ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో తూతూమంత్రంగా నిర్వహించిన ఫైబర్ చెక్‌డ్యాం పనులు
గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నీరు–చెట్టు పథకాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. చెరువులు, కాలువల్లో పూడికతీత, చెరువుకట్టల అభివృద్ధి, ఇంకుడుగుంతలు, చెక్‌డ్యాంల నిర్మాణం..ఇలా అనేక పనులు జిల్లావ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల, గ్రామస్థాయి నేతలు చేజిక్కించుకున్నారు. కొన్నిచోట్ల చేసిన పనులకే మళ్లీ బిల్లులు పెట్టి నిధులు కాజేశారు. ఉపాధిహామీ పథకంలో కూలీలు చేసిన పనులను పూడికతీత కింద చూపించి నిధులు కొల్లగొట్టారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శక పాలన కోసం అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్లో చోటుచేసుకున్న అవినీతిపై దృష్టిపెడుతున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసిన అధికారులు కూడా బెంబేలెత్తుతున్నారు.
నెల్లూరు ,ఉదయగిరి: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పారదర్శక పాలన కోసం శ్రీకారం చుట్టారు. ఇరిగేషన్ శాఖలో ప్రారంభంకాని పనులను 25 శాతం పనులు జరిగిన వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. జిల్లాలో నీరు–చెట్టుకు సంబంధించి 3,402 పనుల్లో కొన్ని పూర్తిగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. మరో వెయ్యి పనుల మేరకు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతవరకు రూ.263.68 కోట్లు ఖర్చుచేశారు. మరికొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నాయి.
లోపించిన నాణ్యత
జిల్లాలో చెరువు పూడికతీత, కాలువ పూడికతీత పనుల్లో రూ.కోట్ల అవినీతి చోటు చేసుకుంది. యంత్రాల ద్వారా తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు చేయించుకుని నిధులు స్వాహా చేశారు. కొన్ని చెరువుల్లో గతంలో ఎప్పుడో తీసిన గుంతలను కొత్తగా పూడికతీసిన పనులుగా చూపించి నిధులు కాజేశారు. కొండాపురం మండలం కొమ్మి చెరువు, వింజమూరు పాతూరు, ఊటచెరువు, దుత్తలూరు మండలం నందిపాడు చెరువు, వరికుంటపాడు ఊటచెరువు, భాస్కరాపురం చెరువు, కలిగిరి చెరువు, సీతారామపురం ట్యాంకు, గణేశ్వరపురం ట్యాంక్.. ఇలా అనేక చెరువుల్లో పాత పనులకే బిల్లులు చేసి నిధులు కాజేశారు. కొన్ని గ్రామాల్లో వాగులు, వంకల్లో అవసరం లేకపోయినా పూడికతీత తీసి భారీ ఎత్తున నిధులు దిగమింగారు. జిల్లాలో మొత్తమ్మీద పూడికతీత పనుల్లోనే రూ.100 కోట్లు పైగా అక్రమాలు జరిగినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. కానీ వాస్తవంగా అంతకు ఐదురెట్లు పైగానే అవినీతి చోటుచేసుకుంది.
ఫైబర్ చెక్‌డ్యాంల పేరుతో దోపిడీ
ఉదయగిరి నియోజకవర్గంలో ఫైబర్ చెక్‌డ్యాంల నిర్మాణాల్లో రూ.కోట్ల అవినీతి జరిగింది. గత ప్రభుత్వలో ఎమ్మెల్యేగా ఉన్న బొల్లినేని రామారావు తన బినామీ కంపెనీలద్వారా పనులు దక్కించుకుని అనుచరులకు పనులు పందేరం చేసి వారి వద్దనుంచి కమీషన్ రూపంలో రూ.కోట్లు దోచుకున్నారు. మొదట విడతలో 101 పనులు మంజూరుకాగా, దీనికోసం రూ.23.5 కోట్లు ఖర్చుచేశారు. రెండో దశలో 72 పనులకు మరో రూ.15 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు అధిక అంచనాలు వేయించి తూతూమంత్రంగా పనులు చేయించి నిధులు దిగమింగారు. నీరు–చెట్టు కింద రూ.10 లక్షల లోపు విలువగల చెక్‌డ్యాంలు 265 వరకు నిర్మించారు. వీటికోసం రూ.25 కోట్లు పైగా ఖర్చుచేశారు. కొన్నిచోట్ల గతంలో ఉన్న చెక్‌డ్యాంలకు తుదిమెరుగులు దిద్ది బిల్లులు చేసుకుని నిధులు కాజేశారు. ఈ పనులు తనిఖీచేసిన క్వాలిటీ కంట్రోల్ విజిలెన్స్ అధికారులు నాణ్యత చూసి ముక్కున వేలేసుకున్నారు. అధికార పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు ఈ రెండు విభాగాలు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయాయి. వరికుంటపాడు, కొండాపురం, సీతారామపురం, దుత్తలూరు, కలిగిరి మండలాల్లో చెక్‌డ్యాం పనుల్లో డొల్లతనం పనులు చేసిన మూడునెలలకే బయటపడింది. ఇక ఫైబర్ చెక్‌డ్యాం పనుల్లోనే నియోజకవర్గంలో రూ.20 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకోగా జనరల్ చెక్‌డ్యాం పనుల్లో రూ.50 కోట్లు, పూడికతీత పనుల్లో మరో రూ.30 కోట్లు పైగా అవినీతి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
అక్రమార్కులపై విచారణకు రంగం సిద్ధం
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధికారులు ఈ పనులకు సంబంధించిన పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు పూర్తిస్థాయిలో వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముంది. డొల్లతనంగా చేసిన పనులకు సంబంధించి బిల్లులు నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశాలందాయి. ఇంతవరకు ప్రారంభం కాని పనులు, 25 శాతం జరిగిన పనులకు సంబంధించి రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైనచోట కొత్త పనులు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో అటు నిజాయితీ అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆనందం వ్యక్తమౌతోంది.
పనులు రద్దుచేయనున్నారు
ఇంతవరకు ప్రారంభం కాని పనులను రద్దుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే వివరాలను అధికారులు విడుదల చేశారు. 25 శాతం పనులు జరిగిన వాటిని కూడా రద్దుచేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు జరుగుతాయి.– శ్రీనివాసరావు,ఇరిగేషన్ డీఈ, వింజమూరు
Comments
Please login to add a commentAdd a comment