తవ్వుకోండి.. నిధులివ్వండి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కృష్ణా, గుంటూరు జిల్లాల ఇసుక రీచ్‌ల నిర్వాహకుల నుంచి టీడీపీ నేతలు నిధులు వసూలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ముఖ్యనాయకుల సూచనల మేరకు విజయవాడ రామవరప్పాడు సెంటరులోని హోటల్‌లో ఇసుక రీచ్‌ల నిర్వాహకులు ఇటీవల సమావేశమయ్యారు. ఇందులో దుగ్గిరాల, చినకాకాని, తాడేపల్లి మండలాలకు చెందిన ఇసుక రీచ్‌ల నిర్వాహకులు కీలకపాత్ర వహించారు.వీరు జిల్లాలోని మిగిలిన ఇసుక రీచ్‌ల నిర్వాహకులు, చెరువుల్లో మట్టిని విక్రయించిన నిర్వాహకులు, కొందరు క్వారీ యజమానులను అక్కడికి పిలిపించారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని పటిష్టం చేయడానికి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా కృషి చేస్తున్నారని, ఆ కృషికి తమవంతు సహకారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అక్కడి అధికార పార్టీ టీఆర్‌ఎస్ నుంచి ఎదురౌతున్న పోటీని తట్టుకోవడానికి కార్పొరేటర్లుగా పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థులకు నిధుల కొరత ఉందని, అందుకు అందరం సహకారం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ నెలాఖరు వరకు రీచ్‌ల్లో సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చినంత ఇసుక తవ్వుకుని విక్రయించుకోండని, రీచ్‌లవైపు అధికారులను కన్నెత్తి చూడకుండా చూసే బాధ్యత తమదని ఆ నాయకులు హామీ ఇచ్చారు. ఈ మేరకు రీచ్‌ల నిర్వాహకులంతా ఆ సమావేశం పూర్తయిన ఒకటి రెండు రోజుల్లో నిధులు సమీకరించి గ్రేటర్ ఎన్నికలకు పంపించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్య నాయకుల హామీ మేరకు ఈనెలాఖరు వరకు రీచ్‌ల వైపు పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌శాఖల అధికారులెవరూ కన్నెత్తి చూడలేదు. విచ్చల విడిగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా గురించి ఆ శాఖల అధికారులకు కొందరు ఫిర్యాదు చేసినా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ సమావేశం తరువాత ఇసుక రీచ్‌లపై కనీసం తనిఖీలు కూడా జరగకపోవడం ఇందుకు ఊతమిస్తోంది.