రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు
వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టాలనే స్థాయికి దిగజారారు
పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో తట్ట మట్టి కూడా తీయలేదు
కలెక్టరేట్ వద్ద ధర్నాలో కొత్తపల్లి, నాయకుల ఆగ్రహం
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ‘ఏడాది పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశార’ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో టీడీపీ వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయాలని మహిళలే పట్టుపట్టడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో దీనినిబట్టే అర్థమవుతోందని అన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్న పెద్దమనిషి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడకొడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న వారిపై కేసులు పెట్టండని పత్రికల్లో ప్రకటించే స్థాయికి టీడీపీ నాయకులు దిగజారారని ఎద్దేవా చేశారు. జిల్లాలో మొత్తం సీట్లను కట్టబెట్టినప్రజల నోట్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మట్టి కొడతామంటున్నారని ధ్వజమెత్తారు. ఏడాది కాలంగా పోలవరం ప్రాజెక్టులో ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదని గుర్తు చేశారు. ప్రాజెక్టు పూర్తయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే భయంతోనే పనులను
నీరుగార్చుతున్నారన్నారు.నిప్పులు చెరిగిన నాయకులు
పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాల రాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున ఐదు సంతకాలు పెట్టి ఒక్కటి కూడా అమలు చేయకపోవడం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఇసుక మాఫియా, వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు, హత్యాకాండలతోనే టీడీపీ ఏడాది పాలన గడిచిందని పేర్కొన్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పన్ను మినహాయింపులు, రాయితీలు వచ్చేవన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు.
గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు మహిళల ఆత్మగౌరవాన్ని బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి మాట్లాడుతూ నీరు- చెట్టు పథకం ద్వారా తెలుగు తమ్ముళ్లు రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు మట్టిని అమ్ముకుంటున్నారని విమర్శించారు.
ఆచంట కన్వీనర్ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ టీడీపీకి అధికారం ఎంతో కాలం ఉండదని గ్రహించి ఆ పార్టీ నాయకులు ఇప్పటినుంచీ అన్నీ చక్కబెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దెందులూరు కన్వీనర్ కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలని చంద్రబాబు ప్రకటించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. బాబు కన్నా ఫ్యాక్షనిస్టు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావుకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం.కాశిరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్లు పార్టీ నాయకులు తానేటి వనిత, పుప్పాల వాసుబాబు, నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, కారుమంచి రమేష్, చలమోలు అశోక్‌గౌడ్, వి.విజయనరసింహరాజు, ముప్పిడి సంపత్‌కుమార్, చెల్లెం ఆనందప్రకాష్, లంకా మోహన్‌బాబు, పోల్నాటి బాబ్జి, పెన్మెత్స సుబ్బరాజు పాల్గొన్నారు.
ఏడాది పాలనలో ఏం చేశారు!
Published Wed, May 27 2015 2:16 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement