
జెడ్పీ స్థలంపై కన్నేసిన అధికార పార్టీ
కలెక్టరేట్‌కు సమీపంలో జిల్లా పరిషత్‌కు ఉన్న రెండెకరాలకు పైగా భూమిలో ఒకప్పుడు జిల్లా పరిషత్ గోడౌన్, వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఉండేవి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కలెక్టరేట్‌కు సమీపంలో జిల్లా పరిషత్‌కు ఉన్న రెండెకరాలకు పైగా భూమిలో ఒకప్పుడు జిల్లా పరిషత్ గోడౌన్, వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఉండేవి. ఈ స్థలం కాకినాడ పాతబస్టాండ్ సమీపాన కచేరీపేట అంబేద్కర్‌కాలనీలో ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరంలో గజం స్థలం దొరకడమే గగనమైపోతోంది. కలెక్టరేట్‌కు సమీపాన గజం ప్రస్తుతం రూ.20 వేలు పైనే పలుకుతోంది. ఈ లెక్కన జెడ్పీ భూమి విలువ 20 కోట్లుపైమాటే. ఆ భూమికి సమీపాన ఉన్న సీపీఎం కార్యాలయం సుందరయ్య భవన్ వద్ద గజం రూ.30 వేలకు పైనే ఉంది. జిల్లా పరిషత్ కూడా తమ చేతుల్లోనే ఉండటంతో నామమాత్రపు లీజుతో జిల్లా టీడీపీ కార్యాలయానికి ఆ భూమిని దఖలు చేయాలని టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇతర నేతలను వెంటబెట్టుకుని ఇటీవల ఆ స్థలాన్ని పరిశీలించి వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జెడ్పీ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకుంటే నెల నెలా వేలరూపాయలు అద్దెల అవసరం ఉండదని తెలుగుతమ్ముళ్లు ఆశిస్తున్నారు. యనమల పర్యటించి వెళ్లాక స్థానికులు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. వాస్తవానికి ఆ స్థలాన్ని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, సాంఘిక సంక్షేమ హాస్టల్, కమ్యూనిటీ హాలు...ఇలా పలు ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలన్నది కొన్నేళ్లుగా స్థానికుల డిమాండ్.
ప్రధానంగా ఎస్సీ, మత్స్యకార సామాజికవర్గాలు కమ్యూనిటీ హాలు కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఉండే ది. మేడలైన్ ఏరియా నుంచి పాములు వస్తున్నాయనే కారణంతో ఆ పాఠశాలను ఫ్రేజర్‌పేట వార్ఫ్ రోడ్డుకు ఇవతల ఉన్న పగోడా మున్సిపల్ స్కూల్‌లో విలీనం చేశారు. అప్పటి నుంచి సుమారు కిలోమీటరు దూరాన ఉన్న పగోడా స్కూల్‌కుపిల్లలను పంపాల్సి వస్తోందని, భారీ వాహనాలతో రద్దీగా ఉండే వార్ఫ్ రోడ్డు దాటించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఆ ప్రతిపాదనలను కాదంటారా?
స్థానికుల డిమాండ్లకు తోడు ఈ స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతించాలని జిల్లా పరిషత్ ఉద్యోగులు కోరారు. 2008లో అప్పటి జెడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణు అధ్యక్షతన జెడ్పీ సమావేశం చేసిన తీర్మానం కలెక్టర్ ద్వారా సీసీఎల్‌ఏకు వెళ్లగా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని జెడ్పీ ఉద్యోగులు చెబుతున్నా రు. సుమారు 150 మందికి జి ప్లస్ టు ప్రాతిపదికన సామూహిక భవంతులు నిర్మించాలనే ఆ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రజోపయోగమైన ఇన్ని ప్రతిపాదనలు, ఇన్ని డిమాండ్‌లను పక్కనబెట్టి టీడీపీకి కట్టబెట్టాలనుకుంటే పెద్ద ఉద్యమాన్ని ఎదుర్కొనక తప్పదని వివిధ ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఆ స్థలం లీజుకు ఇవ్వాలనుకుంటే కమ్యూనిటీ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు, ఏడేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం నిరీక్షిస్తున్న తమకు అన్యాయం చేయవద్దని జెడ్పీ ఉద్యోగులు అంటున్నారు.
స్థానికుల డిమాండ్‌ను మన్నించాలి..
దాదాపు రెండు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని ప్రజోపయోగకరమైన పనులకే వినియోగించాలన్న స్థానికుల డిమాండ్‌ను గుర్తించకపోవడం అన్యాయం. టీడీపీ కార్యాలయానికి అవసరమైతే ప్రైవేటు సైటు కొనుక్కోవాలే కానీ ఇలా ప్రజలకు సంబంధించిన స్థలంపై దృష్టి పెట్టడం సమంజసం కాదు. ఆ స్థలంలో పాఠశాల లేదా రెసిడెన్షియల్ స్కూల్, కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి.
- మెల్లిం డేవిడ్‌రాజు, కచేరీపేట, కాకినాడ
ప్రతి గజం ప్రజలకే చెందాలి..
ఆ స్థలంలోని ప్రతి గజం ప్రజలకే చెందాలి. జిల్లా పరిషత్ ఆస్తి అంటే ప్రజల ఆస్థి. అక్కడ సుమారు 100 కుటుంబాల నివసిస్తున్నాయి. అలాంటి చోట ప్రజల ఉపయోగానికే ఆ స్థలాన్ని వినియోగించాలి. అలా కాక పక్కదారి పట్టిస్తే స్థానికుల నుంచి ప్రతిఘటన తప్పదు. ఖాళీగా ఉండటంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. స్థానికులకు పనికొచ్చే నాలుగు మంచి పనులు చేపట్టాలి.
- కాటే రాము, కచేరీపేట, కాకినాడ