సాక్షి, విశాఖపట్నం: పౌష్టికాహారం లబ్ధిదారులకు సక్రమంగా అందేలా తగిన చర్యలు తీసుకుంటామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రితో పాటు డైరెక్టర్ కృత్తికా శుక్లా, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ.. 77 మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణను పైలట్ ప్రాజెక్ట్‌గా తమ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి... త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమాలను మొదలు పెడతామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, లోపాలపై దృష్టి పెట్టామన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు, సిబ్బంది రాత పూర్వకంగా సమస్యలు తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు.
మహిళా సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట
ఇక సీఎం జగన్ కూడా తమ శాఖకి అవసరమైన బడ్జెట్‌ను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. అంతేగాక అదనంగా అడిగిన రూ.129 కోట్లు తమ శాఖకు సీఎం జగన్ కేటాయించినట్లు వెల్లడించారు. తమ తరపున తొలిసారి ఉద్యోగులకు గ్రీవెన్స్ నిర్వహించామని, ఉద్యోగుల సమస్యలను గత కొన్నేళ్లుగా పట్టించుకోకపోవడం వల్లే ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ, ఇతరత్రా కారణాల వల్ల సస్పెండ్ అయిన కొంతమంది ఉద్యోగులు పదవి విరమణ ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్నారని తెలిపారు. ఇక గ్రీవెన్స్ ద్వారా ప్రతీ ఉద్యోగి సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే సత్వర పరిష్కారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment