో గత నాలుగేళ్లుగా ఎన్నో అవకతకలు, కుంభకోణాలు వెలుగు చూశాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన, లక్షల రూపాయల దుర్వినియోగం, అనధికార లెసైన్సుల జారీ, జీరో వ్యాపారం, బీమా సొమ్ము స్వాహా తదితర ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. గతంలో ముగ్గురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసిన సర్కారు, యార్డులో జరిగిన కుంభకోణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులపై చర్యలకు అవసరమైన నివేదిక ఇవ్వాలని ఐపీఎస్ అధికారి ఎంకే సింగ్‌ను ఆదేశించింది. ఇందులో భాగంగా రెండు రోజుల కిందట యార్డుకు విచ్చేసిన ఎంకే సింగ్ విచారణ జరిపి 22 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అప్పటి నుంచి సంబంధిత ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు వేటు పడుతుందోనని కలవరం చెందుతున్నారు. శనివారం సాయంత్రం ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ముగ్గురు అధికారులపై శాఖాపరమైన చర్యలకు పూనుకోవడం యార్డు ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారోనని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. వేటు పడితే,ఎవర్ని ఆశ్రయించాలన్న అంశాలపై దృష్టి సారిస్తున్నారు.
పనుల కేటాయింపులో ఇష్టారాజ్యం..
మార్కెట్ యార్డుల్లో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనుల్ని కాంట్రాక్టర్లకు కేటాయించే విషయంలోనూ ఎన్నో అక్రమాలు జరిగినట్లు తెలిసింది. జిల్లాలోని అన్ని యార్డుల్లోనూ ఇదే తరహా అక్రమాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. మంగళగిరి మార్కెట్ కమిటీకి చెందిన రూ.32 లక్షల పనుల్ని మూడు, నాలుగు పనులుగా విభజించి తమకు అనుకూలమైన ఒకే కాంట్రాక్టర్‌కు కేటాయించినట్లు విచారణలో వెలుగు చూసింది. ఇందుకు బాధ్యుడిగా భావించి ఈఈ వేణుగోపాలరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జిల్లాలోని అన్ని యార్డుల్లోనూ జరిగిన ఇంజినీరింగ్ పనుల్లో ఇదే మాదిరిగా ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చిన ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున కాజేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని యార్డుల్లోని పనులపై విజిలెన్సు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.
సస్పెన్షన్లతో కలవరం
Published Mon, Dec 23 2013 12:23 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement