రుణమాఫీపై షరతులు సరికాదు
జగ్గంపేట :అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు రుణమాఫీపై షరతులు విధించడం సమంజసం కాదని అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. పార్టీ పిలుపు మేరకు జగ్గంపేటలో ఆదివారం నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ. 1 లక్షా 2వేల కోట్ల రుణాలున్నాయని వీటిలో రూ. 87వేల కోట్లు రైతులవి కాగా రూ. 14 వేల కోట్లు డ్వాక్రా సంఘాల వారివన్నారు.
ఈ రుణాలన్నింటిని మాఫీ చేస్తానని నమ్మబలికి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చారని ఆరోపించారు. రైతులను దొంగలుగా చిత్రీకరించి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీని ప్రకటించాలని, లేని పక్షంలో ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందన్నారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్‌కుమార్, వైస్ ఎంపీపీ, పార్టీ మండల కన్వీనర్ మారిశెట్టి భద్రం, ఒమ్మి రఘురామ్, నాలుగు మండలాల పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.