అడ్డంగా వసూళ్లు
► దుత్తలూరు తహశీల్దారు కార్యాలయంలో ఇదీ పరిస్థితి
► కొన్నేళ్లుగా ఎన్నో అక్రమాలు
► పెద్ద ఎత్తున లంచాలు.. లేకుంటే పట్టించుకోరు
ఉదయగిరి: తహశీల్దారు లలిత బాధ్యతలు చేపట్టిన నాటినుంచి దుత్తలూరు మండల కార్యాలయం అవి నీతికి అడ్డాగా మారింది. ఈ విషయాన్ని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. లలిత సోమవా రం కావలిలోని ఆమె నివాసంలో లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. దుత్తలూరు తహశీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్న ఏడునెలల వ్యవధిలోనే ఆమె ఎన్నో అక్రమాలకు పాల్పడి రూ.లక్షలు వెనకేశారు. కొంతమంది రెవెన్యూ సిబ్బంది, బయటి వ్యక్తులు వసూళ్లకు పాల్పడుతూ బాధితులను పీల్చి పిప్పిచేసిన వైనంపై చర్చ జరుగుతోంది. కావలిలో తన నివాసాన్నే కార్యాలయంగా మార్చుకుని అక్కడే బేరసారాలు కుదుర్చుకుంటున్నారు.
గతంలో ఈమె కొండాపురం తహశీల్దారుగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడడంతో సస్పెండ్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వం రావడంతో కొంతమంది అధికార పార్టీ నేతలతో కలసి పలువురు అధికారుల అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. ఇక్కడ పనిచేసిన తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడి పెద్ద మొత్తంలో కూడబెట్టారు.
దుత్తలూరు, నాయుడుపల్లి, నర్రవాడ, ముత్తరాశిపల్లి తదితర రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములకు నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదుచేశారు. గతంలో పనిచేసిన ఓ తహశీల్దారు పెద్ద ఎత్తున భూఅక్రమాలకు పాల్పడి రూ.కోట్లు వెనకేశారని అప్పట్లో చర్చ సాగింది. ఆ తహశీల్దారుపై ఏసీబీ కన్నేసిందన్న సమాచారంతో సెలవుపెట్టి తప్పించుకున్నారు. లలిత సుమారు రూ.50 లక్షలు పైగా వెనకేసుకుని ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
దళారులదే హవా
ఈ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ బాలాజీ కీలకంగా వ్యవహరించి తహశీల్దారుకు, బాధితులకు మధ్యవర్తిగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఆయనే కాకుండా నందిపాడు వీఆర్వో, కొత్తపేట వీఆర్‌ఏతో పాటు సోమలరేగడ, నాయుడుపల్లికి చెందిన కొందరు వ్యక్తులు, ఆమె కారు డ్రైవరు ఈ అక్రమాలలో భాగస్వాములుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. జాతీయ రహదారి పరిహారంలో భాగంగా దుత్తలూరు బైపాస్ భూసేకరణలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని విమర్శలున్నాయి. తహశీల్దారు, సర్వేయరు, ఇతర రెవెన్యూ సిబ్బంది కలిపి రికార్డులు తారుమారు చేసి ఆ భూములకు సంబంధం లేనివారిని వారసులుగా చూపించిన వైనంపై కొంత రగడ కూడా జరిగింది.
గతేడాది వర్షాలకు మగ్గాలు దెబ్బతిన్న నేపథ్యంలో 52మంది చేనేత కార్మికులకు సంబంధించిన చెక్కులు పంపిణీ విషయంలో ఒక్కొక్క చెక్కుకు రూ.5వేలు డిమాండ్ చేశారు. వారు ఇచ్చుకోలేకపోవడంతో చెక్కులు తమ వద్దే ఉంచుకున్నారు. నర్రవాడలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తుల పేర్లతో 1బీ, అడంగళ్‌లు ఆన్‌లైన్‌లో నమోదుచేసినట్లు విమర్శలున్నాయి. తహశీల్దారు అవినీతికి అంతులేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది కూడా అందినంతకాడికి దోచుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పనుల విషయమై తహశీల్దారుతో ఒప్పందం చేసుకుని కొంత మొత్తం ముట్టచెప్పిన బాధితులు ఆమె ఏసీబీకి చిక్కిందన్న విషయం తెలియడంతో లబోదిబోమంటున్నారు.