సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అధికారుల్లో టెన్షన్ ప్రారంభమైంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పని చేస్తూ ఇసుక అక్రమమే కాదు ఇతరత్రా అవకతవకలను కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న కొంత మంది అధికారులకు తాజా సస్పెన్షన్లు ముచ్చెమటలు ఎక్కిస్తున్నాయి. ‘మేం వెనకున్నాం ... అంతా మేం చూసుకుంటాం’ అని భరోసా ఇచ్చిన నేతలెవ్వరూ చిక్కుల్లో పడ్డప్పుడు చిక్కుముడులు విప్పడానికి ముందుకు రాకపోవడంతో ‘విడవమంటే పాముకు కోపం ... కరవమంటే కప్పకు కోపం’ చందంగా అధికారుల పరిస్థితి తయారైంది.
మొన్న రాచర్ల, నేడు కందుకూరు తహసీల్దార్లపై వేటు పడింది. కందుకూరు ఆర్టీవో కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ సుజాతా శర్మ తీసుకున్న నిర్ణయం జిల్లాలో చర్చనీయాంశమైంది. పని చేయని ఉద్యోగులకు ఛార్జి మెమోలు ఇస్తూ వచ్చిన కలెక్టర్ సస్పెన్షన్ల బాట పట్టారు. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపై కలెక్టర్ వేటు వేయడం సాహసోపేతమైన చర్యగానే భావించాలి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించే విధంగా కందుకూరు తహసీల్దార్ నివేదిక ఇవ్వడంతో వేటు తప్పలేదు.
కందుకూరు ఇసుక తవ్వకాల విషయంలో డీఆర్‌డీఎ అధికారులు, సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. వారి పాత్ర కూడా ఉన్నట్లు స్పష్టమైతే వేటుపడే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు పౌరసరఫరాల శాఖకు సంబంధించి కూడా ఇద్దరు సిబ్బందిపై వేటు పడింది. ఈ సస్పెన్షన్లు అక్రమాలను ఎంతవరకూ అడ్డుకుంటాయని ఓ వర్గం ధీమాగా ఉంది. ఒకవైపు అధికార పార్టీ ఒత్తిళ్లకు తట్టుకోలేక సస్పెండ్ చేస్తే పైనుంచి తమపై వేటు పడుతోందని, చేయకపోతే అధికార పార్టీ నాయకులనుంచి బెదిరింపులు వస్తున్నాయని అధికారులు వాపోతున్నారు. కలెక్టర్ వచ్చిన తర్వాత అక్రమ ఇసుక రవాణపై దృష్టి పెట్టారు.
ఎక్కడికక్కడ అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు. అయితే పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలే నేరుగా ఈ అక్రమ రవాణాలో ఉండటంతో అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం పని చేస్తున్న తహసీల్దార్లలో ఎక్కువ మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీల వద్ద నుంచి తెచ్చుకున్న రికమండేషన్ లెటర్లతోనే పోస్టింగ్‌లు వచ్చాయి. దీంతో ఆ నియోజకవర్గ ఇంఛార్జి మాటను కాదని పని చేసే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్న. కందుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతే ఇసుక అక్రమ రవాణాకు నేతృత్వం వహిస్తుంటే తహసీల్దార్ వ్యతిరేకంగా నివేదిక ఎలా ఇవ్వగలరని అధికారులు వాపోతున్నారు.
ఇప్పుడు బదిలీలు కూడా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చేతుల మీదుగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ జోక్యంతో జరిగే బదిలీలలో వారికి వ్యతిరేకంగా తాము పనిచేయలేని పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ ప్రకాశంలో ఇంజినీరింగ్ విభాగంలో ఏడు లక్షల రూపాయల వర్క్ పూర్తి అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ మా పార్టీ కాదు కాబట్టి అతనికి బిల్లు ఇస్తే నీ సంగతి చూస్తానని నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆ అధికారిని బెదిరించినట్లు సమాచారం. కందుకూరులో కూడా ఒక అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
సస్పె (టె) న్షన్
Published Wed, Jul 22 2015 3:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement
Advertisement