venu gopalrao
-
బిగ్‌బాస్‌లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ .. స్టార్ మా ప్లాన్ ఇదేనా?
బుల్లితెర మెగా షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్ ఇప్పటికే 6 సీజన్లు పూర్తి అయ్యాయి. తాజగా 7వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమం ఆగష్టు నెల చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈసారి మరిన్ని సర్ప్రైజ్లు, థ్రిల్లింగ్ అంశాలు, భావోద్వేగాలు ఉంటాయని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఓటీటీ వేదికైన డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. సీజన్ 1లో ఎన్టీఆర్, సీజన్ 2లో నాని హోస్ట్‌గా సందడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వచ్చిన అన్ని సీజన్ల వరకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా 7వ సీజన్లో నాగ్‌నే హోస్ట్‌గా రానున్నారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: విడాకుల బాటలో కలర్స్ స్వాతి.. నిహారిక,సమంత మాదిరే క్లూ ఇచ్చేసిందంటూ..) ఇకపోతే ఈ షోలోకి తాజాగా ఒక వార్త ట్రెండింగ్‌లో ఉంది. బిగ్‌బాస్-7లోకి ఇండియన్ క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వై.వేణుగోపాల రావును ఈ మెగా షోలోకి తీసుకురావాలని స్టార్ మా గట్టిగానే ప్రయత్నం చేస్తుందట. ఇదే జరిగితే బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన తొలి క్రికెటర్‌గా వై.వేణుగోపాల రావు రికార్డు క్రియేట్ చేయనున్నాడు. దీనిక ప్రధాన కారణం బిగ్‌బాస్ 6వ సీజన్లో సరైన కంటెంస్టెంట్లను ఎంపిక చేయకపోవడంతో అంతగా ఆ సీజన్ మెప్పించలేదనే చెప్పవచ్చు. అందుకే ఈసారి ఆ తప్పులు జరగకుండా చాలా వరకు గుర్తింపు ఉన్న వారినే బిగ్‌బాస్ కోసం తీసుకురావలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట విశాఖకు చెందిన వేణుగోపాల రావు క్రికెట్ కెరియర్ ఇదే భారత మాజీ క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు వై.వేణుగోపాల రావు 2019లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను ఆ సమయంలోనే ప్రకటించాడు. 2005 జులైలో తొలి వన్డే ఆడిన అతని కెరీర్ పది నెలల వ్యవధిలోనే 16 వన్డేలకే (ఆరు వేర్వేరు జట్లపై కలిపి) పరిమితమైంది. వేణుగోపాలరావు అంతర్జాతీయ క్రికెట్లో తన ఏకైక అర్ధ సెంచరీ (93 బంతుల్లో 61 నాటౌట్) పాకిస్తాన్‌పై అబుదాబిలో సాధించాడు. దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున కలిపి వేణు ఐపీఎల్లో మొత్తం 65 మ్యాచ్‌లు (2008–2014) ఆడాడు. ప్రధానంగా విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీలో రాణించడంతో అతనికి వన్డే టీమ్ పిలుపు దక్కింది. (ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?) -
‘లక్ష్యాన్ని ప్రేమతో సాధించాలి’
ఏ అంశంలోనైనా గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు భావిస్తారు. క్రీడా రంగంలో.. అందులోనూ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్న క్రికెట్ క్రీడ విషయంలో గెలుపు ముఖ్యం కాకూడదు. ఎంత బాగా మన ఆట తీరును ప్రదర్శించాం... ఎంత మందిని ప్రోత్సహించామన్నదే ప్రధానం. ప్రతిభ గల క్రీడాకారులను ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. ఏసీఏ డైరెక్టర్ వై.వేణుగోపాలరావు త్వరలో ఇండియా జట్టులోకి మన కుర్రోళ్లు... ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాధనలో రాటుదేలుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు హనుమ విహారి, కె.ఎస్.భరత్ ఇండియా తరఫున ఆడుతున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. త్వరలో మరో ముగ్గురికి అవకాశం దక్కనుంది. విశేషమేమిటంటే ఆంధ్రప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీలకు క్వాలిఫై కావటం. క్రికెట్ చరిత్రలో ఇదో మంచి పరిణామంగా చెప్పవచ్చు. మన క్రీడాకారుల ప్రతిభకు ఇది తార్కాణంగా నిలుస్తుంది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సాహం గ్రామీణ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏసీఏ అధిక ప్రాధాన్యమిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే విజయనగరం వంటి జిల్లాలో రెండు నుంచి మూడు మైదానాలు ఏర్పాటు చేశాం. త్వరలో శ్రీకాకుళం, తిరుపతి నగరాల్లో మైదానాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా మైదానాల్లో శిక్షణ పొందేందుకు వచ్చే వారి కోసం శిక్షకులను ఏర్పాటు చేస్తాం. ఉన్నకాడికి వనరులను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేధించగలిగే స్థాయికి క్రీడాకారులు ఎదగాలి. ఫ్రీగా ఏసీఏ కోసం పని చేస్తున్నా... అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తరువాత ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది. 70 ఐపీఎల్ మ్యాచ్‌లు... 16 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాను. కానీ తాజాగా చేపట్టిన బాధ్యతలతో ఆనందంగా ఉంది. ఇంతకుముందు వారంతా నెలకు రూ. 3లక్షల వరకు జీతం తీసుకునేవారు. నేను మాత్రం అటువంటి రెమ్యూనరేషన్కోసం ఆశపడలేదు. ఫ్రీగానే బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆంధ్రాలో క్రికెట్ క్రీడాకారులను తయారుచేయటమే ధ్యేయం. ఎన్నో కష్టాలు పడ్డా... మా స్వస్థలం విశాఖ జిల్లా గాజువాక. అక్కడే చిన్న స్టేడియంలో నిత్యం సాధన చేసే వాడ్ని. క్రికెట్లో రాణించాలన్నది నా లక్ష్యం. అందుకు అనుగుణంగానే కష్టపడ్డాను. ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఇష్టంగా ఎదుర్కొన్నా. మద్రాసు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఆడేందుకు వెల్లాల్సిన అవసరం వచ్చిన సమయంలో ట్రైన్లో జనరల్ బోగీలోని బాత్రూం పక్కన కూర్చొని వెల్లిన రోజులున్నాయి. బెంగళూరులో డార్మిటరీలో పడుకుని ప్రాక్టీస్‌కు వెళ్లాను. ఇన్ని కష్టాలు పడ్డ తరువాత అంతర్జాతీయ యవనికపై ఆడే అవకాశం దక్కింది. అప్పుడు ఈ కష్టాలన్నింటినీ మర్చిపోయాను. కుటుంబ ప్రోత్సాహం మరువలేనిది... అమ్మ.. నాన్న... ఐదుగురు అన్నదమ్ములం... అందులో నేను నాల్గవ వాడిని. నా తమ్ముడు జ్ఞానేశ్వర్ ఇండియా అండర్–19 జట్టుకు ఆడాడు. అమ్మనాన్నల ఇష్టంతో ప్రమేయం లేకుండానే క్రికెట్లోకి దిగాను. ఎవ్వరూ అడ్డుచెప్పలేదు. మా అన్నదమ్ములంతా ఆంధ్రా జట్టుకు ఆడినవారే. నేనొక్కడినే ఇండియాకు ఆడాను. ఆంధ్రా నుంచి తక్కువ మంది క్రీడాకారులు ఇండియాకు ఆడిన వారు ఉన్నారు. వారి సంఖ్య మరింత పెరగాలన్నదే నా లక్ష్యం. అందుకోసం నా శాయశక్తుల పని చేస్తా. ఈ విషయంలో నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రస్తుతం భార్య, ఇద్దరు పిల్లలతో చెన్నైలో ఉంటున్నా. మూడు నెలల తరువాత విశాఖలో అమ్మ, నాన్న దగ్గరకు వెళ్లా. -
పంట్లామా మజాకా!
ఏరా పోరగా! యాడికి పోయినావు...అని తిట్లు తిడుతుంది పొయ్యి కాడ నుంచి అమ్మ. ఎదురు మాట్లాడితే ఇంకా తిడుతుంది అని ఏమీ మాట్లాడకుండా ఒళ్ళంతా దుమ్ముతో పొయ్యి కాడ ఉన్న అమ్మ దగ్గరకు పోయా. ఇంట్లో నుంచి మూలుగుతున్న శబ్దాలు పొయ్యి కాడ ఉన్న నా చెవుల్లోకి చేరుతున్నాయి. మూలిగేది మా నాన్నే. లేచి పొయ్యి కాడ నుంచి గుమ్మం దగ్గరకు పోయి దీపాన్ని ఓ చేతితో పట్టుకొని ఆరి పోకుండా మరో చేతిని అడ్డు పెట్టుకుంటూ ఎదురుగా ఉన్న బస్తా కేసి నా కాళ్లను తుడుచుకొని నాన్న పడుకొని ఉన్న మంచం దగ్గరకు పోయా. నాన్న బక్క శరీరాన్ని చూడగానే తెలీకుండానే నీళ్లు కన్నుల్లో తిరిగాయి. ముడుచుకుపోయిన మొహంతో గుండెల వరకు దుప్పటి కప్పుకొని పడుకొని మూలుగుతున్నాడు. నాన్నతో ఏమీ మాట్లాడకుండానే కన్నీళ్లని దిగమింగి దీపాన్ని తీసుకువచ్చి గుమ్మం ముందు పెట్టా. పొయ్యి కాడ కూర్చున్న అమ్మ దగ్గరికి పోయి, పొయ్యిలో నుంచి వేడి సెగలకు చేతులు అడ్డు పెట్టుకుంటూ ‘నాన్నకు ఏమైంది?’ అని అడిగా. అప్పటివరకు నేను అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉండే వాడిని, ఇంటికి వచ్చే వాడిని కాదు. అందుకే తెలీదు నాన్నకు ఏమైంది అనేది. ‘మీ అయ్యా మన చేనుకు నీళ్లు పెట్టాలని వెళ్లి కరెంటు స్తంభం ఎక్కి కరెంటు లైన్ వేసాడు, కరెంటు కొట్టి కింద పడ్డాడు కాకి పడ్డట్టు. అప్పటికి నువ్వు కడుపులోనే ఉన్నావు. డాక్టర్‌కి చూపెడితే మందులతోనే బతికించడం అని అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉన్నాడు. నొప్పి మాత్రలు వేసుకుంటే కాసేపు బాగానే ఉంటాడు’ పాత చేదు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ చెబుతుంది అమ్మ. నేనేమో కథ విన్నట్టు వింటున్నాను నోరు తెరిచి. నాన్నకు కాళ్ల నొప్పులు ఎక్కువ కావడంతో అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. నేను స్నానం చేసి ప్యాంట్ కోసం వెతుకుతున్న. బట్టల మూటలో అడుగున దాక్కున్న నా ప్యాంటుని తీసి వేసుకున్న. రెండు కాళ్ల మధ్యలో గాలి చొరబడి చల్లగా తొడలకు తగులుతూ ఉంది. చూస్తే ప్యాంట్ చినిగి ఉంది. అప్పటికే నాలుగైదుసార్లు మిషన్ కాడ కుట్టించ ఆ ప్యాంటును. నేను ఆడే ఆటల్లో దూకుడికి అది తట్టుకోలేక పోతుంది పాపం. బడికి లేట్ అవుతుందని చిరిగిన కాడ పిన్నీసులు పెట్టుకుని బడికి వెళ్లాను. ఫిజిక్స్ పంతులు యూనిట్ టెస్ట్ మార్కులు దగ్గరకు పిలిచి మరీ ఇస్తున్నాడు. నాకు ఆయన దగ్గరకు వెళ్లాలంటే భయం. ప్యాంట్‌కు పెట్టుకున్న పిన్నీసు ప్రేయర్లో ఎక్కడో వూడి పడిపోయింది. బహుశా నా ప్యాంట్‌కు ఉండటం ఇష్టం లేదేమో. క్లాసులో ఎవరైనా చూస్తే నా పరువు పోతుందని నా పరీక్ష పేపర్ రాకుంటే బాగుండు అనుకున్న. ఫిజిక్స్ పంతులు నా పేరు పెట్టి పిలిచాడు. అది నా పరీక్ష పేపరే. ఈ మాయదారి పరీక్ష పేపర్ ఇప్పుడే రావాలా అని తిట్టుకుంటూ పంతులు దగ్గరకి పోయా. నేను కవర్ చేసుకుంటున్న ప్యాంట్‌ను చూసి ‘మార్కులు అయితే బాగా వచ్చాయి కానీ చిరిగిన ఫ్యాంట్ వేసుకున్నావు ఏంట్రా ఎదవా!’ అన్నాడు. అంతే ఆ మాటకు క్లాసులో వాళ్ళంతా నవ్వారు. ‘నా పరువు అంతా పోయింది’ అనుకుంటూ కళ్ళల్లోని నీళ్లను పంతులికి చూపించలేక తల కిందికి వేసా. ‘మీ నాన్న ఏం చేస్తాడు రా? మంచి ప్యాంట్ కొనమని వచ్చుగా!’ అన్నాడు. రాత్రి మంచంపై మూలుగుతున్న నాన్న దృశ్యాలే నాకు జ్ఞాపకం వచ్చాయి. ఆయనకు ఆరోగ్యం బాగా లేదని అందరి ముందు చెప్పలేక పోతున్నాను. ‘ఏంట్రా మాట్లాడు’ అంటూ గట్టిగా గద్దించాడు పంతులు. గొంతులోని మాటలను కన్నుల్లోనీ నీళ్లు ఆపుకోలేక చెప్పా మా నాన్న పరిస్థితి బాగోలేదని. కన్నీటిబొట్లు కాలు మీద పడుతున్నాయి. నన్ను చూస్తున్న ఆయన ‘నేను కూడా చిన్నప్పుడు ఇలాగే వేసుకునేవాడిని ప్యాంట్లు. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అని కళ్లకు కట్టినట్టు తన జ్ఞాపకాలను చెబుతున్నాడు. నిశ్శబ్దంగా ఉంది క్లాసు. అది వింటున్న అందరి మొహాల్లో తెలియని బాధ కనబడుతుంది. సరిగ్గా బట్టలు లేకపోవడంతో ఊళ్లో ఫంక్షన్లకు కూడా వెళ్ళే వాడిని కాదు. క్లాసులో పోయినట్టు ఊర్లో కూడా నా పరువు పోతుందని. కొత్త ప్యాంట్ కొనుక్కోవాలని అమ్మను అడిగితే ‘అన్నయ్య ప్యాంటు వేసుకో. డబ్బుల్లేవు. పంట వచ్చాక ఇద్దరికి కొంటా లే’ అంది అమ్మ. అమ్మ కూలికి వెళ్తే వచ్చే డబ్బులు, పండిన పంటకు వచ్చే డబ్బులు ఇంట్లో అప్పులకి, నాన్న మందులకి సరిపోతాయి. కొత్త ప్యాంట్ కొనుక్కోవడానికి డబ్బులు మిగలవు ఇంట్లో. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే యూనిఫామ్‌తో అన్నయ్య ప్యాంట్లతో పదో తరగతి వరకు చదువుకున్న. పది పాస్ అయ్యాక ఎండాకాలం సెలవుల్లో పనికి పోయి కొన్ని డబ్బులు పోగేసుకున్న. ఆ డబ్బుతో ప్యాంట్లు కొనుక్కుని ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో చేరా. అప్పటివరకు చిరిగిన ప్యాంట్‌తో బాధపడ్డ నేను కొత్త ప్యాంట్ వేసుకొని కాలేజీకి పోతున్న. ఓరోజు ఇంగ్లీషు పంతులు అన్ని గ్రూపుల వాళ్ళను కలిపి పెద్ద క్లాసులో కూర్చోబెట్టాడు. నేను నా సహవాస గాడు గోపి ఎప్పుడూ కూర్చునే వెనక బెంచీలో కూర్చున్నాము. క్లాస్ అంతా నిండిపోయింది. అందరినీ స్టేజి కాడికి పిలిచి సన్నగా ఉన్న ఇంగ్లీష్ పీసు బుక్ ఇచ్చి పెద్దగా అందరికి వినబడేటట్టు చదవమంటున్నాడు. వెనక కూర్చున్న మాకు ఇంగ్లీషు పీసు సరిగ్గా చదవడం రాదు. పక్కన ఉన్న నా స్నేహితుడు గోపిగాడిని పిలిచి ఇంగ్లీష్ చదవమన్నాడు పంతులు. స్టేజి కాడికి పోయి చదవడం మొదలుపెట్టాడు పెద్ద ఇంగ్లీష్ వచ్చినవాడి లాగా.‘సైకాలజీ’ అనే పదాన్ని ‘పిజికాలాజీ’ అని చదివాడు. ఒకటే నవ్వులు! ఇక నేనే చదవాల్సింది. పైకి లేవగానే ప్యాంట్ కిందికి జారింది. ఎందుకు జారుతుందని చూస్తే చిన్నప్పుడు అమ్మ నడుముకు కట్టిన ఎర్రని మొల తాడు తెగే ప్రమాదంలో ఉంది. ఆరోజు బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయా. చేసేది ఏమీ లేక ముందుకు నడిచా. నడుముకున్న ఎర్ర తాడు నిర్దయగా పుటుక్కున తెగింది. అప్పటి నా తిప్పలు తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు ఆగదు! – మారీడు వేణుగోపాల్‌రావు, బోనకల్, ఖమ్మం జిల్లా. -
క్రికెట్‌కు వేణు గుడ్‌బై
సాక్షి, విశాఖపట్నం : భారత మాజీ క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు వై.వేణుగోపాల రావు (37) ఆటకు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను ప్రకటించాడు. 2017 అక్టోబరులో ఆంధ్ర, తమిళనాడు మధ్య జరిగిన రంజీ మ్యాచ్ ఆడిన తర్వాత రెండేళ్లుగా వేణుగోపాలరావు మళ్లీ బరిలోకి దిగలేదు. క్రికెట్ కామెంటేటర్‌గా కూడా కొనసాగుతున్న వేణు... ఇటీవలి ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన వేణుగోపాలరావు అంతర్జాతీయ కెరీర్ మాత్రం సంతృప్తికరంగా సాగలేదు. 2005 జులైలో తొలి వన్డే ఆడిన అతని కెరీర్ పది నెలల వ్యవధిలోనే 16 వన్డేలకే (ఆరు వేర్వేరు జట్లపై కలిపి) పరిమితమైంది. వేణుగోపాలరావు అంతర్జాతీయ క్రికెట్లో తన ఏకైక అర్ధ సెంచరీ (93 బంతుల్లో 61 నాటౌట్) పాకిస్తాన్‌పై అబుదాబిలో సాధించాడు. దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున కలిపి వేణు ఐపీఎల్లో మొత్తం 65 మ్యాచ్‌లు (2008–2014) ఆడాడు. ప్రధానంగా విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీలో రాణించడంతో అతనికి వన్డే టీమ్ పిలుపు దక్కినా... అంతకుముందు ఇంగ్లండ్ ‘ఎ’తో జరిగిన ఫస్ట్ క్లాస్‌మ్యాచ్‌లో చేసిన అద్భుత బ్యాటింగ్ వేణుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 501 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వేణు అజేయంగా 228 పరుగులు చేయడం విశేషం. ఆంధ్ర క్రికెట్‌కు సంబంధించి మాత్రం వేణుగోపాలరావుకు ప్రత్యేక స్థానం ఉంది. జూనియర్ క్రికెట్‌తో పాటు 19 ఏళ్ల సుదీర్ఘ ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను ఎన్నో సార్లు తన జట్టుకు కీలక విజయాలు అందించాడు. కెరీర్ చివర్లో వేర్వేరు కారణాలతో ఆంధ్ర జట్టుకు దూరమైన అతను రంజీల్లో గుజరాత్, రాజస్తాన్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ సందర్భంగా వేణుగోపాలరావును అభినందించి అతని సేవలను ప్రశంసించిన ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అతను భవిష్యత్తులో ఏ రంగంలోనైనా మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. -
ఫ్యాన్‌కే స్పష్టమైన ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్నికలపై సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ మూడు సార్లు శాస్త్రీయంగా సర్వే చేసిందని ఆ సంస్థ చైర్మన్ డా. వేణుగోపాలరావు తెలిపారు. ఎగ్జిట్ పోల్‌లోనూ ఆ పార్టీకి మరింత ఆదరణ కనిపించిందని వివరించారు. ఎగ్జిట్ పోల్ వివరాలను ఆదివారం సాయంత్రం ఆయన సాక్షి మీడియాకు తెలిపారు. వైఎస్సార్సీపీకి క్లియర్ కట్ ఎడ్జ్ ఉందని తెలిపారు. టీడీపీ గ్రాఫ్ 2017 నుంచి పడిపోతూ, వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరుగుతోందని ఆయన వివరించారు. 2017లో ట్రాకర్లు పెట్టి ఇప్పటికి ప్రీపోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్‌పోల్...ఇలా మూడుసార్లు సర్వే చేశామని తెలిపారు. 2017 జూలైలో 1.05,000 శాంపిల్స్‌తో సర్వే చేయగా వైఎస్సార్సీపీకి 45.2 శాతం, టీడీపీకి 43.2 శాతం ఓటర్లు మొగ్గు చూపగా టీడీపీకి 82 సీట్లు, వైఎస్సార్సీపీకి 93 నియోజకవర్గాల్లో ఆధిక్యం లభించిందని వేణుగోపాలరావు వివరించారు. 2018 డిసెంబర్లో చేపట్టిన సర్వేలో వైఎస్సార్సీపీకి 44.2 శాతం, టీడీపీకి 41.5 శాతం ఓటర్లు మద్దతు పలికారని వివరించారు. వైఎస్సార్సీపీకి 98–110 సీట్లలోనూ, టీడీపీకి 55–63 సీట్లలో ఆధిక్యం కనపడింది. మూడో ట్రాకర్ ద్వారా చేపట్టిన సర్వేలో నియోజకవర్గానికి 2.500 శాంపిల్స్‌తో సర్వేచేశామని తెలిపారు. దీనిలో 47.8 శాతం వైఎస్సార్సీపీకి, 43.3 శాతం టీడీపీకి అనుకూలంగా ఉంది. టీడీపీ 53 స్థానాల్లో, వైఎస్సార్సీపీకి 122 సీట్లలో ఆధిక్యాన్ని కనబరిచింది. ఏప్రిల్ 2న చేపట్టిన ప్రీపోల్ సర్వేలో వైఎస్సార్సీపీకి 123 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, టీడీపీ 48–51 స్థానాల్లో, జనసేన ఒక స్థానంలో గెలిచే అవకాశాలు కనిపించాయని వేణుగోపాలరావు వివరించారు. ఈ విధంగా వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరుగుతుండగా, టీడీపీ గ్రాఫ్ పడిపోతుందని ఆయన తెలిపారు. ఎగ్జిట్ పోల్‌లో వైఎస్సార్సీపీకి 133–135 అసెంబ్లీ స్థానాల్లో, టీడీపీకి 37–40 స్థానాల్లో, జనసేనకు ఒక్క స్థానంలో ఆధిక్యం ఉందన్నారు. పార్లమెంట్‌కు...వైఎస్సార్సీపీకి 21–22 స్థానాల్లో, టీడీపీకి 3–4 స్థానాల్లో గెలుపు అవకాశాలున్నాయన్నారు. పోల్మేనేజ్మెంట్లో వైఎస్సార్సీపీ సఫలం... వైఎస్సార్సీపీ పోల్మేనేజ్మెంట్లో ముందుంది. ఈసారి జగన్‌కు ఒక అవకాశం అనేది బాగా వినిపించి అది వేవ్‌గా మారిందని ఆయన చెప్పారు. సోషల్ మీడియా కాంపెయిన్లో వైఎస్సార్సీపీ దూసుకుపోయింది. పసుపు–కుంకుమ, డ్వాక్రా మహిళలకు టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు ఫలించలేదు. పసుపు–కుంకుమ మహిళలు, డ్వాక్రా మహిళలు, నాన్ డ్వాక్రా మహిళల్లో ఎక్కువ మంది వైఎస్సార్సీపీకే మొగ్గుచూపారని వివరించారు. -
సస్పెన్షన్లతో కలవరం
సాక్షి, గుంటూరు : గుంటూరు మిర్చియార్డులో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన ప్రభుత్వం 22 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వేణుగోపాలరావును సర్కారు శనివారం సస్పెండ్ చేసింది. డీఈఈ ప్రసాద్‌పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంది. నవంబర్ 30న ఉద్యోగ విరమణ చేసిన మార్కెటింగ్‌శాఖ ఎస్ఈ రాధాకృష్ణమూర్తి హయాంలో జరిగిన అవకతవకలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన యార్డు ఉద్యోగులపై రెండు మూడు రోజుల్లో కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. నాలుగేళ్లలో ఎన్నో కుంభకోణాలు గుంటూరు మిర్చియార్డులో గత నాలుగేళ్లుగా ఎన్నో అవకతకలు, కుంభకోణాలు వెలుగు చూశాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన, లక్షల రూపాయల దుర్వినియోగం, అనధికార లెసైన్సుల జారీ, జీరో వ్యాపారం, బీమా సొమ్ము స్వాహా తదితర ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. గతంలో ముగ్గురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసిన సర్కారు, యార్డులో జరిగిన కుంభకోణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులపై చర్యలకు అవసరమైన నివేదిక ఇవ్వాలని ఐపీఎస్ అధికారి ఎంకే సింగ్‌ను ఆదేశించింది. ఇందులో భాగంగా రెండు రోజుల కిందట యార్డుకు విచ్చేసిన ఎంకే సింగ్ విచారణ జరిపి 22 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అప్పటి నుంచి సంబంధిత ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు వేటు పడుతుందోనని కలవరం చెందుతున్నారు. శనివారం సాయంత్రం ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ముగ్గురు అధికారులపై శాఖాపరమైన చర్యలకు పూనుకోవడం యార్డు ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారోనని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. వేటు పడితే,ఎవర్ని ఆశ్రయించాలన్న అంశాలపై దృష్టి సారిస్తున్నారు. పనుల కేటాయింపులో ఇష్టారాజ్యం.. మార్కెట్ యార్డుల్లో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనుల్ని కాంట్రాక్టర్లకు కేటాయించే విషయంలోనూ ఎన్నో అక్రమాలు జరిగినట్లు తెలిసింది. జిల్లాలోని అన్ని యార్డుల్లోనూ ఇదే తరహా అక్రమాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. మంగళగిరి మార్కెట్ కమిటీకి చెందిన రూ.32 లక్షల పనుల్ని మూడు, నాలుగు పనులుగా విభజించి తమకు అనుకూలమైన ఒకే కాంట్రాక్టర్‌కు కేటాయించినట్లు విచారణలో వెలుగు చూసింది. ఇందుకు బాధ్యుడిగా భావించి ఈఈ వేణుగోపాలరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జిల్లాలోని అన్ని యార్డుల్లోనూ జరిగిన ఇంజినీరింగ్ పనుల్లో ఇదే మాదిరిగా ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చిన ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున కాజేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని యార్డుల్లోని పనులపై విజిలెన్సు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.