రైతు పేరుతో ‘కోతలు’
తెనాలి : ‘రైతుకోసం చంద్రన్న’ పేరుతో స్థానిక మార్కెట్‌యార్డులో సోమవారం నిర్వహించిన భారీ కార్యక్రమానికి అధికారులు ప్రకటించినట్టుగా 20 వేలమంది రైతుల్ని సమీకరించలేకపోయారు. ఆశించినంతకాకున్నా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు రైతులు, పార్టీ కార్యకర్తల్ని మంత్రులు సంతృప్తిపడేలా రాబట్టగలిగారు. రైతులకోసం ఉద్దేశించిన సభలో ఆత్మస్తుతి, పరనింద అన్న తరహాలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలు సాగాయి. చంద్రబాబును కీర్తించటంలో, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయటంలో ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా మాట్లాడారు. ఒకరిద్దరు మంత్రులు, మరో ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలతో దాడిచేశారు.
తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రుణమాఫీపై 13 జిల్లాల్లో అత్యధికంగా గుంటూరు జిల్లా రైతులు ఎక్కువగా సద్వినియోగం చేసుకొన్నట్టు చెప్పారు. ఇక్కడ 5.75 లక్షల రైతులకు రూ.2,900 కోట్లు రద్దుకాగా, ఇందులో రూ.910 కోట్లు ఇప్పటికే వారి ఖాతాల్లో జమైనట్టు చెప్పారు. రుణమాఫీపై చర్చకు సిద్ధమని ప్రతిపక్షానికి సవాలు విసిరారు. ఊరూరా రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను ప్రకటిస్తున్నామనీ, అప్పుడు లబ్ధి పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బండారం బయటపడుతుందన్నారు. ప్రత్యేకహోదాపై దీక్ష, ధర్నాల పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు.
ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన ప్రసంగంలో, రైతురుణమాఫీ ఎవరూ చేయలేని బృహత్ కార్యక్రమంగా చెప్పారు. సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. రాజనీతిజ్ఞుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర ప్రజల పూర్వజన్మసుకృతంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ఏకరువు పెడుతూ అన్నింటికీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబును అభినవ అంబేద్కర్‌గా పోల్చారు.
శాసనమండలి మాజీ చీఫ్‌విప్ నన్నపనేని రాజకుమారి ఒక్కరే, ప్రత్యేకహోదానే కాకుండా హెచ్చు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఏపీలో ఇక రాబోయేది ఏక పార్టీ విధానమేనని, అది టీడీపీనేనని జోస్యం చెప్పారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్ మాట్లాడుతూ, బాబును అభినవ కాటన్‌కన్నా ఎక్కువని పొగిడారు. ఇదే సభలో మాట్లాడినప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు మంత్రుల తరహాలోనే విమర్శలు చేయటం మరో విశేషం! గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, జిల్లా ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రబాబు, నక్కా ఆనందబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రసంగించారు.