స్విమ్స్‌లో ఏసీబీ సోదాలు
తిరుపతి : టీటీడీ ఆర్థిక సహకారంతో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుపతిలోని స్విమ్స్‌లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ జాయింట్ డెరైక్టర్ సత్యనారాయణ, డీఎస్పీ శంకర్‌రెడ్డి నేతృత్వంలో ఆరుగురు బృందాలు (ఒక్కో బృందంలో 15మంది అధికారులు) స్విమ్స్‌లోని వివిధ పరిపాలన, వైద్య విభాగాలతో పాటు మెడికల్ యూనివర్సిటీ పరిధిలోని అకడమిక్ విభాగాల్లో ఉదయం 10 గంటల నుంచి సోదాలు చేపట్టాయి. ప్రతి విభాగానికి సంబంధించిన అన్ని ఫైళ్లను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ముఖ్యంగా ఆస్పత్రి పాత భవనంలోని సంజయ్ మెహ్రా బ్లాక్‌లోని జీఎం పేషీ, ఎంఎస్ కార్యాలయాల్లోని ప్రతి ఫైలును ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తనిఖీ చేపట్టి కొన్ని అనుమానాస్పద ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్విమ్స్‌లో ఏసీబీ సోదాలు చేస్తున్న సమాచారం అందుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి మీడియా వద్దకు వచ్చి సోదాల గురించి వివరించారు. తాము స్విమ్స్‌లోనే కాకుండా రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మంగళవారం సోదాలు చేపట్టామన్నారు. ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఏవీ లేవని, నిధులు ఎక్కువగా కేటాయింపు జరుగుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీలు చేయడం తమకు సాధారణమని వివరించారు. స్విమ్స్‌కు సంబంధించిన సోదాలు మంగళవారం రాత్రంతా కొనసాగుతాయన్నారు.