ఆస్తులు పెంచుకునేందుకే విజయవాడలో రాజధాని
కర్నూలు: ఎన్నికల్లో సహాయపడిన వారిని కోటీశ్వరులను చేసేందుకే సీఎం చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీలతో కలసి కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకోవడంలో భాగంగానే రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారన్నారు.
భౌగోళికంగా రాజధాని ఏర్పాటుకు విజయవాడ అనువైన ప్రాంతంకాదని సర్వేలు వెల్లడించినా సీఎం ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. 45 అంతస్తుల భవనాలు ఆ ప్రాంతంలో నిర్మిస్తే ఎప్పటికైనా ప్రమాదమని, జరగరాని ప్రమాదం చోటు చేసుకుంటే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రాజధానిగా కర్నూలుకు అన్ని అర్హతలున్నా కనీసం చర్చకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు.
విజయవాడను రాజధానిగా ప్రకటించగానే రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో బల్లలు చరిచి హర్షం వెలిబుచ్చడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే దేశ బడ్జెట్ కూడా సరిపోదన్నారు. ప్రజలను మోసగించేందుకే సీఎం మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదని మోహన్‌రెడ్డి హెచ్చరించారు.