టార్గెట్.. ఆర్కే! | Target .. rk, police combing in AOB | Sakshi
Sakshi News home page

టార్గెట్.. ఆర్కే!

Published Tue, Jan 6 2015 11:23 AM | Last Updated on Sat, Jun 2 2018 3:16 PM

టార్గెట్.. ఆర్కే! - Sakshi

టార్గెట్.. ఆర్కే!

  • నక్సల్స్ అగ్రనేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆల్ ఔట్!
  • తప్పించుకున్న ఆర్కే, ఉదయ్
  • ఉద్రిక్తంగా ఏవోబీ
  • సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/మల్కన్‌గిరి/పాడేరు:  ఆంధ్రప్రదేశ్-ఒడిశా పోలీసుల ముట్టడి నుంచి అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే), ఉదయ్ తప్పించుకున్నారా!  పోలీసువర్గాలు అవుననే చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీ  కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కేతోపాటు  మల్కన్‌గిరి జిల్లా కమిటీ కార్యదర్శి ఉదయ్, ఇతర నేతలే లక్ష్యంగా సమాచారంతోనే ‘ఆపరేషన్ ఆల్ ఔట్’ చేపట్టారు.

    ఒడిశాలోని బేజంగి అడవుల్లో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల నుంచి ఆర్కే, ఉదయ్‌లతోపాటు మరికొందరు అగ్ర నేతలు అంతకుముందే తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ఏపీ-ఒడిశాలకు చెందిన 500మంది పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఆర్కే ఏవోబీలోని బేజంగి అటవీప్రాంతానికి వస్తున్నట్లు పోలీసులకు నవంబర్‌లోనే పక్కా సమాచారం అందింది. జనవరి మొదటి రెండు వారాల్లో అక్కడ మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించనున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.

    ఆర్కేతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా ఈ ప్లీనరీకి హాజరువతారని సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. ఒకేసారి అగ్రనేతలందర్ని తుడిచిపెట్టేస్తే మావోయిస్టు పార్టీని కోలుకోలేని రీతిలో దెబ్బతీయొచ్చని అత్యున్నతస్థాయిలో నిర్ణయించారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు ‘ఆపరేషన్ ఆల్ ఔట్’కు రూపకల్పన చేశాయి. రెండు నెలలుగా మావోయిస్టులు ఏవోబీలో ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నా పోలీసు బలగాలు వ్యూహాత్మకం మౌనం వహించాయి.  
     
    విశాఖపట్నం జిల్లా ఏస్పీ కోయ ప్రవీణ్, ఒడిశాలోని మల్కనగిరి జిల్లా ఎస్పీ మహాపాత్రో కొన్ని రోజుల క్రితం బేజంగి అడవిలో వేర్వేరుగా హెలికాఫ్టర్లలో ఏరియల్ సర్వే నిర్వహించినట్లు  తెలిసింది. అగ్రనేతలతోసహా 200మంది మావోయిస్టులు ప్లీనరీకి హాజరుకానున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. దాంతో ఏపీ గ్రేహౌండ్స్, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దళాలతోపాటు బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ రంగంలోకి దిగాయి. శనివారం బేజంగి అడవిలో నిర్దేశిత ప్రాంతం దిశగా బలగాలు శనివారం బయలుదేరాయి.

    పశ్చిమ దిశ నుంచి ఒడిశా పోలీసులస్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌కుచెందిన 200మంది కదలగా... మరో 200మందితో కూడిన  ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు తూర్పు నుంచి చుట్టుముట్టాయి. ఆదివారం రాత్రికి ఒడిశాలోని పనాసపట్టు, విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టుకు సమీపంలోని పులజలమ మధ్య ఉన్న కొండప్రాంతానికి అటువైపు ఒడిశా బలగాలు, ఇటువైపు ఏపీ బలగాలు మోహరించాయి. సోమవారం తెల్లవారుజామున ఒడిశా పోలీసులు, నక్సల్స్‌కు మధ్య  రెండుసార్లు ఎదురుకాల్పులు జరిగాయి.

    ఈ కాల్పుల్లో దాదాపు ఐదుగురు నక్సల్స్ చనిపోయి ఉంటారని ఒడిశా పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం అందించాయి. మధ్యాహ్నం తరువాత ఇరురాష్ట్రాల పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి మెల్లగా చేరుకున్నాయి. కానీ ఎక్కడా మావోల  మృతదేహాలు కనిపించ లేదు. నక్సల్స్ నేతలు అడవి నుంచి రెండురోజుల క్రితమే వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

    ఆర్కే, ఉదయ్‌లతోపాటు మావోయిస్టులు రెండు రోజుల్లో ఎంతోదూరం వెళ్లి ఉండరని ఉద్దేశంతో పోలీసు బలగాలు బేజంగి అటవీప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. కాగా, మల్కన్‌గిరి జిల్లా ఖొరాయిగుడకు  చెందిన జొగ్గా కావని, జొగ్గా మాడ్కామి అనే ఇద్దరు గిరిజనులను ఇన్ఫార్మర్లన్న నెపంతో ఆదివారం నక్సల్స్ హత్య చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement