
ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు
నేటి నుంచి వైఎస్ జగన్ ప్రచారం
♦ మధ్యాహ్నం ఒంటి గంటకు రైతునగరం నుంచి ప్రారంభం
♦ మొదటివిడతలో మూడు రోజుల పాటు కొనసాగనున్న పర్యటన
నంద్యాల ఉప ఎన్నికల సమరంలో కీలక ఘట్టం నేటి నుంచి ప్రారంభం కానుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నంద్యాల మండలం రైతు నగరం నుంచి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో మొదటి రోజు 17.5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తారు. మొదటి విడతలో భాగంగా మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జగన్ రోడ్ షోపై భారీగా నిఘా ఉంచేందుకు అధికార పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. అడుగడుగునా నిఘా ఉంచి.. వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. మరోవైపు అధికార పార్టీ ప్రలోభాలతో అటువైపు వెళ్లిన కొద్ది మంది నేతలు కూడా ఇప్పుడు ఇటువైపు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వివరాలను కూడా సేకరించాలని నిఘా వర్గాలకు అధికార పార్టీ ఆదేశాలు
జారీ చేసినట్లు తెలుస్తోంది.
అధికార పార్టీ కుయుక్తులు.. ఇప్పటికే నంద్యాలలోని ఎస్‌పీజీ గ్రౌండులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగంతో అధికార పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ హామీలపై జనంలో చర్చ జరగకుండా చూసేందుకు గానూ ఇతర అంశాలపై రచ్చ చేశారు. సోమవారం మరో అడుగు ముందుకేసి ఏకంగా శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదంటూ దుష్ప్రచారం చేశారు. అయితే, నామినేషన్‌ను ఎన్నికల సంఘం అంగీకరించడంతో అధికారపార్టీ నేతల నోళ్లకు తాళం పడింది. ఇదిలావుండగా.. జగన్ ఉప ఎన్నికల ప్రచారంపై అధికా>ర పార్టీ భారీగా నిఘా ఏర్పాటు చేసింది. అంతకుముందుగానే కొత్తగా ఏయే నేతలు జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారనే అంశాన్ని కూడా వాకబు చేస్తున్నారు. ఆయా నేతలపై ఒత్తిళ్లు తెచ్చేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది.
అధికార పార్టీ ఎన్ని కుయుక్తులకు పాల్పడుతున్నా.. వైఎస్సార్‌సీపీలోకి చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ ప్రచారంలో కూడా మరికొంత మంది నేతలు వెంట నడిచే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ బహిరంగ సభ తర్వాత పార్టీలో మరింత ఊపు వచ్చిందని, ప్రతిపక్ష నేత ఇచ్చిన హామీలపై నంద్యాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని వారు అంటున్నారు. తాజా రోడ్ షో ప్రచారంతో కేడర్‌లో మరింత ఉత్సాహం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు.
రోడ్‌షో ద్వారా ప్రచారం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానంగా రోడ్‌షో ద్వారా ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. మొదటి రోజు నంద్యాల, గోస్పాడు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటన సాగుతుందని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నంద్యాల మండలం రైతు నగరం నుంచి ప్రచారం ప్రారంభం కానుందన్నారు. అక్కడి నుంచి రామకృష్ణానగర్, కానాల, హైస్కూల్ కొట్టాల.. అనంతరం గోస్పాడు మండలంలోని ఎం. చింతకుంట్ల, జూలేపల్లి, పసురపాడు, తేళ్లపురి వరకు రోడ్‌షో ఉంటుందని వెల్లడించారు.