క్షయపై యుద్ధం! | TB Vaccines Shortage in Prakasam | Sakshi
Sakshi News home page

క్షయపై యుద్ధం!

Published Fri, May 17 2019 8:23 AM | Last Updated on Fri, May 17 2019 8:23 AM

TB Vaccines Shortage in Prakasam - Sakshi

ఒంగోలు: క్షయవ్యాధి అంతానికి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది మార్చి 24న జరిగే అంతర్జాతీయ క్షయవ్యాధి నివారణా దినోత్సవంతోపాటు ప్రతి నెలా మూడో శుక్రవారం విధిగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ అవగాహన కల్పించడం, వారిద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా వ్యాధి నిర్మూలించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈనెల 17న తొలి మీటింగ్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సి.హెచ్‌. రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న వైద్య సేవలు తదితరాలపై జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి మద్దిశెట్టి శ్రీనివాసరావు ‘సాక్షి’ పలు విషయాలు వెల్లడించారు. 

జిల్లాలో పరిస్థితి: జిల్లాలో 2003 నుంచి ఇప్పటివరకు 57786 మంది వ్యాధిగ్రస్తులను విజయవంతంగా క్షయవ్యాధి బారినుంచి కాపాడారు. అంతే కాకుండా ప్రతి ఏటా 4వేల మంది వరకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే వ్యాధిగ్రస్తులను నిర్ధారించేందుకు 19 ప్రాంతాల్లో అధునాతనమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. రిమ్స్‌లో ఒకటి, మార్కాపురం జిల్లా వైద్యశాలలో మరొక సిబినాట్‌ (కాట్రిడ్జ్‌ బేస్డ్‌ న్యూక్లిక్‌ యాసిడ్‌ ఆంప్లిఫికేషన్‌ టెస్టు) అనే పరికరాలు ఉన్నాయి. ఇవి కాకుండా 17 కమ్యూనిటీ వైద్యశాలల్లో ఆర్‌.టి.పి.సి.ఆర్‌ ( రియల్‌ టైమ్‌ పొలిమరైజ్‌ చేంజ్‌ రియాక్షన్‌) అనే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో మైక్రోస్కోప్‌ ద్వారా కళ్లెను పరీక్షించి వ్యాధిని నిర్ధారించేవారు. అయితే మైకోస్కోపు ద్వారా 50వేల మైక్రో క్రిములుంటేనే వ్యాధి నిర్థారణ జరిగేది. కానీ ఆర్‌టీపీసీఆర్, సిబినాట్‌ పరికరాల ద్వారా 10 మైక్రో క్రిములు ఉన్నా వ్యాధిని నిర్ధారణ చేయడం జరుగుతోంది. ఆ తరువాత సెన్సిటివ్, రెసిస్టెన్స్‌ అనే రెండు రకాలుగా వ్యాధిని పేర్కొంటూ చికిత్స ప్రారంభిస్తారు. రెండు వారాలపాటు నిరంతరంగా దగ్గు ఉంటే కళ్లె పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు విపరీతంగా పట్టడం, బరువు తగ్గిపోవడం వంటివి క్షయవ్యాధి లక్షణాలుగా చెబుతారు. 2018 జనవరి నుంచి 2019 ఫిబ్రవరి వరకు పరిశీలిస్తే 19935 అనుమానిత కేసులను గుర్తించి పరీక్షలు నిర్వహించగా 6425  మందికి టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వారిలో 5728 మందికి చికిత్స పూర్తిచేశారు. వారిలో 517 మందికి మాత్రం హెచ్‌ఐవీ, టీబీ సోకిందని తేలింది. 

చికిత్స ఇలా: ఈ వ్యాధి ఊపిరితిత్తులపై దీని ప్రభావాన్ని చూపిస్తుంది. దగ్గు, జ్వరం, రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, విపరీతంగా బరువు తగ్గిపోవడం వంటివి ప్రాథ«మిక లక్షణాలు. ఫస్ట్‌లైన్‌ ఆసే అనే పరీక్ష ద్వారా వ్యాధిని నయం చేయడం సాధ్యపడుతుంది. అందుకు వ్యాధిగ్రస్తుని శరరీం సహకరిస్తుందని భావిస్తే వారికి చికిత్స ప్రారంభిస్తారు. ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా ఇచ్చే మందులను వాడడం ద్వారా వ్యాధిని తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం ఒకసారి ఎవరైనా దేశంలో ఎక్కడైనా క్షయవ్యాధిగ్రస్తుడిగా నిర్ధారణ అయితే అతనికి ఆరు నెలలకు సంబంధించిన మందులు రిలీజ్‌ అవుతాయి. అయితే ప్రతి రెండు నెలలకోసారి అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులను పంపిణీ చేస్తుంటారు. ఒక వేళ ఎవరైనా ఇతరత్రా ప్రాంతాలకు వలస వెళితే తమ వద్దనుంచి ఒక చిన్న రశీదును తీసుకొని అక్కడవైద్యశాలలో తిరిగి వైద్యాన్ని కొనసాగించుకోవచ్చు. ఒక వేళ సెన్సిటివ్‌ కాకుండా రెసిస్టెన్స్‌ అయితే మాత్రం సెకండ్‌ లైన్‌ ఆసే టెస్టుకు పంపుతారు. అక్కడ వ్యాధి గ్రస్తునికి ప్రతి నెలా ఎకో టెస్టు నిర్వహిస్తూ మందులు ఇస్తారు. తొలి రెండు వారాలు మాత్రం ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుంది.

ఈ టెస్టును నోడల్‌ డి.టి.ఆర్‌.బి సెంటర్‌లో అందిస్తారు. ఇది మనకు సమీపంలో గుంటూరులో ఉంది. తొలి రెండు వారాలు రోజుకు నాలుగు బిళ్లల చొప్పున ఇస్తారు. అనంతరం డిశ్చార్జి చేసి రోజు మార్చి రోజు రెండు బిళ్లలు చొప్పున మింగాల్సి ఉంటుంది. అయితే సెకండ్‌ లెవల్‌ టెస్టులో సైడ్‌ ఎఫెక్టŠస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికిగాను డ్రగ్‌ సెన్సిటివ్‌ టెస్టు నిర్వహిస్తూ వైద్యం అందిస్తారు. ఈ బిళ్ల ఒక్కొక్కటి పదివేల రూపాయలు విలువ చేస్తుంది. ఆరు నెలలపాటు ఈ వైద్యం అందిస్తారు. ఇటువంటి వారు ప్రకాశం జిల్లాలో కేవలం 11మంది మాత్రమే ఉన్నారు. అయితే కొంతమంది ప్రైవేటు ఆస్పత్రుల్లోను చికిత్స పొందుతుంటారు. అటువంటి వారికి కూడా తాము ఉచితంగా విలువైన మందులను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. క్షయవ్యాధిగ్రస్తునిగా నిర్థారణ అయిన ప్రతి ఒక్కరు తమ ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌ ఇచ్చినట్లయితే మందులతోపాటు వారి పోషణకుగాను ఆరు నెలలపాటు నెలకు రూ. 500 చొప్పున నగదు కూడా నేరుగా అతని ఖాతాకే జమచేయడం జరుగుతుంది. ప్రధానంగా టీబీని 2025 నాటికి పూర్తిగా తుడిచిపెట్టాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.   

మందుల విషయంలో రాజీ లేదు..
డ్రగ్‌ రెసిస్టెంట్‌ టి.బి సెంటర్‌ ఇప్పటివరకు నెల్లూరులో ఉంది. మన జిల్లాలో లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 21న ఒంగోలు రిమ్స్‌లో ఈ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. మందుల విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరంలేదని, ఖరీదైన మందులను ప్రభుత్వం సరఫరాచేస్తున్న దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చే ఉచిత మందులను పేద రోగగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి మద్దిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.    మద్దిశెట్టి శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement