somisetti venkateswarlu
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కర్నూలు : తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడు సభలో తెలుగుతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. మహానాడు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఘర్షణ మొదలైంది. సభ జరుగుతుండగా ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వీరభద్రగౌడ్, నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరి వర్గీయుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంతటితో ఆగకుండా ఒకరిపై మరొకవర్గం దూషణకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆవేశానికి లోనైన వైకుంఠం వర్గీయులు దాడికి దిగడంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే వారిని సభా ప్రాంగణం నుంచి బయటకు పంపించడంతో, సభకు హజరైన టీడీపీ మహిళా కార్యకర్తలు, ప్రజలు ఇంటిదారి పట్టారు. సభ నుంచి ఎవరూ బయటకు వెళ్లిపోవద్దని మహిళా కార్యకర్తలు, టీడీపీ శ్రేణులను జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు జక్కిఉల్లా కోరినా ప్రయోజనం లేకపోయింది. -
శవరాజకీయాలు మానుకో..:ఎస్వీ మోహన్‌రెడ్డి
సోమిశెట్టికి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి హితవు కర్నూలు, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మరణాన్ని కూడా రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూడటం తెలుగుదేశం పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి శవరాజకీయాలు చేయడం తగదని టీడీపీ జిల్లా అద్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఎస్వీ హితవు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత శోభానాగిరెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు గౌరవ వందనం సమర్పించడాన్ని సోమిశెట్టి వెంకటేశ్వర్లు వివాదం చేయడం అర్ధరహితమన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం ప్రధాని అధికారిక నివాసంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు నిర్ణయానికి ముందే శోభానాగిరెడ్డి అంత్యక్రియలు జరిగాయన్న వాస్తవ విషయాన్ని సోమిశెట్టి గ్రహించాలని సూచించారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగిన రెండు గంటల తర్వాత కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అమలులోకి వచ్చిందని ఎస్పీ రఘురాంరెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఈ అంశంపై రాద్ధాంతం చేయడం సోమిశెట్టి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. చనిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిందంటే ప్రజల్లో ఆమె పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారంటే ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. రెండు లోక్‌సభ, 11 శాసనసభ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారో ఆలోచించి పార్టీని పటిష్టం చేసుకునే దిశగా ఆలోచించకుండా శోభానాగిరెడ్డి అంత్యక్రియల అంశాన్ని రాద్ధాంతం చేయడం తగదని విమర్శించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు చీము నెత్తురు ఉంటే జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో ఓడిపోయినందుకు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినందున జిల్లా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారో సోమిశెట్టి ప్రకటిస్తే బాగుంటుందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు అనవసర విషయాలను రాద్ధాంతం చేస్తే జిల్లాలో టీడీపీ గల్లంతు కావడం ఖాయమని హెచ్చరించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తేలుతుందన్నారు. -
కుట్రదారుల నుంచి రాష్ట్రాన్ని రక్షించండి
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: విభజనకు సహకరిస్తున్న వారి నుంచి సమైక్య రాష్ట్రాన్ని రక్షించి సీమాంధ్రులకు న్యాయం చేయాలని టీడీపీ నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాయకులు జాతిపిత విగ్రహాన్ని పూలతో శుద్ధిచేసి సమైక్యాంధ్ర కొనసాగేలా చూడాలని వేడుకున్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు స్వార్థ రాజకీయాలు, మరికొందరు సమైక్య ముసుగులో డ్రామాలాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను విడదసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, రాజీనామాలతో మభ్యపెట్టి రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కుప్పకూలితే రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోతుందని, ఆ దిశగా ప్రజాప్రతినిధులు కార్యాచరణకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.అశోక్‌కుమార్, కె.చంద్రకాంత్, పి.హనుమంతరావుచౌదరి, పి.చందాఖాన్, పాండురంగయాదవ్, మల్లెల పుల్లారెడ్డి, వి.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.