‘టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఒక ధైర్యం... దేశభక్తి... పట్టుదల ... నిస్వార్థ ప్రజాసేవకుడు. చిన్ననాటి నుండే ఒక లక్ష్యాన్ని, ధ్యేయాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలనుకునేవారికి ప్రకాశం పంతులు ఓ స్ఫూర్తి.
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్
టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో నాగార్జునసాగర్, వెంకటేశ్వర యూనివర్శిటీలను స్థాపించారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో క్రమశిక్షణగా జీవించాలంటే ఇలాంటి పెద్దల జీవితాలను తెలుసుకోవాలి.
- మంత్రి శిద్ధా రాఘవరావు
నాటితరం నాయకులు ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం పని చేసి ప్రాణాలు అర్పించారు, ప్రస్తుతం ఎక్కువ మందిలో స్వార్థం పెరిగి పోయింది. మొదటితరం నాయకుల మంచి లక్షణాలను ఇప్పుడున్న తరం అలవర్చుకోవాలి.
- కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్
ఒంగోలు టౌన్ : ‘టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఒక ధైర్యం. ప్రకాశం పంతులు అంటే ఒక దేశభక్తి. ప్రకాశం పంతులు అంటే పట్టుదల. ప్రకాశం పంతులు అంటే నిస్వార్థ ప్రజాసేవకుడు’ అని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. స్థానిక ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో శనివారం జరిగిన ప్రకాశం పంతులు 143వ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రకాశం పంతులు ఒక మహా మనీషి అని, ఆయన జన్మించిన ప్రాంతంలో పాదాభివందనంతోపాటు సాష్టాంగ నమస్కారం చేసేందుకు ఇక్కడకు వచ్చానని చెప్పారు. ప్రకాశం జీవన విధానం, నడవడిక, త్యాగనిరతి ప్రజలపై చెరగని ముద్ర వే శాయన్నారు. అన్ని వర్గాల బంధువుగా ఆయన నిలిచారని కొనియాడారు. ప్రకాశం పంతులు, ఎన్‌టీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతోందన్నారు. ప్రతి ఇంటికీ మంచినీరు, సదుపాయాలు, ఇంటర్‌నెట్, ప్రతి ఎకరాకు నాణ్యమైన విద్యుత్, ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
ప్రకాశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి శిద్దా
టంగుటూరి ప్రకాశం పంతులును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కోరారు. పేదరికంలో పుట్టి మంచి నడవడికతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ముఖ్యమంత్రి అయ్యాక నాగార్జునసాగర్, వెంకటేశ్వర యూనివర్శిటీలను స్థాపించారన్నారు.
ప్రకాశం బాటలో నడుద్దాం : కలెక్టర్
దేశ స్వాతంత్య్ర పోరాటంలో టంగుటూరి ప్రకాశం పంతులు ఘట్టం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ విజయకుమార్ చెప్పారు. ఆయన బాటలో నడిచేందుకు అందరూ ప్రయత్నించాలని కోరారు. నాటితరం నాయకుల్లో ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేసి ప్రాణాలు అర్పించారని, నేటి తరంలో స్వార్థ పెరిగిందని చెప్పారు. జిల్లాపరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ త్యాగానికి మారుపేరు ప్రకాశం పంతులు అని అన్నారు. ప్రకాశం పంతుల జీవిత చరిత్రను జిల్లాపరిషత్ నిధులతో సంక్షిప్తంగా ముద్రించి జిల్లాలోని అన్ని జెడ్పీ పాఠశాలలకు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్‌వీ శేషయ్య, జేసీ యాకూబ్ నాయక్, డీఆర్వో గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు.
తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు కరవది వెంకటేశ్వర్లు, అశ్వద్ధనారాయణలను సన్మానించారు. వర్ధమాన గాయకుడు నూకతోటి శరత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, డీఆర్‌డీఏ పీడీ పద్మజ బృందం ఆలపించిన ‘వందనం వందనం మాతృభూమి’ గీతం ఆకట్టుకుంది. మంత్రి శిద్దా, ప్రభుత్వ సలహాదారు పరకాల చేతుల మీదుగా ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వివిధరకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. డీఆర్‌డీఏ, మెప్మా ద్వారా పలు పొదుపు సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ప్లానింగ్ లేకపోవడంతో గందరగోళం మధ్య సాగింది. కార్యక్రమంలో ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్, ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ పాల్గొన్నారు.
ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నం
నాగులుప్పలపాడు : దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. ప్రకాశం జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఒక పండగలా జరపాలని సూచించిందన్నారు. అందులో భాగంగానే ప్రకాశం పుట్టిన ఊరు వినోదరాయునిపాలెం జెడ్పీ పాఠశాల ఆవరణలో ప్రభుత్వం తరఫున వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పరకాల మాట్లాడుతూ పేదరికంలో పుట్టి తన మేధాసంపత్తితో ఇంగ్లండ్‌లో బారిష్టర్ చదివి కోట్లు గడించాడని తెలిపారు.
అప్పట్లో మద్రాసు హైకోర్టుకు 7 గుర్రాలపై వెళ్లిన జడ్జి కూడా లేరంటే అతిశయోక్తి కాదన్నారు. అలాంటి వ్యక్తి ఆ వృత్తికి సెలవుపెట్టి స్వాతంత్య్రం కోసం తెల్లదొరలపై పోరాడి తన ఆస్తినంతా దేశానికి పెట్టిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రకాశం జీవిత విశేషాలను స్కూల్ విద్యార్థుల పాఠ్యాంశంగా చేర్చాలన్న ఎంపీపీ ముప్పవరపు వీరయ్య అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని పరకాల హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడుతున్న రాజకీయ నాయకులు ప్రజలకు ఏమి చేస్తారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రకాశాన్ని ఆదర్శంగా తీసుకొని అలాంటి సంస్కృతికి సెలవు పలకాలని కోరారు. అనంతరం ప్రభాకర్, బాలాజీ, జెడ్పీ సీఈవో ప్రసాద్‌లు మొక్కలు నాటారు. తొలుత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకాశం విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థుల కళా నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లా రచయిత డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు రచించిన ప్రకాశం జిల్లా విశిష్ఠతను తెలియజేసే పాటకు వినోదరాయునిపాలెం విద్యార్థుల నృత్యం ఆకట్టుకుంది. నాగులుప్పలపాడు మండలం తక్కెళ్లపాడుకు చెందిన కరాటే కళాకారుడు హనుమంతరావు ఇనుప బండలను పగులకొట్టే ప్రదర్శన అబ్బురపరిచింది. ఎంపీడీఓ జాన్ శామ్యూల్, తహశీల్దార్ రమణయ్య, ఎంఈఓ ఈ.వి. రమణయ్య, వేటపాలెం సీడీపీఓ లిదియమ్మ, వినోదరాయునిపాలెం సర్పంచ్ ఉన్నం రవితో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.
ధైర్యానికి ప్రతీకప్రకాశం
Published Sun, Aug 24 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM
Advertisement
Advertisement