svu university
-
డ్రాగన్ ప్రూట్ కన్నా అధిక పోషక విలువలు..
నిలువెల్లా ముళ్లుండే మొక్క బ్రహ్మజెముడు.. మెట్ట/ తీర ప్రాంతీయులకు తెలిసిన మొక్కే. బ్రహ్మజెముడు పండ్లు తినదగినవే అని కూడా తెలిసినా.. వీటికీ వాణిజ్యపరమైన విలువ ఉందని డా. చెన్నకేశవరెడ్డి పరిశోధనలు రుజువు చేశాయి. ఒకసారి నాటితే చాలు. తీవ్ర కరువొచ్చినా, తుపాన్లు వచ్చినా తట్టుకొని బతికి పండ్లను అందించే మొక్కలివి అంటున్నారాయన. వైఎస్సార్ జిల్లా కడప సమీపంలోని ఆలంఖాన్ పల్లెలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చెన్నకేశవ రెడ్డి తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్‌లో ఆహార శుద్ధి సాంకేతికత విభాగంలో ఎమ్మెస్సీ చదివారు. ఆ తర్వాత అక్కడే పీహెచ్డీ కోర్సులో చేరి బ్రహ్మజెముడు (ఒసన్షియా ఫైకస్ ఇండికా) పండ్లతో వివిధ ఆహారోత్పత్తుల తయారీపై అసిస్టెంట్ ప్రొఫెసర్ కేవీ సుచరిత పర్యవేక్షణలో పరిశోధనలు చేశారు. బ్రహ్మజెముడు పండ్ల గుజ్జుతో ప్రూట్ బార్ (తాండ్ర), బ్రహ్మజెముడు పండ్ల స్క్వాష్ (నీటిలో కలుపుకొని తాగడానికి వీలయ్యే గుజ్జు)లను ఫుడ్ సేఫ్టీ అథారిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా తయారు చేయటంపై విశేష పరిశోధనలు చేసి సఫలీకృతమయ్యారు. 2012లోనే వీటి తయారీ పద్ధతిపై పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు. ప్రూట్ బార్ (తాండ్ర) తయారీ పద్ధతిపై పేటెంట్ ఇటీవలే మంజూరైంది. స్క్వాష్‌పై పేటెంట్ రావాల్సి ఉంది. ఈ రెంటితోపాటు.. అత్యంత నాణ్యమైన ఇసుక ఉత్పత్తిపైన, ఆరోగ్యానికి హానికరం కాని హెర్బల్ ఆల్కహాల్ తయారీ పద్ధతిపైన కూడా పరిశోధనలు పూర్తిచేసి, పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు. పులివెందులలోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏడేళ్లు పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేసిన చెన్నకేశవరెడ్డి 2017లో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్ (కేంద్ర వాణిజ్య శాఖకు అనుబంధ సంస్థ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బ్రహ్మజెముడు పండు ఎరుపు, గులాబి రంగులో ఉంటాయి. వాటితో జామ్స్, స్వాకష్, ఐస్‌క్రీమ్స్, జ్యూస్, జెల్లీలు తయారు చేసుకోవచ్చు. పండు గింజల నుంచి నూనె కూడా తీయవచ్చు. ఈ మొక్కలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని అమెరికన్ పుడ్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. వీటిని అమెరికన్లు అల్పాహారంగా తీసుకుంటారు. బ్రహ్మజెముడు పండు ఉత్పత్తులను ఆహార శుద్ధి పరిశ్రమల్లో ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ఈ పండులో పోషక విలువతో పాటు ఔషధ గుణాలు ఉన్నాయని, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి నివారణకు ఇవి దోహదపతాయన్నారు. కార్బొహైడ్రేడ్లు, విటమిన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. ఇందులోని ఔషధ గుణాలు స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తాయి. అంగోలా, మెక్సికో, మొరాకో, సిసిలీ, పొర్చుగల్ దేశాల్లో ఈ మొక్కలను సాగు చేస్తున్నారు. మెక్సికోలో జన్యుపరంగా అభివృద్ధి చేసి ముళ్లు లేని బ్రహ్మజెముడు వంగడాన్ని రూపొందించి సాగు చేస్తున్నారు. సౌదీ అరేబియాలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో అనేక ఆహార పదార్థాలు రూపొందించి అందిస్తున్నారు. బీట్రూట్ అందించే పోషక విలువలను ఇది అందిస్తుంది. కరువు ప్రాంతమైన రాయలసీమలో పంట సాగు, లాభాల ఆర్జన అత్యంత కష్టతరం. ఇలాంటి నేలల్లో బ్రహ్మజెముడు లాంటి పంటల సాగు ద్వారా ఎలాంటి పెట్టుబడీ లేకుండా ఆదాయం పొందవచ్చన్నది డా. చెన్నకేశవరెడ్డి మాట. – బూచుపల్లి హరిమల్లికార్జున రెడ్డి, ఎస్వీయూ క్యాంపస్, తిరుపతి ఎకరానికి 2 వేల ఆకులు నాటాలి! బ్రహ్మజెముడు.. భూసారం లేని, ఇసుక నేలల్లో, అటవీ భూముల్లో తనంతట తానే పెరిగే కరువు నేలల మొక్క. ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. 2X2 మీటర్ల దూరంలో బోదెలపై నాటుకోవాలి. ఎకరానికి 2 వేల ఆకులు నాటాలి. మూడు ఆకులతో కూడిన కాండాన్ని కత్తిరించి.. కింది ఆకు నేలలోకి వెళ్లేలా నాటాలి. ఒక్కసారి నాటితే.. ఎన్నో ఏళ్లపాటు రైతుకు ఆదాయాన్నిచ్చే పంట బ్రహ్మజెముడు. తీవ్ర కరువొచ్చినా.. వరద వెల్లువైనా తట్టుకొని నిలబడగలగడం.. స్థిరంగా ఏడాదికోసారి పండ్ల దిగుబడినివ్వటం దీని విశిష్టత. ప్రత్యేకించి నీటి తడులు అవసరం లేదు. వర్షం పడినప్పుడు నీటిని పీల్చుకొని బ్రహ్మజెముడు మొక్క తన ఆకుల్లోనే నీటిని నిల్వ ఉంచుకుంటుంది. ఏ మొక్క ఆకుల్లోనైనా సూక్ష్మ పత్ర రంధ్రాలుంటాయి. ఈ పత్ర రంధ్రాల ద్వారా ఏ మొక్కయినా నీటి తేమను వాతావరణంలోకి వదులుతూ ఉంటుంది. అందుకే ఆ మొక్కలు బతకడానికి నీటి అవసరం ఉంటుంది. బ్రహ్మజెముడు అలా కాదు. పత్రరంధ్రాలు మూసుకుపోయి ఉంటాయి. కాబట్టి నీటి అవసరం కూడా ఈ మొక్కకు తక్కువగానే ఉంటుందని చెన్నకేశవరెడ్డి తెలిపారు. డ్రాగన్ ప్రూట్ కన్న అధిక పోషక విలువలు కల్గిన బ్రహ్మజెముడు పంటకు ఎలాంటి ఖర్చూ లేదన్నారు. చిన్న రైతులకు ఉపయోగకరం వాణిజ్య పంటల సాగుకు పెట్టుబడి అధికంగా పెట్టాలి. తగినంత నీటి వసతి కావాలి. ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాలి. అయితే, బ్రహ్మజెముడు పంట సాగుకు ఇవేమీ అక్కర్లేదు. బంజరు లేదా ఎడారి భూముల్లోనూ బ్రహ్మజెముడును సాగు చేయొచ్చు. విత్తనాలు కూడా అవసరం లేదు. మొక్క (ఆకులు) భాగాలు తీసి పక్కన పాతితే ఈ చెట్లు పెరుగుతాయి. ప్రతి ఏటా మే–జూన్ నెలల్లో పండ్లు కోతకు వస్తాయి. ఒకసారి నాటితే దశాబ్దాల పాటు దిగుబడినిస్తాయి. వీటిని మెక్సికో తరహాలో జన్యుపరంగా అభివృద్ధి చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎటువంటి పంటలకూ పనికిరాని బంజరు భూముల్లో వీటిని నాటాలి. ప్రతి ఏటా మంచి ఆదాయం వస్తుంది. చిన్న రైతులకు ఉపయోగకరం. – డాక్టర్ సంగటి చెన్నకేశవరెడ్డి (99856 63785), అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్, బెంగళూరు -
ఎస్వీయూలో కలకలం
సాక్షి, చిత్తూరు: ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య ఆత్మహత్య క్యాంపస్‌లో కలకలం రేపుతోంది. ఈ సంఘటనతో విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, వార్డు వార్డెన్ పదవులకు రాజీనామా చేశారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన క్యాంపస్‌లో సంచలనం రేపుతోంది. ఈ ఉద్యోగి తాను చనిపోయే ముందు తన చావుకు కారణాన్ని వీడియోలో రికార్డు చేసి పంపడం పలు ఆలోచనలకు రేకెత్తిస్తుంది. హాస్టల్ వార్డెన్, సూపరింటెండెంట్, మరో ఉద్యోగి తనను ఇబ్బందులకు గురిచేశారని వారిని నమ్మొద్దని, వసతి గృహం జాగ్రత్త అని విద్యార్థులకు తన వీడియో ద్వారా హెచ్చరించారు. అసలేం జరుగుతోంది ? ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల 2017లో వరుస వివాదాల్లో చిక్కుకుంది. గత ఏడాది జూన్‌లో రెగ్యులర్, డ్యూయల్ డిగ్రీ కోర్సు విద్యార్థుల మధ్య గొడవలు పెరగడంతో అప్పటి ప్రిన్సిపల్ పద్మనాభం తన పదవికి రాజీనామా చేశారు. ఈ దశలో ప్రిన్సిపల్‌గా ప్రదీప్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. వార్డెన్‌గా పనిచేస్తూ వచ్చిన చెంగయ్యను తొలగించాలని కోరుతూ ఈఏడాది జూన్‌లో విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో ఆయన్ను తొలగించి సత్యనారాయణ మూర్తిని వార్డెన్‌గా నియమించారు. అయితే ఈ దశలో వసతిగృహంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో స్టోర్ ఇన్చార్జ్గా ఉన్న రామచంద్రయ్యను వేరే చోటికి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే ఆయన ఆత్మహత్యకు పాల్పడే ముందు వసతి గృహంలో తనపై నిందలు మోపారని వార్డెన్ సూపరింటెండెంట్ మరో ఉద్యోగిని నమ్మొద్దంటూ తాను విడుదల చేసిన వీడియోలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు బుధవారం ఆందోళన చేయడంతో వార్డెన్‌తో పాటు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ తమ పదవులకు రాజీనామా చేశారు. విద్యార్థుల ఆందోళన ఎస్వీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అనుబంధ వసతి గృహంలో స్టోర్ ఇన్చార్జ్గా పనిచేస్తూ 10 రోజుల క్రితం అదే వసతి గృహంలో వేరే విధులకు బదిలీ అయిన టైంస్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య(52) మృతిపట్ల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు భగ్గుమన్నారు. బుధవారం తరగతులు బహిష్కరించి పరిపాలన భవనం ఎదుట ఆందోళనకు దిగారు. తమతో ఆత్మీయంగా ఉంటూ సేవలు అందిస్తున్న ఉద్యోగి ఆత్మహత్య విద్యార్థులను ఎంతో కలతకు గురిచేసింది. దీంతో విద్యార్థులు పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ధర్నాచేశారు. వార్డెన్, ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.రాజశేఖర్‌రెడ్డి , యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బి. ఓబుల్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అధికారుల వేధింపుల వల్లే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని, దీనిపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ప్రేమ్, సదాశివ, ముని, ప్రభు, మురళీకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రిన్సిపాల్ ప్రదీప్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ నాగేంద్రప్రసాద్, వార్డెన్ సత్యనారాయణమూర్తి, తమ పదవులకు రాజీనామా చేశారు. ఉద్యోగికి న్యాయం చేయాలి ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పనిచేస్తూ మృతిచెందిన టైంస్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలని టైంస్కేల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రమణ్యంరెడ్డి రిజిస్ట్రార్‌ను కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు టైంస్కేల్ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తమ అభ్యర్థనకు రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు. -
నేనే రాణి–నేనే మంత్రి, అంతా ఆమె ఇష్టమే..
సాక్షి టాస్క్‌ఫోర్స్ ,చిత్తూరు: ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న తిరుపతిలోని ఎస్వీయూలో ఒక మహిళకు ఉన్నత పదవి దక్కింది. అయితే ఆ అరుదైన అవకాశం పొందిన ఆ అధికారి అనతి కాలంలోనే తన ప్రవర్తన, అహంకారం, అధికార దర్పంతో వర్శిటీ ప్రతిష్ట మసకబారేలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే కోడలు కావడం, ఆర్థిక, సామాజిక, రాజకీయ బలం తోడు కావడంతో ఎస్వీయూలో ఆమెకు ఎదురులేకుండా పోయింది. పలు ఆరోపణల నడుమ మాజీ రిజిస్ట్రార్ దేవరాజులు పదవి కోల్పోవడంతో 2017లో అప్పటి వీసీ దామోదరం హోంసైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్కే అనురాధకు రిజిస్ట్రార్ పదవిని కట్టబెట్టారు. ఆమె రిజిస్ట్రార్ అయిన తొలిరోజుల్లో బాగా పని చేసినా అనంతరం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దొడ్డిదారిన అందలం శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఆర్కే అనురాధ 2007లో హోంసైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2006లో ఎస్వీయూలో విడుదలైన అధ్యాపక పోస్టుల భర్తీకి ఆమె అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవంగా ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత సబ్జెక్ట్‌లో ఎంఎస్సీ, పీహెచ్‌డీతో పాటు 5 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి. ఈ సర్వీసు రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. అయితే ఆమె ఎస్వీయూ, మహిళా వర్శిటీలో తాత్కాలికంగా పనిచేసిన బోధన అనుభవానికి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్నారని, ఈ నియామకాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన (స్క్రూటినీ)లో ఆమె దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు రాశారు. అయితే ఆమె చేసిన పైరవీలు ఫలించడంతో అదే దరఖాస్తుపై ఎలిజిబుల్ అని రాశారు. అంతే కాకుండా దీనికి జతపరచిన బోధన అనుభవం సర్టిఫికెట్లో తేదీ లేకుండా జారీ చేశారు. ఈ ధృవ పత్రాలతో నేరుగా అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2013లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందటంతో పాటు 2017 నవంబర్ 30న ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. వివాదాస్పద నిర్ణయాలు ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా తన 18 నెలల పాలనలో పలు వివాదస్పద నిర్ణయాలను తీసుకున్నారు. అకడమిక్ స్టాఫ్ కళాశాలలో అసోసియేట్‌గా పనిచేస్తున్న కోదండరామిరెడ్డికి ప్రొఫెసర్‌గా పదోన్నతి ఇవ్వలేదు. అదే విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వెంకటరమణకు మాత్రం పదోన్న తి కల్పించారు. ఏడుగురు టైం స్కేల్ ఉద్యోగులను తొలగిస్తూ గత నెలలో 22న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉద్యోగుల ఆందోళనతో వీసీ ఈ ఉత్తర్వులు రద్దు చేశారు. ఆంత్రోపాలజీ విభాగంలో ఒక అధ్యాపకుడికి 13 ఏళ్లు, అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగంలో మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 6 ఏళ్లు పాత సర్వీసు కలిపారు. ఈ వ్యవహారంలో ఫైల్ ట్యాంపరింగ్ చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకోలే దు. ఎన్ఎంఆర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎంటీఎస్ ఇవ్వాలని ప్రభుత్వం జీఓ ఇచ్చినా అమలు చేయలేదు. అంతే కాకుండా వీరిని వచ్చే ఏడాదికి కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ ఇటీవల రిజిస్ట్రార్ల సమావేశంలో ఆదేశించినా అమలు చేయలేదు. తన సామాజిక వర్గానికి చెందిన కొందరు అధ్యాపకులకు పెద్ద ఎత్తున మేలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. పట్టించుకోని వీసీ ఎస్వీయూ రిజిస్ట్రార్ అనురాధ వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రస్తుత వీసీ రాజేంద్రప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతే కాకుండా ఆమె ఎక్కువ సమయం వీసీ చాంబర్లోనే తిష్ట వేస్తుండటంతో చాలా మంది తమ సమస్యలు చెప్పుకోలేక పోతున్నారు. వీసీని నిర్ణయాలు తీసుకోకుండా పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సమాచారహక్కు చట్టంతోరహస్యం బట్టబయలు ఎస్వీయూ రిజిస్ట్రార్ నియామకంపై కొందరు విద్యార్థి నాయకులు సమాచార హక్కు చట్టం కిం ద వివరాలు కోరడంతో అమె అడ్డదారి నియామ కం బయట పడింది. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘ నాయకులు గత నెల 30న అమరావతిలో సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. అంత కు ముందు వారు ఎస్వీయూ వీసీ రాజేంద్రప్రసాద్‌తో పాటు ఉన్నత విద్యామండలిలోని ముఖ్య అధికారులను కలసి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆమెపై చర్యలు తీసుకోలేదు. అంతా ఆమె ఇష్టమే... ఎస్వీయూ రిజిస్ట్రార్ అనురాధ వీసీలను, వారి ఆదేశాలను పాటించకుండా, వారు ఆమోదించిన ఫైళ్లను పక్కన పెట్టి తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. ఆమె రిజిస్ట్రార్ అయ్యాక ఇద్దరు వీసీలు మారారు. ప్రొఫె సర్ దామోదరం వీసీగా ఉన్న సమయంలో ఉద్యోగుల బదిలీల ఫైళ్లను పక్కన పెట్టి అమలు చేయలేదు. ఆయన ఆమోదించిన రసాయన శాస్త్ర విభాగాధిపతి ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచి నూతన వీసీ వచ్చాక తన సామాజిక వర్గ ప్రొఫెసర్‌కు ఆ పోస్టు కట్టబెట్టారు. రాజీవ్ గాంధీ కాన్పరెన్స్ హాల్ నిర్మాణ టెండర్ల ఫైల్‌ను వీసీ ఓకే చేసినా ఇప్పటికీ అమలు చేయలేదు. అంబేడ్కర్ గ్లోబల్ లా కళాశాలకు శాశ్వత అనుబంధానికి సంబంధించిన ఫైల్ వీసీ దామోదరం ఆమోదించినప్పటికీ .. రిజిస్ట్రార్ ఇప్పటికీ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇన్చార్జ్ వీసీగా జానకి రామయ్య హయాంలో ఉద్యోగి ఫైల్ ట్యాంపరింగ్ కేసులో ఆయన వేసిన విచారణ కమిటీ ఇచ్చిన ఫైల్‌ను తొక్కిపెట్టారు. సైకాలజీ విభాగాధిపతిగా ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారు. స్పందించని రిజిస్ట్రార్ ఎస్వీయూలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రిజిస్ట్రార్ అనురాధను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించింది. అయితే ఆమె ఫోన్ తీయలేదు. వేరొక నంబర్ నుంచి ఫోన్ చేసి సాక్షి రిపోర్టర్‌ను మాట్లాడుతున్నాను అని చెబుతుండగానే ఆమె ఫోన్ కట్ చేసేశారు. -
ఎస్వీయూలో ఇక పీహెచ్డీ ఈజీ కాదు
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో ఇకపై పీహెచ్డీ డిగ్రీ పొందటం అంత తేలిక కాదు. ఇకపై పరిశోధక విద్యార్థులు సమర్పించే సిద్ధాంత గ్రంథాన్ని మూల్యాంకనం కోసం విదేశీ యూనివర్సిటీలకు పంపనున్నారు. అలాగే ప్రీ–పీహెచ్డీ పాసు మార్కులు 50 నుంచి 55 శాతానికి పెంచారు. ఎస్వీయూలో ఇకపై అడ్మిషన్ పొందే విద్యార్థులకు ఈ నూతన నియమావళి వర్తించనుంది. 2019 గైడ్‌లైన్స్ పేరిట రూపొందించిన ఈ నూతన నియమావళికి యూఆర్సీæ ఆమోదం తెలిపింది. ఎస్వీ యూనివర్సిటీ రీసెర్చ్ కమిటీ (యూఆర్సీ) సమావేశం సోమవారం నిర్వహిం చారు. వీసీ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో యూనివర్సిటీ రీసెర్చ్ గైడ్‌లైన్స్–2019కి ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు ఉన్న యూనివర్సిటీ గైడ్‌లైన్స్–2016 స్థానంలో ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలన్నీ ఇకపై అడ్మిషన్ తీసుకునే వారికి వర్తించనున్నాయి. ఏపీఆర్‌సెట్ ద్వారా అర్హత సాధించిన వారికి వెంటనే అడ్మిషన్ ఇచ్చి ఈ నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పటికే అడ్మిషన్ పొందిన వారు పాత నిబంధనలకు అనుగుణంగానే తమ పరిశోధనలు చేయవచ్చు. 14 సంవత్సరాల తర్వాత ఫారిన్ ఎగ్జామినర్ పీహెచ్డీ చేస్తున్న పరిశోధక విద్యార్థులు వర్సిటీకి సమర్పించిన సిద్ధాంత గ్రంథం ముగ్గురు అధ్యాపకులకు మూల్యాంకనానికి పంపుతారు. గతంలో ఇక విదేశీ యూనివర్సిటీ అధ్యాపకుడికి, ఇద్దరు మన దేశంలోని యూనివర్సిటీల అధ్యాపకులకు మూల్యాంకనానికి పంపేవారు. దీనివల్ల ఆలస్యమవుతోందని భావించిన మాజీ వీసీ ఎస్.జయరామిరెడ్డి 2005లో విదేశీ వర్సిటీల మూల్యాంకనం రద్దు చేశారు. దీనివల్ల పీహెచ్‌డీల మూల్యాంకనం తేలిక అయింది. 14 సంవత్సరాల్లో సుమారు 5 వేల మంది పీహెచ్డీ డిగ్రీలు పొందారు. అయితే ఇటీవల కాలంలో పీహెచ్డీలలో నాణ్యత తగ్గిందని భావించిన యూజీసీ, ఏపీ ఉన్నతవిద్యామండలి విదేశీ వర్సిటీ మూల్యాం కనం తప్పని చేయాలని వర్సిటీలను ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్వీయూలో నిర్వహించిన యూఆర్సీలో ఫారిన్ యూనివర్సిటీ మూల్యాంకనానికి ఆమోదం తెలిపింది. ఇకపై అడ్మిషన్ పొందేవారు వర్సిటీకి సమర్పించే సిద్ధాంత గ్రంథాల్లో ఒకటి విదేశీ వర్సిటీకి, రెండు మన దేశంలో ఇతర యూనివర్సిటీలకు మూల్యాంకనానికి వెళ్లనున్నాయి. 2019 రీసెర్చ్ గైడ్‌లైన్స్ పేరిట నూతన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ఇకపై పీహెచ్డీ అడ్మిషన్ పొందేవారంతా ఈ నిబంధనలు పాటించాలి. ఇది వరకే అడ్మిషన్ పొందినవారికి ఈ నిబంధనలు వర్తించవు. ఈ నిబంధనల్లో మరికొన్ని ఇలా ఉన్నాయి.. ♦ ఇకపై అడ్మిషన్ పొందే వారు పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం సమర్పించే లోపు మూడు సెమినార్లు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో సెమినార్‌కు 50 మార్కులు(ఒక్కో సెమినార్‌కు 2 క్రెడిట్స్). ♦ ప్రీ పీహెచ్‌డీలో రీసెర్చ్మెథడాలజీ 100 మార్కులు(4 క్రెడిట్స్), సబంధిత సబ్జెక్ట్‌కు 100 మార్కులు(4 క్రెడిట్స్) ఉంటాయి. ♦ ప్రీ పీహెచ్‌డీలో పరిశోధక విద్యార్థుల పాస్ మార్కుల శాతాన్ని 50 నుంచి 55కు పెంచారు. ♦ పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం సమర్పించే లోపు 2 పరిశోధన వ్యాసాలు ప్రచురించాలి. ♦ పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం సమర్చించే సమయంలో ప్లాగరిథం(కాపీయింగ్) టెస్ట్ చేయిం చుకోవాలి. ♦ పీహెచ్డీ అడ్మిషన్ పొందేవారు యూజీసీ నెట్, ఏపీ సెట్, ఏపీ రీసెర్చ్ సెట్(ఏపీ ఆర్‌సెట్)లలో ఏదో ఒక దానిలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. ♦ వివిధ పరిశోధన సంస్థల నుంచి ఫెలోషిప్‌లకు ఎంపికైన వారు కూడా పై మూడు ప్రవేశ పరీక్షల్లో ఒకదానిలో అర్హత సాధించాలి. ♦ పీహెచ్డీ కోర్సుల్లో ఇకపై ప్రాథమిక(ప్రొవిజనల్) అడ్మిషన్ ఉండదు. ♦ పీహెచ్డీ అడ్మిషన్ పొందిన వారు తమ పరిశోధన అంశం(టైటిల్) ఖరారు చేసుకునే సమయంలో ఒకటి, ప్రీ పీహెచ్‌డీకి ముందు ఒకటి, సినాప్సిస్ సమర్పించేందుకు ముందు ఒకటి సెమినార్ ఇవ్వాలి. త్వరలో అడ్మిషన్లు ఎస్వీయూ రీసెర్చ్ నూతన గైడ్‌లైన్స్‌కు యూఆర్సీ అనుమతి రాకపోవడంతో ఏపీఆర్‌సెట్–2018లో అర్హత సాధించిన వారికి ఇప్పటివరకు అడ్మిషన్ ఇవ్వలేదు. సోమవారం నూతన నియమావళికి అనుమతి లభించిన నేపథ్యంలో ఏపీఆర్‌సెట్–2018లో అర్హత సాధించిన 150 మందికి వచ్చే వారంలో అడ్మిషన్ ఇవ్వనున్నారు. సోమవారం నిర్వహించిన యూఆర్సీ సమావేశంలో రెక్టార్ జీ.జానకిరామయ్య, రిజిస్ట్రార్ ఆర్కే అనురాధ, రీసెర్చ్ డీన్ విజయభాస్కర్‌రావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ కాలేజీలో మళ్లీ గొడవలు
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నివురుగప్పిన నిప్పులా ఉన్న గొడవలు మళ్లీ మొదలయ్యాయి. రెండు రోజుల క్రితం కళాశాల వసతి గృహంలో రెగ్యులర్, డ్యూయల్ డిగ్రీ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. విద్యార్థులు పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ నలుగురు అధ్యాపకులతో కమిటీ వేశారు. ఈ నెల 13లోపు కమిటీ తన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వీసీ దామోదరం సోమవారం కళాశాలను సందర్శించి విద్యార్థులకు తగిన హెచ్చరికలు జారీ చేశారు. ఎస్వీయూలో 2014 నుంచి 6 సంవత్సరాల బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సును ప్రారంభిం చారు. అంతకు ముందు బీటెక్ రెగ్యులర్ కోర్సు మాత్రమే ఉంది. ఈ కోర్సు ప్రారంభమయ్యాక వసతి గృహంలో గదుల కొరత ఏర్పడింది. తరగతి గదుల కొరత ఉంది. ఈ రెండు కోర్సుల విద్యార్థుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. గత ఏడాది సెప్టెంబర్ 4న రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగడంతో పాటు ప్రిన్సిపాల్ చాంబర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 10 మందిపై కేసు నమోదు కావడంతో పాటు రిమాండ్‌కు వెళ్లి వచ్చారు. కళాశాలలో గొడవలను సద్దమణిచేందుకు వారం రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించారు. ఏప్రిల్‌లో నిర్వహించిన ర్యాప్సోడిలోనూ గొడవ జరగడంతో కార్యక్రమాన్ని మధ్యలో రద్దు చేశారు. ఈ ఘటనల వల్ల ఈ ఏడాది నుంచి ఈ కోర్సును రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. కొందరు రిటైర్డ్ ప్రొఫెసర్ల ఒత్తిడితో ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదిలావుండగా శనివారం రాత్రి ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో కొందరు విద్యార్థులు మద్యం తాగి పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రిన్సిపాల్ ప్రదీప్‌కుమార్ విచారణ కమిటీ వేశారు. కళాశాలను సందర్శించిన వీసీ.. ఎస్వీయూ వీసీ దామోదరం సోమవారం ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు. తరగతి గదుల్లో, వసతి గృహాల్లో క్రమశిక్షణతో మెలగాలని ఆదేశించారు. అధ్యాపకులు విద్యార్థుల ప్రవర్తనను నిరంతరం పరిశీలించాలని సూచించారు. చక్కగా చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. -
సైన్స్ కాంగ్రెస్‌కు 9 మంది నోబెల్ విజేతలు
తిరుపతి: ఎస్వీయూనివర్సిటీలో జనవరి 3 నుంచి 7 వరకు నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు 9 మంది నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు హాజరవుతారని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీ.నారాయణరావు పేర్కొన్నారు. తిరుపతిలోని ఒక ప్రవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సుకు 9 మంది నోబెల్ విజేతలు హాజరవుతారన్నారు. వీరిలో ముగ్గురు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన వారే ఉన్నారని తెలిపారు. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, బంగ్లాదేశ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కూడా హాజరవుతారని చెప్పారు. సదస్సుకు 10 నుంచి 12 వేల మంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతిరోజు ఉదయం నోబెల్ విజేతలతో ఉపన్యాసాలు, మధ్యాహ్నం నుంచి పరిశోధన పత్రాల సమర్పణ ఉంటుందని నారయణరావు అన్నారు. సమావేశంలో ప్రధానంగా ఆహార భద్రత, సౌరశక్తి, ఫోటోవోల్టాయిక్ అండ్ థర్మల్, బ్లూ ఎకానమీ-భారతీయ కృషి, డిజిటల్ ఇండియా అండ్ స్మార్ట్ సిటీలు, సైబర్ సెక్యూరిటీ, స్వచ్చ భారత్, సైన్స్ విద్య- పరిశోధన, జినోమ్ ఎడిటింగ్, హ్యుమన్ మైక్రోనమీ, గ్రావిటేషన్ వేవ్స్, భారతీయ నైరుతి ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పొరుగుదేశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, తదితర అంశాలపై సమగ్ర చర్చలు జరుగుతాయన్నారు. వ్యవసాయం, అటవీ శాస్త్రం, పశువులు, పశుసంవర్ధకం, మత్స్య శాస్త్రం, ఇంజనీరింగ్ సెన్సైస్, పర్యావరణ శాస్త్రం, సమాచార ప్రసార సాంకేతికత, మెటీరియల్ సైన్స్, వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం,రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, బయోటెక్నాలజీ తదితర అంశాలపై సమాంతర సమావేశాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో లోకల్ సెక్రటరీ ఎస్.విజయభాస్కర్‌రావు పాల్గొన్నారు.