కావలి మున్సిపాలిటీ కార్యాలయం
సాక్షి, కావలి : కావలి మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిధులు ఇష్టారాజ్యంగా కాజేశారు. పట్టణంలో ఒక్క చెత్తను తరలించే పని వ్యహారంలోనే రూ. 6 కోట్లు నిధులు ఈ ఐదేళ్ల కాలంలో కాజేశారు. మున్సిపాలిటీకి అవసరం లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు తమ చేతుల్లో అధికారం ఉందని తమకు కావాల్సిన 50 మందిని పారిశుద్ధ్య కార్మికులుగా చేర్పించారు. వీరికి నెలకు రూ.10,000 జీతంగా పట్టణ ప్రజలు పన్నుల రూపంలో అందజేసిన నిధులను చెల్లిస్తున్నారు. ఈ ఐదేళ్లకాలంలో వీరికి రూ. 3 కోట్లు సమర్పించారు. అలాగే ఆటోలు అవసరం లేకపోయినప్పటికీ 5 ఆటోలను, వీధుల్లో చెత్త నిల్వ చేసే డంపర్లను ఏర్పాటు చేశారు.
వీటికి డీజిల్, మరమ్మతులకు ఈ ఐదేళ్ల కాలంలో రూ.3 కోట్లు నిధులు కాజేశారు. పట్టణంలో రోజుకు 50 టన్నుల చెత్తను మున్సిపాలిటీ తరలించాల్సి ఉంది. వీటిని తరలించడానికి ఒక పెద్ద కంపాక్ట్ వాహనం, రెండు చిన్న కంపాక్ట్ వాహనాలు సరిపోతాయి. కావలి మున్సిపాలిటీలో అధికార పెత్తనం కోసం 1987 నుంచి నుంచి అర్రులు చాస్తున్న టీడీపీ నాయకులు, 2014 లో వైఎస్సార్‌సీపీలో గెలుపొందిన కౌన్సిలర్లను ఫిరాయింపులకు పాల్పడిన మున్సిపాలిటీలో అధికారాన్ని దక్కించుకొన్నారు. అప్పటి నుంచి మున్సిపాలిటీలోని ప్రతి విభాగంలో కూడా నిధులు లూటీకి స్కెచ్‌లు వేసి యథేచ్ఛగా కాజేశారు. ఈ క్రమంలో చెత్త తొలగింపు అంశాన్ని సైతం స్వాహాకు సద్వినియోగం చేసుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment