బడా సంస్థలకు కట్టబెట్టేందుకు రాజధాని పేరుతో వేలాది ఎకరాల సేకరణ జరుగుతోందని కట్టుబానిసల విముక్తి ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ చెప్పారు.
విజయవాడ : బడా సంస్థలకు కట్టబెట్టేందుకు రాజధాని పేరుతో వేలాది ఎకరాల సేకరణ జరుగుతోందని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ చెప్పారు. పేదల హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలే శరణ్యమని పేర్కొన్నారు. గ్రామీణ పేదల సంఘం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ఐదో మహాసభలను పురస్కరించుకొని విజయవాడ గాంధీజీ హైస్కూల్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం బహిరంగసభ నిర్వహించారు. స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ ఛత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాలకు చాలా తక్కువ భూమిలోనే రాజధాని నిర్మాణం జరిగిన విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. దేశంలో పేదలు, రైతులు రోజురోజుకూ దిగజారుతున్నారన్నారు. అలాగే భూస్వాములు ఇతర పెత్తందార్లు నల్లధనాన్ని దోచుకుంటూ కోట్లు కూడబెడుతున్నారని చెప్పారు. వారి చేతల్లోనే అధికారం సైతం కేంద్రీకృతమవుతుందన్నారు. పేదలు కనీస బట్ట కరువై అల్లాడుతుంటే ప్రధాని మోదీ పది లక్షల విలులైన బంగారు తీగలతో కూడిన సూట్ వేసుకొని తిరుగుతున్నారన్నారు. అనీల్‌అంబానీ ముంబాయిలో 27 అంతస్తుల్లో వేలాది కోట్లను వెచ్చించి విలాస భవనాన్ని కట్టుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత 30 వేల చీరలతో అలరారుతున్నారన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిల్మ్‌సిటీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఈ విధమైన అసమానతలు దేశంలో కొనసాగుతున్నపుడు పేదలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. పేదల హక్కుల పరిరక్షణ ఉద్యమాలకు తాను అండగా ఉంటానని హామీనిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన గ్రామీణ పేదల సంఘం సహాయ కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్‌డీఏ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాయన్నారు. కానీ వాటిని ఏమాత్రం నెరవేర్చే ఆలోచన చేయడం లేదన్నారు. మరోవైపు చంద్రబాబు రాజధాని జపం చేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కర్నాటక ట్రేడ్ యూనియన్ నేత ప్రొఫెసర్ కేఎస్ శర్మ, ఎస్‌సీసీఆర్‌ఐ (ఎంఎల్) నేత సిహెచ్‌ఎస్‌ఎన్ మూర్తి, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రీయ జనవాదీ మోర్చా అధ్యక్షుడు రవిశంకర్, సీపీఐ (ఎంఎల్) వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సుబ్రతోబసు, ఆల్ ఇండియా వర్కర్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి బాలగోవింద్‌సింగ్, విప్లవకమి నిఖిలేశ్వర్, ఓపీడీఆర్ రాష్ట్ర నేత సిహెచ్.కొండేశ్వరరావు, నవోదయ నేత జతిన్‌కుమార్, రెవల్యూషనరీ డెమోక్రాట్ నేత మావో సియాంగ్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సదాశివరావు, గ్రామీణ పేదల సంఘం నేతలు కొమరం శారదా, పడిగ ఎర్రయ్య, జి.వెంకటాద్రి తదితరులు ప్రసంగించారు.