రేవంత్‌తో సమావేశం తర్వాత యాక్టివ్ అయిన ఏపీ సీఎం
రెండుకళ్ల సిద్ధాంతం మరోమారు తెరపైకి
చంద్రబాబును కలిసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గాందీ, ప్రకాశ్‌గౌడ్
మంత్రి తుమ్మలతోనూ ప్రత్యేక సమావేశం
ఎన్‌డీఏ కీలక భాగస్వామిగా ఉంటూ సరికొత్త రాజకీయం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలంగాణలో అడుగుపెట్టగానే రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి తెరపైకి తెచ్చిన చంద్రబాబు.. బీఆర్‌ఎస్ టార్గెట్‌గా సరికొత్త రాజకీయానికి సిద్ధమయ్యారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు..తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో అధికారిక సమావేశానంతరం తెలంగాణవాదులు ఊహించినట్టుగానే పావులు కదపడం మొదలుపెట్టారు.
తెలంగాణలో తన రాజకీయశత్రువు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్‌గా పాత తెలుగుదేశం ప్రజాప్రతినిధులను ఏకం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలో మరికొంత మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో టీడీపీలో ముఖ్య నాయకులుగా ఉండి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో చంద్రబాబు టచ్‌లోకి వెళ్లినట్టు తెలిసింది.
ఆదివారం బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్) చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌లో నెలకొన్న పరిస్థితులపై వారితో చర్చించి , భవిష్యత్ చూసుకోవాలని సూచించినట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పట్లో టీడీపీ తెలంగాణలో బలపడే అవకాశం లేనందున, ముందు కాంగ్రెస్‌లోకి వెళ్లి బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని హితబోధ చేసినట్టు సమాచారం.
చంద్రబాబును కలిసిన ఇద్దరితోపాటు బీఆర్‌ఎస్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ పరిధిలోని 8 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయం తెలంగాణలో చర్చనీయాంశమైంది. వీరే కాకుండా కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతిని«ధులు కూడా కాంగ్రెస్‌లో చేరేలా మంత్రాంగం నడుస్తుందని సమాచారం.
ఎన్‌డీఏ కీలకనేతగా ఉంటూ కాంగ్రెస్‌కు మద్దతు !
రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ ఓవైపు ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంటూనే, తెలంగాణలో కాంగ్రెస్‌కు అండగా నిలుస్తూ సంకీర్ణ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖిస్తోందనే చర్చ సాగుతోంది. ఎన్‌డీఏలో భాగస్వాములైన జనసేన, బీజేపీ నాయకులెవరూ తెలంగాణకు వచ్చిన చంద్రబాబును కలవకపోగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఆయనతో భేటీ కావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
విభజన సమస్యల పేరుతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో శనివారం సమావేశమైన చంద్రబాబు ఆదివారం పూర్తిగా రాజకీయ సమావేశాలతోనే గడపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించడం అందుకు ఉదాహరణ.
ఆ తర్వాతే ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బాబుతో సమావేశమయ్యారు. వీరి బాటలోనే మరికొందరు టీడీపీ మాజీ నేతలు బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని చేసిన వ్యాఖ్యలను రాజకీయవర్గాలు వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగురాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా ఆదివారం నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు వచ్చారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి పార్టీ కార్యాలయం వరకు తెలంగాణ టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణగడ్డపై టీడీపీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీలో విజయానికి పరోక్షంగా కృషి చేసిన తెలంగాణ పార్టీశ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీని వదల్లేదని చెప్పారు. తెలంగాణలో నాలెడ్జి ఎకానమీకి తాను సీఎంగా ఉమ్మడిరాష్ట్రంలో నాంది పలికినట్టు చంద్రబాబు చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభివృద్ధిని కొనసాగించాయన్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చూపిన చొరవ అభినందనీయమని చెప్పారు.
ఈ సందర్భంగా రేవంత్‌కు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగురాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాలని, వివాదాలుంటే నష్టాలే ఎక్కువ అని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయని, సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నా, తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment