అది పచ్చ ముద్రణే! | TDP Conspiracies on the Tirumala RTC tickets | Sakshi
Sakshi News home page

అది పచ్చ ముద్రణే!

Published Sat, Aug 24 2019 3:32 AM | Last Updated on Sat, Aug 24 2019 8:01 AM

TDP Conspiracies on the Tirumala RTC tickets - Sakshi

సాక్షి, అమరావతి: తప్పు చేయడం, దానిని ఎదుటివారిపై రుద్ది విమర్శలు గుప్పించడం తెలుగుదేశం నాయకులకు బాగా తెలిసిన విద్య. ఆర్టీసీ బస్సు టికెట్ల వెనుక ప్రకటనల ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణ. ఆ టికెట్లను తెలుగుదేశం హయాంలోనే ముద్రించారు. అలా ముద్రించేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఇపుడు అవే టిక్కెట్లను చూపిస్తూ పవిత్ర క్షేత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిపోతున్నదని రాష్ట్రప్రభుత్వంపై విషప్రచారానికి దిగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆ టికెట్లు ముద్రితమయ్యాయన్న విషయం సాక్ష్యాలతో సహా బైటపడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

తామే చేయాల్సిందంతా చేసి ఇపుడు తీరిగ్గా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించేందుకు తెలుగుదేశం నాయకులు కుట్రలు పన్నడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ముస్లింలు, మైనార్టీలకు అమలు చేసిన పథకాల వివరాలను ఆ టిమ్‌ రోల్స్‌పై ముద్రించారు. టీడీపీ హయాంలోనే వీటిని ముద్రించారనేందుకు ఆ పథకాలే ప్రత్యేక ఆధారాలు. పైగా ఈ ఏడాది మార్చిలో ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినా దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు కొత్త ప్రభుత్వంపై దుష్ప్రచారాలకు దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దీనిపై నిజాలు వెల్లడించాలి్సన ఆర్టీసీ ఉన్నతాధికారులు 36 గంటలపాటు మీనమేషాలు లెక్కించడంపైనా విస్మయం వ్యక్తమవుతోంది.


బస్‌ టికెట్ల వెనుక ప్రచారం నిమిత్తం 5 మార్చి 2019న ఇచ్చిన ఆదేశాలు 

బాబు సీఎంగా ఉన్నప్పుడే ముద్రణ..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్టీసీ బస్‌ టిక్కెట్లు జారీ చేసే టిమ్‌ రోల్స్‌ వెనుక భాగంలో టీడీపీ సర్కారు పథకాలతో పాటు జెరూసలేం, హజ్‌ యాత్రలకు సంబంధించిన ప్రచారాంశాలను ముద్రించారు. కోయంబత్తూర్‌కు చెందిన ‘పర్‌ఫెక్ట్‌ కోటెడ్‌ పేపర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు వీటికి సంబంధించిన టిమ్‌ రోల్స్‌ సరఫరాకు ఈ ఏడాది మార్చి 5న ఆర్డర్‌ ఇచ్చారు. నెల్లూరు, కడప జోన్లలో 60,000 రోల్స్‌ సరఫరాకు గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం కుదిరింది. రోల్స్‌ వెనుక భాగంలో చంద్రబాబు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన యాడ్స్, ముద్రణ బాధ్యతలను ‘మార్విన్‌ క్రియేటివ్‌ సర్వీసెస్‌’ యాడ్‌ ఏజెన్సీ’కి అప్పగించారు.

2016 నుంచి 2019 వరకు ప్రకటనల సేకరణ కాంట్రాక్టు మార్విన్‌ క్రియేటివ్‌ సంస్ధకు ఉంది. టిమ్‌ రోల్స్‌ సరఫరా, ప్రకటనల సేకరణ కోసం పర్‌ఫెక్ట్‌ కోటెడ్‌ పేపర్స్, మార్విన్‌ క్రియేటివ్‌ సంస్ధలకు కాంట్రాక్టు ఇచ్చింది గత ప్రభుత్వమే కావడం గమనార్హం. టీడీపీ హయాంలో మైనార్టీ శాఖ నుంచి సేకరించిన ఈ ప్రకటనలను నెల్లూరు, కడప జోన్ల వరకు ముద్రించడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జోన్‌ పరిధిలోనే తిరుపతి, తిరుమల డిపోలున్నాయి. మైనార్టీ శాఖ నుంచి జెరూసలేం, హజ్‌ యాత్రల ప్రచారాన్ని నెల్లూరు జోన్‌కు కేటాయించారంటే కచ్చితంగా తిరుపతి, తిరుమలకు టిమ్‌ రోల్స్‌ సరఫరా అవుతాయని ఊహించే బురద చల్లే యత్నాలకు ఉపక్రమించారని బోధపడుతోంది.

పాత రోల్స్‌ను పంపిన అధికారులు..
ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే చంద్రబాబు సర్కారు పథకాల ప్రచారంతో కూడిన టిమ్‌ రోల్స్‌ను నిలిపేశారు. మే 30వతేదీన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటికే ముద్రించి సరఫరా చేయకుండా ఉన్న టిమ్‌ రోల్స్‌ను జూన్‌ 18న అధికారులు నెల్లూరు, కడప జోన్లకు పంపించారు. సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజుల తర్వాత కూడా కొందరు అధికారులు గత సర్కారు ముద్రించిన ప్రచార టికెట్లను పంపిణీ చేయడం గమనార్హం. ఆర్టీసీలో కొందరు అధికారులు రెండు రోజుల పాటు నిర్లిప్తంగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు యత్నించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్‌ టిక్కెట్ల రోల్‌పై ప్రకటనల సమాచారాన్ని ఆర్టీసీ చీఫ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ స్టోర్స్‌ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రింటింగ్‌కు పంపించాలి. అయితే ఆర్టీసీ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా టిక్కెట్‌ టిమ్‌ రోల్స్‌ను తిరుపతి, తిరుమలకు పంపించారు.  

మైనార్టీ శాఖ ప్రకటనలివ్వడంతోనే పరిశీలించలేదు: ఈడీ కోటేశ్వరరావు
ఆర్టీసీ టిమ్‌ రోల్స్‌ వెనుక భాగంలో మైనార్టీ శాఖ ప్రకటనలివ్వడంతోనే తాము పరిశీలించలేదని ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో బస్‌ టిక్కెట్లపై అన్యమత ప్రచారం ఘటనపై ఆర్టీసీకి ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబు సర్కారు పథకాలను ప్రచారం చేయడం,  ముఖ్యమంత్రిగా ఎవరున్నారనే విషయం ఆర్టీసీకి తెలియదా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. 

ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం..
తిరుమల గిరుల పవిత్రతను పరిరక్షిస్తూ భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి అలిపిరి మార్గంలో ఎక్కడా మద్యం షాపులు ఉండరాదని ఆదేశిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు చేపట్టింది. దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు హయాంలో ముద్రించిన అన్యమత ప్రచారం టికెట్లను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి అంటగడుతూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారానికి ఒడిగట్టింది. ఇందుకు కొందరు అధికారులు కూడా సహకరించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement