![TDP Activists Attack on Dalith Man In Chittoor - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/14/nani.jpg.webp?itok=AFB0PDOY)
రుయాసుపత్రిలో చికిత్స పొందుతున్న రవిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
చిత్తూరు, తిరుపతి రూరల్: మొన్న వల్లివేడులో..రౌడీయిజం ఎక్కడ పుట్టిందో తెలుసా చిత్తూరులోనే. రౌడీయిజం పుట్టిన ఊరు నుంచి వచ్చానని పులివర్తి నాని హెచ్చరికలు..నిన్న....చంద్రగిరిలో..గాంధీని కాదు. అవసరం అయితే రెండు చెంపలు పగలుకొడతా... అంటూ మరోమారు బహిరంగ బెదిరింపులు.నేడు... అగ్రవర్ణాలు ఉన్న మా ప్రాంతంలో కులం తక్కువవాడివి నువ్వు ఫ్లెక్సీలు కడతావా? అంటూ సినీ ఫక్కీలో పులివర్తి నాని అనుచరులు వెంటాడి..వెంటాడి కాశింపెంట్ల పంచాయతీ మొరవపల్లి దళితవాడకు చెందిన పుట్ట రవిపై దాడికి తెగబడి చంపేందుకు యత్నం.
ప్రశాంతంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు సంస్కృతి విషపు మొక్కలా విస్తరిస్తోంది. మంగళవారం రాత్రి పులివర్తి నాని అనుచరులైన కాశింపెంట్ల మాజీ సర్పంచ్ గాలి సతీష్‌నాయుడు, కొమ్మినేని గిరి, శివ, పట్టాభి కలిసి రవిని కాశింపెంట్ల నుంచి పూతలపట్టు సర్కిల్ వరకు వెంటబడ్డారు. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి వెంట వేము కళాశాల సమీపంలో అతని స్కూటర్‌ను కారుతో ఢీకొట్టారు. కింద పడిన రవిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. పిడికిళ్లతో గుద్దుతూ, కాళ్లతో తన్నారు. ముక్కులో, నోట్లో నుంచి రక్తం కారింది. వందలాది మంది ప్రయాణికులు చూస్తుండగానే ఈ దాడి జరిగింది. కాపాడాలని రవి చేసిన ఆర్తనాదాలు ప్రయాణికులను కదిలిం చాయి. నాని అనుచరులపై ప్రయాణికులు తిరగబడ్డారు. అతన్ని కాపాడేందుకు రాళ్లను చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో నాని అనుచరులు తలో దిక్కుకు పారిపోయారు.
రుయాలో చికిత్స...
తీవ్ర రక్తగాయాలతో ఉన్న రవిని వేము కళాశాల సిబ్బంది, ప్రయాణికులు పాకాలలోని పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమికి చికిత్స అనంతరం విచక్షణరహితంగా కొట్టడం వల్ల ముక్కులో, నోట్లో నుంచి రక్త కరుతుండటంతో పాటు శరీరం కమిలిపోయి, ఎముకలకు దెబ్బలు తగిలి అల్లాడుతున్న రవికి మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిం చారు. 108కు ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించారు.
రాత్రంతా పేషెంట్‌తోనే ఎమ్మెల్యే చెవిరెడ్డి
రుయాలో చికిత్స పొందుతున్న రవిని మంగళవారం రాత్రి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. దీపావళికి ఇంటి వద్ద ఫ్లెక్సీ కట్టుకున్నందుకు కులం పేరుతో దూషిస్తూ వెంటబడి చంపేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యేకు బాధితుడు కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు. చెవిరెడ్డి అతన్ని ఓదార్చాడు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవసరం అయితే మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నైకు తీసుకెళ్తామన్నారు. మొరవపల్లికి వెళ్లి రవి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆసుపత్రికి వచ్చి రాత్రంతా ఉన్నారు. చంపుతామని నాని అనుచరులు బెదిరించిన మాటలు బాధితుడు సెల్‌ఫోన్‌లో రికార్డు అయింది. ఈ వాయిస్ రికార్డును బాధితుడు పోలీసులకు అందించినట్లు సమాచారం. దీంతో నాని అనుచరుల్లో అందోళన మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment