వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) :ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద ట్రాన్స్‌ట్రాయ్ అతిథిగృహంలో బసచేసి పట్టిసీమ ప్రాజెక్టుపై సమీక్షలు నిర్వహించడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీకి 15కు 15 ఎమ్మెల్యే సీట్లూ కట్టబెట్టిన జిల్లా ప్రజలకు, రైతులకు వెన్నుపోటు పొడుస్తూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను తరలించుకుపోవడానికి చంద్రబాబుకు చేతులెలా వచ్చాయని ప్రశ్నించారు. రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహించిన బాబు పోలవరంపై ప్రకటన కూడా చేయకుండా వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.4,500 కోట్లతో ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం ద్వారా ఆ మేరకు ప్రజాధనాన్ని నిరుపయోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు నెలల్లో మూడుసార్లు పోలవరం, పట్టిసీమ ప్రాంతాలను సందర్శించిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయకుండా పలాయన మంత్రం పఠించారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి కేంద్రంలోని తమ మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వైఎస్‌కు పేరు వస్తుందనే భయంతో అటకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూరై్తనా సూర్యచంద్రులున్నంతకాలం వైఎస్ పేరు నిలిచిపోతుందన్నారు. పట్టిసీమ నిర్వాసిత రైతులకు రూ.లక్షల నష్టపరిహారం అందచేస్తూ పోలవరం రైతులను విస్మరించడం తగదన్నారు. మంత్రి దేవినేని ఉమ, సీఎం చంద్రబాబు దఫదఫాలుగా పోలవరం ప్రాజెక్టును పరిశీలించారని, ప్రాజెక్టుకు ఎన్ని నిధులు విడుదల చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, జిల్లా కోశాధికారి డాక్టర్ దిరిశాల వరప్రసాద్, నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సిగ్గుచేటు
Published Sun, May 17 2015 1:30 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement