నేటి నుంచి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు
ఐనవోలు (వర్ధన్నపేట రూరల్), న్యూస్‌లైన్ : కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా భక్తుల హృదయాల్లో కొలువైన ఐనవోలు మల్లికార్జునస్వామి(ఐలోని మల్లన్న) జాతర బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ పాలకమండలి, అధికార యంత్రాంగం చేపట్టింది.
ఈ జాతరకు ప్రత్యేకలెన్నో ఉన్నాయి. బోనాలు, ఒగ్గుపూజారులు వేసే పట్నాలు, గజ్జెల లాగులతో భక్తుల నృత్యాలు, శివసత్తుల పూనకా లు, వరాల మొక్కుబడులు, కోడెలు కట్టడం.. అరుదైన వారసత్వ సంస్కృతికి నిలయం ఈ ఆలయం. ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు మల్లికార్జునస్వామి కొలిచిన వారికి కొంగుబంగారంగా, ఆపద లో ఆదుకునే దేవునిగా నిత్యపూజలందుకుంటున్నాడు. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు జిల్లాతోపాటు రాష్ట్రంలో ని పలు ప్రాంతాల నుంచి లక్షలా మంది భక్తులు తరలివస్తుంటారు.
ముడుపులుగా కొబ్బరికాయలు
ఆపదల నుంచి గట్టేక్కించమని భక్తులు గర్భగుడిలో టెంకాయ ముడుపులు కట్టడం ఆనవాయితీ. వస్త్రంలో కొబ్బరికాయను భద్రపరిచి స్వామి వారికి ఉత్తరం వైపు ముడుపుకడతారు. కోర్కెలు నెరవేరాక మొక్కులు చెల్లిస్తుంటారు. ఇక్కడి పసుపును బండారిగా పిలుస్తారు.
బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు
ఆదివారం : విఘ్నేశ్వరపూజ, పుణ్యహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణతో ఉత్సవాలు ప్రారంభ మవుతాయి.
సోమవారం : భోగి పండుగ సందర్భంగా స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, తోరణ బంధనం, విఘ్నేశ్వరపూజ, పుణ్యహవచనం, ధ్వజారోహణం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయి.
మంగళవారం : మకర సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగంతో పాటు సాయంత్రం ఎడ్లబండ్లకు ప్రభలు కట్టి గుడిచుట్టు ప్రదక్షిణలు చేస్తారు.
గురువారం : ఉదయం నుంచి సాయంత్రం వరకు మహా సంప్రోక్షణ సమారాధన, పూజాధికాలు జరుగుతాయి. అనంతరం గణపతి పూజ, పుణ్యహవచనం, శతరుద్రాభిషేకాలు, అన్నపూజలు, తీర్థప్రసాద వినియోగం, మహదాశీర్వచనములు, పండిత సన్మానములు నిర్వహిస్తారు.
నేటి నుంచి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు
Published Sun, Jan 12 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement