శవరాజకీయాలు మానుకో..:ఎస్వీ మోహన్‌రెడ్డి
సోమిశెట్టికి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి హితవు
కర్నూలు, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మరణాన్ని కూడా రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూడటం తెలుగుదేశం పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి శవరాజకీయాలు చేయడం తగదని టీడీపీ జిల్లా అద్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఎస్వీ హితవు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత శోభానాగిరెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు గౌరవ వందనం సమర్పించడాన్ని సోమిశెట్టి వెంకటేశ్వర్లు వివాదం చేయడం అర్ధరహితమన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం ప్రధాని అధికారిక నివాసంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు నిర్ణయానికి ముందే శోభానాగిరెడ్డి అంత్యక్రియలు జరిగాయన్న వాస్తవ విషయాన్ని సోమిశెట్టి గ్రహించాలని సూచించారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగిన రెండు గంటల తర్వాత కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అమలులోకి వచ్చిందని ఎస్పీ రఘురాంరెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఈ అంశంపై రాద్ధాంతం చేయడం సోమిశెట్టి అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
చనిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిందంటే ప్రజల్లో ఆమె పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారంటే ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. రెండు లోక్‌సభ, 11 శాసనసభ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారో ఆలోచించి పార్టీని పటిష్టం చేసుకునే దిశగా ఆలోచించకుండా శోభానాగిరెడ్డి అంత్యక్రియల అంశాన్ని రాద్ధాంతం చేయడం తగదని విమర్శించారు.
సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు చీము నెత్తురు ఉంటే జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో ఓడిపోయినందుకు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినందున జిల్లా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారో సోమిశెట్టి ప్రకటిస్తే బాగుంటుందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు అనవసర విషయాలను రాద్ధాంతం చేస్తే జిల్లాలో టీడీపీ గల్లంతు కావడం ఖాయమని హెచ్చరించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తేలుతుందన్నారు.