సాక్షి, విజయవాడ: అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందని శారదాపీఠం ఆనాడే చెప్పిందని, అందుకు తెలుగునాట ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులే నిదర్శనమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. భవిష్యత్తును ఊహించే ఏకైక పీఠం శ్రీ శారదాపీఠం ఆయన పేర్కొన్నారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ (కిరణ్ బాలస్వామి) సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించారు. ఆయనకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. మూడురోజులపాటు జరిగిన ఈ మహోత్సవం ముగింపు సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు.
(చదవండి: ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం)
శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాలస్వామి నియమితులైన ఈ రోజు ఎంతో విశేషమైన రోజు అని అన్నారు. బాలస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశామని, తన పేరు స్వరూపానందేంద్ర సరస్వతి అని, స్వరూపం అన్నా, స్వాత్మ అన్న ఒక్కటేనని, తామిరువురం అద్వైత స్వరూపులమని ఆయన పేర్కొన్నారు. శారదా పీఠం ఉత్తరాధికారిగా బాలస్వామిని నియమిస్తున్న విషయాన్ని నాలుగేళ్ళ కిందటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తాను చెప్పానని, ఆయన ఎంతో సంతోషించారని తెలిపారు. కేసీఆర్ కూడా ఈ విషయం తెలుసుకొని.. రాజశ్యామల యాగం సందర్భంగా బాలస్వామిని ఘనంగా సత్కరించి తెలంగాణ నుంచి ఆంధ్రకు పంపారని తెలిపారు.
అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందని శారదాపీఠం గతంలోనే చెప్పిందని, అందుకు తెలుగునాట ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు నిదర్శనమని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తులని, వారిద్దరికి అత్యంత ఇష్టమైన వ్యక్తి స్వాత్మానందేంద్ర సరస్వతి అని పేర్కొన్నారు. రాజశ్యామల మాత సాక్షిగా 2024 నాటికి పూర్తిగా పీఠం బాధ్యతలను స్వాత్మానంద్రేంద్ర సరస్వతీకి అప్పగిస్తానని స్వరూపానందేంద్ర ప్రకటించారు. ఆ తరువాత తన జీవితాన్ని తపస్సుకు అంకితం చేస్తానన్నారు. కశ్మీర్ నుంచి లడఖ్ వరకు పాదయాత్ర చేసి.. అక్కడి మంచులోనూ తపస్సు చేసి వచ్చిన యోధుడు స్వాత్మానందేంద్ర సరస్వతి అని పేర్కొన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం ఈ లోకానికి స్వాత్మానందేంద్ర సరస్వతీ రూపంలో ఆధ్యాత్మిక శక్తిని అందించిదని అన్నారు.
మహాభారతం రెండుసార్లు చదివిన వ్యక్తి కేసీఆర్ అని, యాదాద్రి ఆలయాన్ని, వేములవాడ ఆలయాన్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. తన హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని, ఆయన అంటే తనకు పరమప్రాణమని పేర్కొన్నారు. దేవాలయాల పరిరక్షణ కోసం వైఎస్ జగన్ పరితపించారని తెలిపారు. దేవతల ఆశీర్వాదంతో ఇద్దరు సీఎంలు 15 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించాలని, అప్పటివరకు శారదపీఠం తపస్సు చేస్తూనే ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment