ఉట్నూర్, న్యూస్‌లైన్ : దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఏ రషీద్‌ను బుధవారం ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ సస్పెండ్ చేశారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకపోవడం, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడంతో జీవో ఎమ్‌ఎస్ నంబర్ 274 ప్రకారం గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకుడిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
అసలు ఏం జరుగుతోంది..
ఐటీడీఏ ఆధీనంలోని గిరిజన సంక్షేమశాఖలో అసలు ఏం జరుగుతోందని ఆ శాఖకు చెందిన ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇటీవల డీడీటీడబ్ల్యూ రషీద్ సెలవుపై వెళ్లడం, సూపరింటెండెంట్ నారాయణరెడ్డి సస్పెండ్‌కు గురికావడంతో శాఖలో పనులు నిలిచాయి. మొదటి నుంచి ఐటీడీఏ పీవో, డీడీటీడబ్ల్యూ మధ్య సఖ్యత లేదనే ప్రచారం ఉంది. అందుకే జూలై నెల 31న అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ డీడీటీడబ్ల్యూ సెలవుపై వెళ్లి కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహించారనే ప్రచారం ఉంది. అనంతరం రషీద్ నవంబర్ 28న డీడీటీడబ్ల్యూ బాధ్యతలు స్వీకరించి ఈనెల 5న విధుల్లో చేరారు. అయినా వీరిద్దరి మధ్య అంతరం తగ్గలేదు. ఈ విషయమై డీడీటీడబ్ల్యూ రషీద్‌ను అడుగగా.. నాపై ఐటీడీఏ పీవో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. డీడీటీడబ్ల్యూను ఐటీడీఏ పీవో సస్పెండ్ చేసే అధికారం లేదన్నారు. తనపై చర్యలు తీసుకునే అధికారం తమ శాఖ కమిషనర్‌కు, కలెక్టర్‌కు, ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందన్నారు.
డీడీటీడబ్ల్యూ సస్పెన్షన్
Published Thu, Dec 19 2013 5:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement