చంద్రబాబు టీడీపీ గెలుపు నల్లెరు మీద నడకేనంటూ పదేపదే చెప్తూ మేకపోతు గాభీర్యం ప్రదర్శించారు. దీంతో ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి రావటం తథ్యమని ఆపార్టీ నాయకులు బలంగా నమ్మారు. ఎన్నికల అనంతరం ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుపొందిన లగడపాటి రాజ్‌గోపాల్ సర్వే పేరిట టీడీపీ అనుకూలంగా రిపోర్టు చెప్పటంతో వాళ్ల మాట విన్న టీడీపీ నేతలు లక్షల రూపాయల్లో బెట్టింగ్‌లు పెట్టి ఆర్థికంగా నష్టపోయారు.
సాక్షి, యద్దనపూడి (ప్రకాశం): ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయ ప్రభంజనంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోయారు. గత ఏడాదే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీలో వర్గాలుగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల్లో తాము నష్టపోవాల్సివస్తుందన్న ఉద్దేశ్యంతో ఎన్నికలను వాయిదా వేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే టీడీపీ నాయకులు మాత్రం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా లేనట్లు తెలుస్తోంది.
ఓటర్ల జాబితా సిద్ధం చేసిన అధికారులు
స్థానిక ఎన్నికలకు కులాలవారీగా ఓటర్ల జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఆరుమండలాల పరిధిలో 95 పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు సిద్ధం చేసిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం నియోజకవర్గంలో 2,29,742 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,17,463 మంది మహిళలు కాగా, 1,12,269 మంది పురుషులు ఉన్నారు. ఇతరులు (థర్డ్‌జండర్లు) 10 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓటర్ల జాబితాను ఇప్పటికే ఆయా గ్రామపంచాయతీలకు అందజేశారు. ఇక పంచాయతీల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది.
స్థానిక ఎన్నికల ఖర్చుపై చర్చ
సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు అభ్యర్థులు ఖర్చుచేశారు. దీనిని బట్టి రేపు జరగనున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఓటర్లకు ఇదే రీతిలో పంపిణీ చేయాల్సి ఉంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసలే టీడీపీ నాయకులు బెట్టింగ్‌లో ఆర్థికంగా నష్టపోవటం, ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ఫుల్ జోష్‌లో ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ తరుపున పోటీ చేసి ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవటం మావల్ల కాదని స్థానిక నేతలు చేతులెతేస్తున్నారు. ఒకవేళ పోటీచేయాల్సి వస్తే స్థానిక ఎమ్మెల్యేనో లేక పార్టీ అధిష్ఠానమో భారీమెత్తంలో ఆర్థిక సాయం అందిస్తే తప్ప తాము పోటీచేసే ప్రసక్తే లేదని స్థానిక నేతలు తెగేసి చెప్తున్నారు.
ఇది ఇలా ఉంటే వైఎస్సార్ సీపీ తరపున స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆపార్టీ ఆశావాహులు అధికంగా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇలా స్థానిక ఎన్నికలైన పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార సంఘం వంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మిన్నకుండిపోతే భవిష్యత్‌లో తమ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఎదురవుతుందని కొందరు టీడీపీ సినీయర్ నాయకులు వాపోతున్నారు. మెత్తం మీద స్థానిక ఎన్నికల్లో పోటీపై కొందరు టీడీపీ నాయకులు ఎటూ తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.
గ్రామపంచాయతీ కార్యాలయం
Comments
Please login to add a commentAdd a comment