తలకు గాయాలైన నాగం పెద్దరావరం
సాక్షి, పెద్దారవీడు (ప్రకాశం): మండలంలోని తంగిరాలపల్లె పంచాయతీ తమ్మడపల్లెలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో మంగళవారం సాయంత్రం దాడి చేశారు. వెంటపడి మరీ కర్రలు, రాళ్లతో కొట్టడంతో నాగం పెద్దరవారం తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. కుర్ర రమణమ్మ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వెంటనే పెద్దరవారాన్ని ఆటోలో మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అతని పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తరఫున ఎన్నికల అధికారుల అనుమతితో మండలంలో అటోకు మైకులు, ఫ్లెక్సీలు కట్టుకొని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ కాట్రావత్ వెంకటేశ్వరనాయక్‌ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకొని తమ ఊరిలో ప్రచారం చేసేందుకు వీల్లేలేదని, నీవు ఏ ఊరు వాడివని గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని ఫ్లెక్సీ చింపి, మైకును పగలకొట్టి కర్రతో కొట్టేందుకు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు ఆటో చుట్టుముట్టడంతో ఆయన భయంతో కేకలు వేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆటోను ఎందుకు అపుతున్నారని, డ్రైవర్‌ను కొట్టడం దేనికని ప్రశ్నిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు వాదులాటకు దిగారు. ఇరువర్గాల మధ్య ఒక్కసారి మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. టీడీపీకి చెందిన నక్కా శ్రీనివాసులు, పిన్నిక వెంకట సుబ్బయ్య, కన్నెబోయిన రమణయ్య, కుర్రా శ్రీను, కుర్రా గంగయ్య, పిన్నిక వెంకటేశ్వర్లు, నాగశేషయ్య, నక్కా కోటయ్య, తిరుమలయ్య, చిన్న కాశయ్యతో పాటు మరో కొంతమంది కలిసి రాళ్లు, కర్రలతో కొట్టేందుకు వచ్చారని నాగం పెద్దరవారం, కుర్ర రమణమ్మ, కుర్రా గంగయ్య, కుర్రా ఏడుకొండలు, గుమ్మా గిరిప్రసాద్, కన్నెబోయిన ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లల్లోకి వెళ్లి రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు. టీడీపీ కార్యకర్తలు వెంటపడి నాగం పెద్దరవారాన్ని కర్రలు, రాళ్లతో కొట్టడంతో తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆటోలో మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుర్ర రమణమ్మకు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. నక్కా శ్రీనివాసులు, కన్నెబోయిన రమణయ్యలు దరిమడుగు గ్రామం వరకు కొట్టేందుకు వెంబడించారని డ్రైవర్ వెంకటేశ్వరనాయక్ చెప్పారు. భయందోళన గురై వారిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వెంటనే ఎస్‌ఐ ప్రభాకర్‌రావుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment