
ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న వీసీ దామోదరం
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నివురుగప్పిన నిప్పులా ఉన్న గొడవలు మళ్లీ మొదలయ్యాయి. రెండు రోజుల క్రితం కళాశాల వసతి గృహంలో రెగ్యులర్, డ్యూయల్ డిగ్రీ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. విద్యార్థులు పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ నలుగురు అధ్యాపకులతో కమిటీ వేశారు. ఈ నెల 13లోపు కమిటీ తన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వీసీ దామోదరం సోమవారం కళాశాలను సందర్శించి విద్యార్థులకు తగిన హెచ్చరికలు జారీ చేశారు. ఎస్వీయూలో 2014 నుంచి 6 సంవత్సరాల బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సును ప్రారంభిం చారు. అంతకు ముందు బీటెక్ రెగ్యులర్ కోర్సు మాత్రమే ఉంది. ఈ కోర్సు ప్రారంభమయ్యాక వసతి గృహంలో గదుల కొరత ఏర్పడింది.
తరగతి గదుల కొరత ఉంది. ఈ రెండు కోర్సుల విద్యార్థుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. గత ఏడాది సెప్టెంబర్ 4న రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగడంతో పాటు ప్రిన్సిపాల్ చాంబర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 10 మందిపై కేసు నమోదు కావడంతో పాటు రిమాండ్‌కు వెళ్లి వచ్చారు. కళాశాలలో గొడవలను సద్దమణిచేందుకు వారం రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించారు. ఏప్రిల్‌లో నిర్వహించిన ర్యాప్సోడిలోనూ గొడవ జరగడంతో కార్యక్రమాన్ని మధ్యలో రద్దు చేశారు. ఈ ఘటనల వల్ల ఈ ఏడాది నుంచి ఈ కోర్సును రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. కొందరు రిటైర్డ్ ప్రొఫెసర్ల ఒత్తిడితో ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదిలావుండగా శనివారం రాత్రి ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో కొందరు విద్యార్థులు మద్యం తాగి పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రిన్సిపాల్ ప్రదీప్‌కుమార్ విచారణ కమిటీ వేశారు.
కళాశాలను సందర్శించిన వీసీ..
ఎస్వీయూ వీసీ దామోదరం సోమవారం ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు. తరగతి గదుల్లో, వసతి గృహాల్లో క్రమశిక్షణతో మెలగాలని ఆదేశించారు. అధ్యాపకులు విద్యార్థుల ప్రవర్తనను నిరంతరం పరిశీలించాలని సూచించారు. చక్కగా చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment