సాక్షి, దెందులూరు: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు కావస్తున్నా ఆ పార్టీ శ్రేణులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. కనీవినీ ఎరుగని రీతిలో ఘోర పరాజయం నమోదు కావటం నియోజకవర్గంలో ఏ ఒక్క పంచాయతీలోనూ టీడీపీ అలికిడి కానరావటం లేదు. ఫలితాల్లో సైతం ప్రతి పంచాయతీలోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యతతో పాటు విజయ కేతనం ఎగురవేయటంతో భవిష్యత్తు కార్యక్రమంపై టీడీపీలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
తాము ఇప్పుడేం చేయాలో తెలియక పగలు, రాత్రి తేడాలేకుండా చర్చలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. మరికొందరైతే ఏం చేస్తే బాగుంటుంది? పార్టీలో ఉండాలా, ప్రత్యామ్నాయం చూసుకోవాలా? మౌనంగా ఉండటమా? పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందా? ప్రత్యామ్నాయం చూసుకుంటే వ్యక్తిగత భవిష్యత్తుతో పాటు రాజకీయంగానైనా పరిస్థితి మారుతుందని సమీకరణాల రూపంలో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వ హయంలో జరిగిన అన్ని శాఖల వారీగా ఫిర్యాదులు, నాణ్యత, నిధులు దుర్వినియోగం, ఇతర అంశాలు విచారణ విధిగా జరుగుతుందని ప్రకటించటంతో నియోజకవర్గంలో అన్ని శాఖల వారీగా కాంట్రాక్టులు, అభివృద్ధి పనులు, నిర్మాణాలు చేసినవారు అవాక్కయ్యారు.
దెందులూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు, పోలవరం కుడికాలువ గట్లు కొల్లగొట్టడం, మట్టి అక్రమ రవాణా, నాణ్యతలేని రోడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, ఉపాధి ఇతర పనులపై వేల కోట్లలో అవినీతి జరిగిందని గతేడాదే వైఎస్సార్‌సీపీ నేతలు అప్పటి జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. దీనికి తోడు ఐదేళ్లలో పెట్టిన అక్రమ కేసులు, వేధింపులు, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో వివక్షతతో పాటు ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ పూర్తి ఆధిక్యత సాధించటంతో వచ్చే నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లో పోటీ విషయాన్ని చర్చించటానికి సైతం టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి కనిపించటం లేదు.
కలవరపాటులో టీడీపీ నేతలు
ఒక్కో పంచాయతీకి లక్షలు ఖర్చు పెట్టగల స్తోమత, వెసులుబాటు టీడీపీ నేతలకు ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజాభిమానం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి మించి ఉండటంతో వారంతా తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు. వైఎస్సార్‌సీపీ అన్ని స్థాయిల్లోనూ విజయం సాధించటం స్పష్టమని తేటతెల్లం కావటంతో ఇంత వ్యతిరేకతలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సముద్రానికి ఎదురీదటమేనని టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
అన్ని చోట్ల టీడీపీ అపజయానికి కారణాలు వేరు వేరు అయినప్పటికీ దెందులూరు నియోజకవర్గంలో సొంతింటిలోనే అసమ్మతి, అసంతృప్తి, పార్టీ ధిక్కారం తారాస్థాయికి చేరటంతో 17 వేలకు పైగా ఓట్ల తేడాతో టీడీపీ పరాజయం పాలైంది. ఇన్ని మైనస్‌లు పార్టీలో ఉండటం వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీకి కారణం. కొందరి చూపు వైఎస్సార్‌సీపీ వైపు మళ్లింది. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు ఇన్ని ప్రతికూల పరిస్థితులు టీడీపీలో ఉంటే ఎలా పోటీ చేస్తాం, చేయటం కరక్టేనా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment