ప్రాణం తీసిన మైనర్ డ్రైవింగ్
- రోడ్డు ప్రమాదంలో టెన్‌త విద్యార్థి దుర్మరణం
- మరో ఇద్దరికి గాయాలు
- పరీక్ష రాసి బైక్‌పై వస్తుండగా ఘటన
- మృతుని తండ్రి కన్నీరమున్నీరు
కొయ్యూరు, న్యూస్‌లైన్: మైనర్ డ్రైవింగ్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. స్థానిక బియ్యం మిల్లు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పరీక్ష రాసి బైక్‌పై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆశ్రమ పాఠశాలకు చెందిన భూత రాజ్‌కుమార్ (15) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి గణితం పేపర్-2 పరీక్ష రాశాడు.
పరీక్ష పూర్తి కాగానే గదబపాలేనికి చెందిన స్నేహితుడు ఎస్.నూకరాజు బైక్‌పై గురుకుల పాఠశాలకు వెళ్లారు. అక్కడ పరీక్ష రాసిన మరో విద్యార్థి మాదల రాజ్‌కుమార్‌ను బైక్‌పై ఎక్కించుకుని ముగ్గురూ బయల్దేరారు. కొయ్యూరు బియ్యం మిల్లు వద్ద వ్యాన్‌ను ఓవర్ టేక్ చేయబోయి పడిపోయారు. బి.రాజ్‌కుమార్‌పై నుంచి వ్యాన్ వెళ్లిపోయింది. వెంటనే అతన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పంపించారు. నర్సీపట్నం చేరువలో రాజ్‌కుమార్ మృతి చెందాడు. గాయపడిన ఎం.రాజ్‌కుమార్, నూకరాజును అంబులెన్స్‌లో నర్సీపట్నం తరలించారు.
ప్రయోజకుడు అవుతాడనుకున్నా..
ప్రమాదంలో మృతి చెందిన భూత రాజ్‌కుమార్‌దిడౌనూరు వద్ద సుద్దలపాలెం. తల్లి లేకపోవడం, ఒక్కడే కుమారుడు కావడంతో తండ్రి పోతురాజు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. కుమారుని మరణ వార్త విన్న అతను కన్నీరుమున్నీరయ్యాడు. ప్రయోజకుడవుతాడని భావించానని, ఇలా కడుపుకోత మిగులుస్తాడని అనుకోలేదని విలపించడం చూపరులను కలచివేసింది. కొయ్యూరు ఎస్‌ఐ రాము కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. విద్యార్థి మృతితో సీఎహెచ్ పాఠశాలలో విషాదచాయలు అలముకున్నాయి. పాఠశాల హెచ్‌ఎం దేవేశ్వరరావు, వార్డెన్ రాజబాబు సంతాపం తెలిపారు.