ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలోని టీడీపీ డివిజన్ కార్యాలయంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న నాయకులు, సిబ్బంది
సాక్షి, ఒంగోలు టౌన్: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు బహిరంగంగానే కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు దగ్గరుండి పింఛన్లు పంపిణీ చేయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని లబ్ధిదారులను కోరుతూ ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారు. ఒంగోలు నగరం హౌసింగ్ బోర్డులో ఏకంగా తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యాలయంలోనే పింఛన్లు పంపిణీ చేశారు. పీవీఆర్ బాలికోన్నత పాఠశాలలో, లాయర్‌పేటలోని ఉమామహేశ్వర జూనియర్ కాలేజీ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దగ్గరుండి పింఛన్లు పంపిణీ చేయించారు. పింఛన్ల పంపిణీ కేంద్రం లోపల, బయట మరికొంతమంది కార్యకర్తలు పింఛన్ల లబ్ధిదారులకు టీడీపీ ఎన్నికల కరపత్రాలు పంపిణీ చేస్తూ తమ పార్టీకే ఓట్లు వేయాలని కోరారు.
ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుటాహుటిన ఆయా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన టీడీపీ కార్యకర్తలు పింఛన్ల పంపిణీ వద్ద నుంచి పక్కకు తప్పుకున్నారు. గేటు బయట టీడీపీకి ఓట్లు వేయాలంటూ కరపత్రాలు పంపిణీ చేస్తున్న వారిని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. పింఛన్లు పంపిణీ చేసే చోట ఎన్నికల ప్రచారం ఎలా చేస్తారంటూ నిలదీశారు. దీంతో పీవీఆర్ పాఠశాల వద్ద ఇరువర్గాల మధ్య వాదన తారాస్థాయికి చేరుకుంది. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పింఛన్లు పంపిణీ చేసే చోట లబ్ధిదారులను ఓట్లు అభ్యర్థించరాదంటూ స్పష్టం చేశారు. కానీ, టీడీపీ నాయకులకు ఫోన్లు చేసిన ఆ పార్టీ కార్యకర్తలు వారి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఎదురుదాడికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు విషయం తెలుసుకుని రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే, కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నేతలను ప్రశ్నించిన ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఎన్నికల కోసమే పింఛన్లు పెంచి లబ్ధిదారులకు వల...
ప్రతినెలా ఒకటి నుంచి మూడో తేదీ వరకు సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పింఛన్లు అందజేస్తుంటారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు కేవలం ఎన్నికల కోడ్‌కు నెల రోజులు ముందు సామాజిక పింఛన్లను రెట్టింపు చేశారు. ఈ ఏడాది మార్చిలో ఒంగోలులోని మినీ స్టేడియంలో మూడు రోజులపాటు భారీ ఎత్తున పింఛన్లను పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెంచిన పింఛన్లను రెండో నెల అయిన ఏప్రిల్‌లో అందుకునేందుకు పింఛన్‌దారులు సిద్ధమవుతుండగా తెలుగుదేశం పార్టీ నాయకులు వారిపై వల వేశారు. ఒంగోలు నగర పరి«ధిలోని యాభై డివిజన్లకు చెందిన ఆ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో ఉన్న పింఛన్‌దారులను పంపిణీ కేంద్రాలకు రప్పించి దగ్గరుండి పింఛన్లను అందిస్తున్నారు. అదే సమయంలో మరో పదిరోజుల్లో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలంటూ కొన్నిచోట్ల వేడుకోగా, మరికొన్నిచోట్ల ఓట్లు వేయకుంటే పింఛన్లు పోతాయంటూ బెదిరింపులకు దిగారు.
అధికారులు కన్నెత్తి చూస్తే ఒట్టు...
ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేసే క్రమంలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా నగరపాలక సంస్థ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీని తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుందనేది జగమెరిగిన సత్యం. పింఛన్లు పంపిణీ చేసే అనేకచోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అదేదో తమ పార్టీ కార్యక్రమంలా దగ్గర కూర్చుని పంపిణీ చేయించారు. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది కిమ్మనకుండా వారిని తమ వద్దనే కూర్చోబెట్టుకుని పింఛన్ల నగదును లబ్ధిదారులకు అందజేశారు. బహిరంగంగా కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా నగర పాలక సంస్థ అధికారులుగానీ, ఎన్నికల అధికారులుగానీ స్పందించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment