కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: విభజనకు సహకరిస్తున్న వారి నుంచి సమైక్య రాష్ట్రాన్ని రక్షించి సీమాంధ్రులకు న్యాయం చేయాలని టీడీపీ నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాయకులు జాతిపిత విగ్రహాన్ని పూలతో శుద్ధిచేసి సమైక్యాంధ్ర కొనసాగేలా చూడాలని వేడుకున్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కొందరు స్వార్థ రాజకీయాలు, మరికొందరు సమైక్య ముసుగులో డ్రామాలాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను విడదసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, రాజీనామాలతో మభ్యపెట్టి రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కుప్పకూలితే రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోతుందని, ఆ దిశగా ప్రజాప్రతినిధులు కార్యాచరణకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.అశోక్‌కుమార్, కె.చంద్రకాంత్, పి.హనుమంతరావుచౌదరి, పి.చందాఖాన్, పాండురంగయాదవ్, మల్లెల పుల్లారెడ్డి, వి.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
కుట్రదారుల నుంచి రాష్ట్రాన్ని రక్షించండి
Published Tue, Dec 24 2013 3:42 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement