
ఎంపీపీ ఎన్నిక ఎలా ?
వినుకొండ రూరల్: వినుకొండ మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలో విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. ఇక్కడ అధిక ఎంపీటీసీ స్థానాలను గెలుపొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీపీ అభ్యర్థి లేకపోవడం, ఎంపీపీ అభ్యర్థి ఉన్న తెలుగుదేశం పార్టీకి తగినంత సంఖ్యా బలం లేకపోవడం విడ్డూరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక జరుగుతుందా, జరిగితే ఎలా జరుగుతుంది, ఒక వేళ వాయిదా పడిన పక్షంలో అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ సీపీ వద్ద వ్యూహాత్మక ప్రణాళిక ఏదైనా వుందా వంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎన్నికలు నిర్వహించేందుకు వినుకొండ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
= వినుకొండ మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
= గోకనకొండ ఎంపీటీసీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గండికోట నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
= ఎనిమిందిటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఆరింటిలో టీడీపీ గెలుపొందింది.
= ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది.
= మెజార్టీ స్థానాలను సాధించిన వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్లో ఎస్సీ మహిళ లేరు.
= టీడీపీలో ఎస్సీ మహిళ గెలుపొందినా ఆ పార్టీకి మండలాధ్యక్ష స్థానానికి పోటీ పడేంత సంఖ్యా బలం లేకుండా పోయింది.
= ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన గండికోట నాగేశ్వరరావు టీడీపీలో చేరినా వారి సంఖ్యా బలం ఏడు దాటదు.
ఎన్నిక వాయిదా పడనుందా..
= ఈ విచిత్ర పరిస్థితుల్లో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అధ్యక్ష ఎన్నికకు మొత్తం సభ్యుల్లో సగం మంది హాజరు తప్పని సరి లేదంటే కోరం లేక ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా పడుతుంది.
= మరుసటి రోజు కూడా వాయిదా పడితే నిరవధికంగా ఎన్నికను వాయిదా వేసి జిల్లా అధికారులకు సమాచారం అందిస్తారు. కోరం కావాలంటే 15 మందిలో సగం అంటే ఎనిమిది మంది హాజరు తప్పనిసరి.
= టీడీపీ, స్వతంత్ర అభ్యర్థితో కలిపి ఏడుగురు మాత్రమే ఉండటంతో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల మద్దతు తప్పనిసరిగా మారింది.
= మొదటి రోజు సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గైర్హాజరై ఎంపీపీ ఎన్నిక వాయిదా పడేలా చేయవచ్చనీ, ఆ తరువాత గెలుపొందిన ఎనిమిది మంది ఎంపీటీసీల్లో ఒకరు రాజీనామా చేసి, ఆ స్థానం నుంచి ఎస్సీ మహిళతో పోటీ చేయిం చి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునే వీలుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.