ప్రత్తిపాడు: పల్లె వాసులకు పన్నుపోటు పొడిచేలా సీఎం చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చితే.. గ్రామంలో రోడ్డు పక్కన బండిపై పెట్టుకున్నా పన్ను కట్టాల్సిందే. ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నా బాదుడు తప్పదు. ఈ క్రమంలో ఆదాయ వనరులను ఎలా పెంచుకోవచ్చు.. కొత్త వనరులను ఎలా రాబట్టుకోవచ్చు.. అనే విషయాలపై సమగ్ర సర్వే జరగనుంది. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి ఆదాయ మార్గాలపై సర్వే చేయాలని పంచాయతీ అధికారులకు ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సర్వే ఇలా చేస్తారు..
5 నుంచి 6 వేల జనాభా ఉన్న గ్రామం లేదా 2 వేల నుంచి 3 వేల వరకు ఇళ్లు ఉన్న పంచాయతీని ఎంపిక చేసుకుంటారు. గురు, శుక్రవారాల్లో సమగ్ర సర్వే చేసి 48 అంశాల్లో నివేదిక తయారు చేయనున్నారు. ఆ గ్రామంలో పన్నుల రివిజన్, రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్, పన్నేతర విషయాల రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలిస్తారు. అనంతరం పంచాయతీ చేస్తున్న పొరపాట్లను గుర్తిస్తారు. పంచాయతీలు కోల్పోతున్న ఆదాయ వనరులను ఎలా రాబట్టుకోవాలో అనే విషయంపై చర్చిస్తారు. ఆయా అంశాలను రాపిడ్ అసెస్మెంట్ ఆఫ్ పంచాయతీ రిసోర్సెస్(ఆర్‌ఏపీఏ) అనేమాడ్యూల్‌ను అప్‌లోడ్ చేస్తారు.ఎంపిక చేసుకున్న గ్రామంలో క్షేత్రస్థాయి సమగ్ర సర్వేలో ఎంపీడీవో, ఈవోపీఆర్డీ అధికారులు ఉంటారు.
వీరితో పాటు పంచాయతీల కార్యదర్శులు, పంచాయతీ ల్లోపనిచేసే ఉద్యోగులు, ఉపాధిహామీ సిబ్బంది ఉంటారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఇరత ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొనేలా అర్హులను ప్రభుత్వం సూచించింది. పంచాయతీలు కోల్పోతున్న ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, లక్ష్యం మాత్రం ఆదాయం పెంచుకోవడమేనని కొందరు విమర్శిస్తున్నారు.
ఇప్పటికే 48 అంశాలతో కూడిన పన్ను ఫార్మేట్‌ను ఆయా పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. ఎన్ని రకాల యూనిట్లు ఉన్నాయి? డిమాండ్ ఎంత తదితర వివరాలతో కూడిన ఈ ఫార్మేట్లపై కార్యదర్శులు కుస్తీలు పడుతున్నారు.గ్రామాల్లో ఇన్ని రకాల పన్నులు విధించేందుకు సర్పంచ్‌లు సుముఖత వ్యక్తం చేస్తారా? పంచాయతీ పాలకవర్గాలు ఇందుకు ఆసక్తి చూపుతాయా? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుంది? వ్యతిరేకత ఎలా ఉంటుంది? అన్న అంశాలపై అధికారులు, సెక్రటరీలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
పన్నుల్లో మచ్చుకు కొన్ని..
హౌస్ ట్యాక్స్, అడ్వర్‌టైజ్‌మెంట్ ట్యాక్స్, వ్యవసాయభూమిపై పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను, వాహన పన్ను, నీటి సరఫరా పన్ను, వీధి దీపాల పన్ను, డ్రైనేజీ చార్జీలు, ప్రైవేట్, పబ్లిక్ ట్యాప్ ఫీజులు, వ్యాపార పన్ను, సెల్ టవర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల పన్ను.. ఇలా అనేక రకాల పన్నులను విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
పల్లెలకు పన్నుపోటు!
Published Thu, Feb 19 2015 2:19 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM
Advertisement
Advertisement