తాపేశ్వరం లడ్డు ‘హ్యాట్రిక్’ గిన్నిస్ రికార్డు
మూడోసారీ తాపేశ్వరం లడ్డూ గిన్నిస్ రికార్డులకెక్కింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్స్ సంస్థ ఈ అరుదైన ఘనత సాధించింది. వినాయక చవితి సందర్భంగా గణేష్ మహాలడ్డూల తయారీలో మూడేళ్ల నుంచి వరుసగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంటూ వచ్చింది. 2013లో తయారుచేసిన మహాలడ్డూకు గిన్నిస్ రికార్డ్స్ నుంచి శనివారం సర్టిఫికెట్ అందినట్టు సంస్థ అధినేత సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) తెలిపారు.
తొలిసారిగా 2011లో విశాఖపట్నానికి చెందిన సువర్ణభూమి సంస్థ ఆర్డర్‌తో 5,570 కిలోల లడ్డు, 2012లో రాజమండ్రిలోని రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆర్డర్ మేరకు 6,599.29 కిలోల లడ్డు, 2013 ఆగస్టులో వినాయక చవితి సందర్భంగా అదే కమిటీ వారికి తయారు చేసిన 7,132.87 కిలోల మహాలడ్డూ వరుసగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కాయని వివరించారు. తమ సంస్థ మినహా ప్రపంచంలో ఏ స్వీట్ స్టాల్ మూడుసార్లు గిన్నిస్ రికార్డు సాధించలేదని చెప్పారు.
- న్యూస్‌లైన్, మండపేట