మేమింతే! | TDP and Congress have not involved in samaikyandhra movements | Sakshi
Sakshi News home page

మేమింతే!

Published Sat, Dec 7 2013 5:45 AM | Last Updated on Tue, May 29 2018 5:24 PM

TDP and Congress have not involved in samaikyandhra movements

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  రాష్ట్రం విడిపోతుందన్న బాధ పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని వర్గాల ప్రజలను కలచివేస్తోంది. స్వచ్ఛందంగా కదం కదుపుతూ.. గళం విప్పుతూ నిరసన బాట పట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా అలుపెరగని పోరు సాగిస్తుండగా.. కాంగ్రెస్, టీడీపీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. గురువారం రాత్రి కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై వైఎస్‌ఆర్‌సీపీ బంద్‌కు పిలుపునివ్వగా ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు.

ఇలాంటి పరిస్థితుల్లోనైనా విభజనపై ఉద్యమించాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా చేతులెత్తేశారు. టీడీపీ మొక్కుబడి ఆందోళనలతో సరిపెట్టుకుంది. కేంద్రం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించడం.. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అప్పటికప్పుడు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం షరా మామూలైంది. తాజాగా గురువారం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి కూడా ఇదే తరహా నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఎన్నిసార్లు ఈ రాజీ‘డ్రామా’లు అడతారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉండగా గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చి ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి. కనీస మద్దతిచ్చే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడినా.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాత్రం తెరిచే ఉంచి తమ పంథా మారదని చాటుకున్నారు.

ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా మాట మాత్రమైనా మాట్లాడకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఇద్దరు, ముగ్గురు నేతలు మినహా.. జిల్లాలో ముఖ్య నేతలెవరూ బంద్‌పై ఆసక్తి కనబర్చలేదు. కార్యకర్తలే సొంత ఖర్చుతో బైక్ ర్యాలీలు నిర్వహించి మమ అనిపించారు. కేవలం ప్రచారం కోసమే తూతూమంత్రంగా కార్యక్రమం పూర్తయిందనే చర్చ జరిగింది. ఇదే సమయంలో ఉద్యోగ, విద్యార్థి సంఘాలకు కనీస మద్దతు ప్రకటించకపోవటం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement