టీడీపీకి ‘మండలి’ భయం
ఏపీ మండలిలో అధికారపక్షానికంటే
ప్రతిపక్షానికి సంఖ్యాబలమెక్కువ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తమకు తక్కువ సంఖ్యాబలం ఉండడంతో అది ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు గుబులు చెందుతున్నారు. దీంతో ఏదోలా మండలిలో సంఖ్యాబలాన్ని పెంచుకొని ఈ అవాంతరాన్ని అధిగమించేందుకు వారు తెరవెనుక ఆలోచనలు సాగిస్తున్నారు.
మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 50. అభివృద్ధి, సంక్షేమంతోపాటు విధానపరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను ఆమోదింపచేసుకోవాలంటే ఉభయ సభల్లో మెజార్టీ ఉండాలి. ఆ బిల్లులు ఆమోదం పొంది చట్టరూపం దాల్చాకనే ఆ కార్యక్రమాలు అమలవుతాయి. బిల్లులు ప్రజావ్యతిరేక మైనవైనా, లోపభూయిష్టంగా ఉన్నా అవి ఆమోదం పొందకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడం సహజం. శాసనసభలో మెజార్టీ ఉంది కనుక ప్రతిపక్షం అభ్యంతరాలను తోసిరాజని అధికార టీడీపీ వాటిని ఆమోదించుకోవచ్చు. అయితే మండలిలో ఆధిక్యం లేనందున ఇబ్బందులు తప్పవేమో అన్నది ఆందోళన. ఇప్పుడిదే టీడీపీకి చిక్కుప్రశ్నగా మారింది. ప్రతి బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాక మండలి ఆమోదానికి వెళ్తుంది. అక్కడ ప్రతిపక్షానికి మెజార్టీ ఉన్నందున సభ్యులు దాన్ని వ్యతిరేకించడమో, సవరణలు ప్రతిపాదించి సెలెక్టు కమిటీకి పంపించడమో చేస్తే జాప్యం జరిగి ప్రభుత్వం ఎంతో కొంత ఇబ్బంది పడుతుంది. అలా అయితే తాము అనుకున్న మేరకు కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లలేమని అధికార నేతలు భావిస్తున్నారు.
ఆపరేషన్ ఆకర్ష..
మండలిలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు మెజార్టీ ఉంది. టీడీపీ సభ్యులు ఏడుగురు మాత్రమే. మండలిలో టీడీపీకి మెజార్టీ రావాలంటే 18 నుంచి 20 మంది ఎమ్మెల్సీలు అవసరమవుతారు. మండలి ద్వైవార్షిక ఎన్నికలు 2015 ఏప్రిల్ వరకు లేవు. ఈలోగానే బలం పెంచుకోవాలంటే ఇతర పార్టీల సభ్యులను ఆకర్షించాల్సి ఉంటుంది. ఇపుడిదే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌తో పాటుఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలపై ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయా సభ్యులతో టీడీపీ ముఖ్యనేతలు కొందరు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.
ఇండిపెండెంట్లు, గవర్నర్ కోటాపై ధీమా..
ప్రస్తుతమున్న 42 స్థానాల్లో సాంకేతికంగా చూస్తే గవర్నర్ నామినేటెడ్ కోటా స్థానాలతో కలుపుకొని కాంగ్రెస్ బలం 20. టీడీపీకి ఏడుగురు, సీపీఐకి ఒకరు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఒకరు, ఇండిపెండెంట్లు 13 మంది ఉన్నారు. అయితే ఇవన్నీ రికార్డుల ప్రకారం ఉన్న బలాలు మాత్రమే. గవర్నర్ కోటాలో ఎంపికైన సభ్యులు అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఆ పార్టీకి మద్దతుగా నిలిచినా ఇప్పుడు అధికార పార్టీవైపే ఉంటారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు(ఇందులో జూపూడి ప్రభాకర్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్‌వైపు ఉన్నారు). ప్రస్తుత సభ్యుల్లో మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి ఆ పదవిలో ఉన్నందున పార్టీ రహితంగా భావించాలి. మరో ఎమ్మెల్సీ పోతుల రామారావు ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. మిగిలిన సభ్యుల్లో కాంగ్రెస్ పార్టీకి 17 మంది(ఎన్నికైన వారు 14, నామినేటెడ్ 3) ఉన్నారు. ఇక కాంగ్రెస్, టీడీపీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి కొందరు సభ్యులు చేరడంతో ఆ పార్టీ బలం ఆరుగా ఉంది.
సీపీఐకి ఒక సభ్యుడున్నారు. తెలుగుదేశం కన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ మంది సభ్యులుండడం, పైగా సభలో సంఖ్యాపరంగా ఇండిపెండెంట్లది ద్వితీయస్థానంగా ఉండడంతో సభలో ప్రతిపక్ష పార్టీల ఆధిక్యం కొనసాగనుంది. రెండునెలల క్రితం కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయిలను గవర్నర్ కోటాలో నామినేట్ చేసినా వారిని ఏ ప్రాంతానికి కేటాయించారో ఇంకా తేల్చలేదు. ఆ కోటాలో ఒక్కటే స్థానం ఖాళీగా ఉన్నందున ఒక్కరు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు వస్తారు. ఆ లెక్కన చూసినా కాంగ్రెస్ మెజార్టీయే పెరుగుతుంది. దీంతో టీడీపీ నేతలు ఆయా పార్టీల సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి, డీవీ సూర్యనారాయణరాజు, ఇండిపెండెంట్లుగా కాంగ్రెస్‌కు అనుబంధంగా వ్యవహరించిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు చైతన్యరాజు, రవికిరణ్ వర్మలతో పాటు ఇతర ఎమ్మెల్సీలు, ఇండిపెండెంట్లతో చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు వివరించాయి. ఇండిపెండెంట్లు 13 మంది ఉన్నందున వారిని కలుపుకొన్నా తమ బలం 20 అవుతుందని, కాంగ్రెస్ నుంచి మరో నలుగురైదుగురి సహకారం ఉంటే చాలునని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏ రాష్ట్రానికెన్ని..?
రాష్ట్ర విభజనకు ముందు సమైక్య శాసనమండలిలో మొత్తం స్థానాలు 90. అందులో 50 స్థానాలు ఆంధ్రప్రదేశ్‌కు, 40 స్థానాలను తెలంగాణకు కేటాయించారు. అయితే విభజన బిల్లు రూపొందించేనాటికి కొన్ని స్థానిక సంస్థల స్థానాలు, గవర్నర్ కోటా స్థానాలు భర్తీ కాలేదు. ఆ ఖాళీలను మినహాయించి తక్కిన సభ్యులను రెండు రాష్ట్రాలకు విభజించారు. ఆంధ్రప్రదేశ్‌కు 42 మంది సభ్యులను ఇచ్చారు. ఎనిమిది ఖాళీలున్నాయి. అందులో ఆరు స్థానిక సంస్థల కోటా, ఒకటి నామినేటెడ్ కోటా, ఇంకొకటి ఎమ్మెల్యే కోటా స్థానం.