
టీడీపీ వర్గీయుల దాడికి గురైన కార్యకర్తకు వైవీ పరామర్శ
ఒంగోలు అర్బన్: ఇటీవల పీసీపల్లి మండలం పెద అలవలపాడులో తెలుగుదేశం పార్టీ వారు చేసిన దాడుల్లో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతమ్మ అనే కార్యకర్తను కలసి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టాలే కానీ ఇలాంటి దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
చంద్రబాబు తమ కార్యకర్తలను ఈ విధంగా రెచ్చగొట్టడం మంచిది కాదని హితవు పలికారు. ఎంపీతో పాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ముక్కు కాశిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రసాద్, తాళ్లూరు జెడ్పీటీసీ సభ్యులు తదితరులున్నారు.