నిడమర్రు: పిల్లలు ఇంట్లో ఉండే సమయం ఇది. ఈ సెలవుల్లో ఏదో ఒక వ్యాపకం కల్పించేందుకు ఏదో ఒక వేసవి శిక్షణ శిబిరానికి తీసుకువెళ్తుంటాం. వీటిలో ఈత ముఖ్యమైంది. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందాలంటే కొంచెంసేపు జలకాలాడటమే.. మరి ఈత కొలనులో/సముద్రంలో ఇతర ప్రాంతాల్లో ఈతకు వెళుతున్నప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
కళ్లు జాగ్రత్త
ఈతకొలనులోని నీళ్లలో క్రిమిసంహారిణిగా పనిచేయడం కోసం క్లోరిన్ వంటి రసాయనాలు కలుపుతుంటారు. ఈ క్రిమిసంహారక రసాయనాలు కొందరి చర్మంపై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది. ఈత కొట్టే సమయంలో చాలామంది మునిగి ఈత కొడుతూ నీళ్లలోపల కళ్లు తెరుస్తుంటారు. దీనివల్ల పెద్దగా సమస్య లేకపోయినా.. ఒక్కోసారి నీళ్లను శుభ్రంగా ఉంచేందుకు వాడే క్లోరిన్ వంటి రసాయనాలు కళ్లలోకి వెళ్లడం వల్ల కళ్లు ఎర్రబడటం వంటి కంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రసాయనాలు వాడిన నీళ్లలో ఈదులాడే సమయంలో ఆ నీళ్లు కంటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
లోదుస్తులు మార్చకపోతే..
పల్లెల్లోని బావులు, చెరువుల్లో కేవలం అండర్‌వేర్‌తో ఈత కొట్టేవారు చాలా సందర్భాల్లో ఈత పూర్తయ్యాక వెంటనే లోదుస్తులు మార్చరు. అనుకోకుండా ఈతకు వెళ్లడం లేదా మరే ఇతర కారణవల్లనో లోదుస్తులు మార్చకపోవడం వల్ల ఎలర్జీలు, బాహుమూల ప్రదేశాల్లో పొక్కులు వంటివి రావచ్చు. అందుకని ఈత పూర్తికాగానే లోదుస్తులు మార్చుకుని వెంటనే పొడిబట్టతో శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలి.
సముద్రపు నీటితో ఇబ్బందులు
తీరప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు ఈ సెలవుల్లో ప్రత్యేకంగా సముద్రస్నానం చేయడానికి వెళ్తుంటారు. సముద్రస్నానం తర్వాత మామూలు నీటితో వి«ధిగా స్నానం చేయాలి. మరికొందరిలో అప్పటికే చర్మంపై గాయాలుంటే వాటికి సముద్రపు ఉప్పు నీళ్లు తగలడం వల్ల అవి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.
ఇతర సమస్యలు ఇలా..
కొందరిలో నేరుగా ఈతవల్ల కాకుండా ఈతకు సంబంధం ఉండే ఇతర సమస్యలు కూడా రావచ్చు. ఎక్కువసేపు ఈత కొట్టిన తర్వాత మన చర్మంపై సహజంగా ఉండే చమురు ఇంకి చర్మం పొడిబారుతుంది. ఒక్కోసారి నీళ్లలో ఎక్కువసేపు నానుతూ ఉండటం వల్ల శరీరంలోని లవణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు చర్మం ముడతలు పడిపోయే అవకాశాలు ఉండవచ్చు. దీన్ని నివారించాలంటే ఈత పూర్తయిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్లు రాయాలి. కొంతమందిలో ఈత వల్ల సైనసైటిస్ వంటి సమస్యలు రావచ్చు. అలాంటి సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించాలి.
మరిన్ని జాగ్రత్తలు
♦ ఈతకు వెళ్లే సమయంలో కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలను నివారించవచ్చు. అవి..
♦ స్విమ్మింగ్‌పూల్‌లోకి వెళ్లకముందు, స్మిమ్మింగ్ పూర్తయ్యాక శుభ్రంగా తలస్నానం చేయాలి.
♦ తల తడవకుండా క్యాప్ పెట్టుకోవాలి. అలాగే చెవుల్లోకి నీళ్లు పోకుండా ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి.
♦ ఈతకొలను నీటిలో కలిపే క్లోరిన్ సరైన పాళ్లలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
♦ ఈత సమయంలో శరీరానికి నేరుగా సూర్యకాంతి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే బారెడు పొద్దిక్కిన తర్వాత ఈత కొలనులోకి దిగకూడదు.
♦ సూర్యరశ్మి నేరుగా తగిలేలా ఈదడం వల్ల అతినీల లోహిత కిరణాల కారణంగా చర్మంపై దద్దుర్లు రావచ్చు.
♦ ఈతను వ్యాయామంగా కొనసాగిస్తూ.. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. పరిశుభ్రత పాటిస్తే మంచి ఫిట్‌నెస్ సాధ్యమవుతుంది.
ఈత సమయంలో చెవుల జాగ్రత్తలు ఇలా
స్విమ్మింగ్ పూల్స్‌లో ఈతకొట్టే సమయాల్లో నీళ్లు చెవుల్లోకి వెళ్లి చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి వీలైతే ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి. చెవుల్లోకి నీరు చేరకుండా చూసుకుంటూ, ఈత పూర్తయ్యాక చెవులను పొడిబట్టతో శుభ్రం చేసుకోవాలి.
స్విమ్మింగ్‌పూల్స్ వద్దవచ్చే ఆరోగ్య సమస్యలు
♦ ఫంగల్ ఇన్ఫెక్షన్: ఒక్కోసారి బట్టలు మార్చుకునే చోట్ల అపరిశుభ్రతవల్ల కూడా పాదాలకు ఫంగల్ ఇన్షెక్షన్ రావచ్చు. ఒక్కోసారి వార్ట్స్ (పులిపిరికాయలు) వంటివి కూడా రావచ్చు. అందుకే ఆ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచాలి.
♦ నిత్యం స్విమ్మింగ్‌పూల్‌లోని నీటిలో ఈతకొట్టేవారి వెంట్రుకలు సహజ రంగును కోల్పోయి పేలవంగా అయ్యే అవకాశాలు ఎక్కువ. వెంట్రుకలను క్లోరిన్ రసాయనం బ్లీచ్ చేయడం వల్ల, ఎండ వల్ల ఇలా మారేందుకు అవకాశం ఎక్కువ.
♦ ఈతకొలనువల్ల అలర్జీ రావడం చాలామందిలో సాధారణంగా కనిపించే అంశం. ఈ అలర్జీవల్ల కొందరిలో బ్రాంకైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులు సైతం తలెత్తే అవకాశం ఉంది. అలాంటి ముందుగా వారు వైద్యులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment