రెండుకళ్ల సిద్ధాంతం, కొబ్బరికాయ సిద్ధాంతం.. ఇలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని కొత్త కొత్త సిద్ధాంతాలు చెబుతున్నా, తెలుగు తమ్ముళ్లు మాత్రం తన్నుకోవడం మానలేదు. ఒకవైపు తెలంగాణ.. మరోవైపు సీమాంధ్ర నాయకులు మాటలతో యుద్ధం చేసుకుంటున్నారు. పార్టీకి పెట్టుబడులు పెడతారన్న ఏకైక ఉద్దేశంతోనే కొంతమందికి అధినేత చంద్రబాబు పదవులు కట్టబెట్టడాన్ని చాలామంది నాయకులు ముందునుంచి జీర్ణించుకోలేకపోయారు. సమయం చిక్కినప్పుడల్లా దాన్ని ఏదో ఒక విధంగా బయటపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు సీమాంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య విభేదాలు కూడా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీంతో రెండు ప్రాంతాల నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.
తెలుగుదేశం పార్టీ తరఫున కనీసం వార్డు సభ్యుడిగా కూడా ఏనాడూ పోటీచేసి గెలవలేని సీఎం రమేష్ను రాజ్యసభ సభ్యుడిగా చేయడం దురదృష్టకరమని టీడీపీ తెలంగాణ ఫోరం చైర్మన్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న సీఎం రమేష్.. తెలంగాణ ప్రాంతంలో నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ పనులను తాము అడ్డుకుంటామని ఎర్రబెల్లి హెచ్చరించారు.
ఎర్రబెల్లి వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా తీవ్రంగానే స్పందించారు. ఎర్రబెల్లిని అసలు చదువు సంస్కారం లేని వ్యక్తిగా రమేష్ అభివర్ణించారు. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం చేయకుండా ఎలా విభజిస్తారని ఆయన ఎర్రబెల్లిని ప్రశ్నించారు. వంద మంది ఎర్రబెల్లిలు వచ్చినా కూడా తెలంగాణ రాదని రమేష్ వ్యాఖ్యానించారు.
ఇలా రెండు వైపులా నాయకులు కర్రలు, కత్తులు పట్టుకున్నంత స్థాయిలో రెచ్చిపోతుండటంతో.. ఏం చేయాలో తెలియక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తల పట్టుకుంటున్నారు. రెండుకళ్లు, కొబ్బరికాయ.. ఇలా అన్ని సిద్ధాంతాలు అయిపోవడంతో ఇపుడు కొత్తగా ఏ సిద్ధాంతం పట్టుకోవాలా అని ఎదురుచూస్తున్నారు!!
తెలుగు తమ్ముళ్లు డిష్షుం.. డిష్షుం
Published Fri, Nov 15 2013 2:09 PM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement