- 181 మంది స్మగ్లర్లపై సస్పెక్ట్ షీట్స్
- మరో పది మందిపై పీడీ యాక్ట్
- టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నిరంతర నిఘా
- వారానికొకమారు పోలీసు కౌన్సెలింగ్
- ‘సాక్షి’తో చిత్తూరు టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ రత్న
సాక్షి,చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్ ఉక్కు పిడికిలి బిగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 181 మంది ఎర్రస్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణలో సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తోంది. కొత్తగా మరో పది మంది స్మగ్లర్లపై పీడీ యాక్టు కేసులు సైతం నమోదు చేస్తోంది. ఈ విషయాలను ఏఎస్పీ టాస్క్‌ఫోర్స్ రత్న శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు. ఇప్పటివరకూ పది చందనం స్మగ్లింగ్ గ్యాంగ్‌లపై సస్పెక్ట్ షీట్స్ నమోదు చేసినట్లు చెప్పారు.
ఇందులో ఆయా గ్యాంగుల్లోని లీడర్లతోపాటు వారి అనుయాయులు,ఎస్కార్ట్, వాహనాలు సమకూర్చినవారు, నడిపేవారు తదితరులు ఉన్నారన్నారు. ఒక్కొక్క గ్యాంగ్‌లో ఆరు నుంచి 24 మంది వరకూ ఉన్నారని ఏఎస్పీ చెప్పారు. ఇప్పటివరకూ 181 మంది పైనే షీట్లు ఓపన్ చేసినా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జాబితాలోనివారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. వారానికొకమారు పోలీసు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. వారు తిరిగి స్మగ్లింగ్‌కు పాల్పడితే కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెక్ట్ షీట్‌లో ఆ వివరాలు నమోదు చేస్తామన్నారు.
దీన్నిబట్టి పోలీసులు రౌడీషీట్లు సైతం నమోదు చేసే అవకాశం ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. ఐదుకు మించి కేసులు నమోదైతే పీడీయాక్టు నమోదు చేస్తామన్నారు. ఇప్పటివరకూ 35 పీడీ యాక్టు కేసులు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు. వారిలో 15 మంది వరకూ బెయిల్ పై బయట ఉన్నారన్నారు. వారిపై కూడా నిరంతరం నిఘా ఉంటుందన్నారు. తిరిగి స్మగ్లింగ్‌కు పాల్పడితే మరో మారు పీడీ పీడీయాక్టు కేసులు సమోదు చేసేందుకు వెనుకాడబోమన్నారు. కొత్తగా మరో పదిమంది స్మగ్లర్లపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తున్నామన్నారు. వీరిలో చిత్తూరు,తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. చందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న ఇంటి దొంగలపై చర్యలుంటాయని ఏఎస్పీ తెలిపారు.
ఇందుకోసం ఉన్నతాధికారులు మార్గదర్శకాలు రూపొందిస్తున్నారన్నారు. త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయని ఏఎస్పీ స్పష్టం చేశారు. చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఇప్పటివరకూ 336 కేసులు నమోదు చేశామన్నారు. దాదాపు రెండు వేల మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చిత్తూరు పరిధిలోని కేసులకు సంబంధించి మరో 400 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. వీరితో పాటు మరో పది మంది అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. వీరిలో తమిళనాడు,కర్ణాటక వారు మాత్రమే ఉన్నట్లు ఆమె చెప్పారు.
అంతర్రాష్ట్ర స్మగ్లర్ల జాబితా కూడా ఉందన్నారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన స్మగ్లర్లు ఉన్నట్లు ఏఎస్పీ చెప్పారు. సౌందర్‌రాజన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందన్నారు. కొత్త స్మగ్లర్ల జాబితా తెలిసే అవకాశం ఉందన్నారు. కస్టడీ కోసం కోర్టుకు విన్నవించినట్లు ఆమె చెప్పారు. చందనం స్మగ్లింగ్‌కు అడ్డు కట్ట వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
‘ఎర్ర’ స్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్ ఉక్కు పిడికిలి
Published Sun, Apr 26 2015 2:02 AM | Last Updated on Thu, Jul 11 2019 7:41 PM
Advertisement
Advertisement