చెక్‌ పోస్టుల్లో టీడీపీ రాజ్యం | TDP Government Money Distributed In Election Time | Sakshi
Sakshi News home page

చెక్‌ పోస్టుల్లో టీడీపీ రాజ్యం

Published Wed, Mar 27 2019 12:37 PM | Last Updated on Wed, Mar 27 2019 12:38 PM

TDP Government Money Distributed In Election Time - Sakshi

సాక్షి, చీరాల: సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ అడ్డదారుల్లోనైనా అధికారం తెచ్చుకునేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి కోసం అధికారులను అడ్డంపెట్టుకుని ధన, బల రాజకీయాలకు వినియోగించుకుంటున్నారు. చీరాల్లో ఎలాగైనా గెలుపొందాలని టీడీపీ చేస్తున్న దగాకోరు రాజకీయాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. రూ.100 కోట్లు ఖర్చులు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన అన్నీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న చెక్‌పోస్టు అధికారులు, టీడీపీకి చెందిన వాహనాలను నామమాత్రంగా కూడా తనిఖీ చేయడం లేదు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నియోజకవర్గంలో పందిళ్లపల్లి, ఈపూరుపాలెం, కారంచేడు రోడ్డులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. 


ఈ చెక్‌పోస్టుల ద్వారా గుంటూరు జిల్లా నుంచి చీరాలవైపు వస్తున్న అన్ని వాహనాలను విధిగా తనిఖీలు చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సెక్టోరియల్‌ అధికారి, ఒక వీడియో గ్రాఫర్, ఇద్దరు పోలీసులతో 24 గంటలు తనిఖీ చేయాల్సి ఉంది. కానీ అధికార పార్టీకి చెందిన, ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారులే చీరాలకు ఎన్నికల అధికారులుగా విధులు నిర్వర్తిస్తుండటంతో చీరాల టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలకు, అక్రమాలకు వారే వంత పాడుతున్నారంటే అధికార పార్టీ సేవలో చీరాల ఎన్నికల అధికారులు ఏవిధంగా తలమునకలవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

చెక్‌పోస్టుకు వచ్చే ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, ట్రావెల్స్‌ వాహనాలు తనిఖీలు చేయాల్సి ఉండగా మొక్కుబడిగా కూడా పనిచేయడం లేదు చెక్‌పోస్టు డ్యూటీలో ఉన్నవారు. అధికార పార్టీకి చెందిన నేతల వాహనాలకు పచ్చజెండా ఊపుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల టూవీలర్లు, కార్లును మాత్రం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారంటే చెక్‌పోస్టు అధికారులు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలానే చెక్‌పోస్టుల వద్ద వేటపాలెం పోలీస్‌ అధికారులు మాత్రం వైఎస్సార్‌ సీపీకి చెందిన నాయకులు, వారి అనుచరులను మాత్రం తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.


వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు, నాయకుల ఇళ్లల్లో కూడా పోలీసులు అక్రమంగా తనిఖీల జరుపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయితే ఈ మధ్య టీడీపీ మహిళా నేత, ఎమ్మెల్సీకి చెందిన వాహనంలో కోట్లాది రూపాయలు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పర్చూరు మీదుగా ఆమె వాహనాల్లోనే చీరాలకు నగదును తరలించారు. కనీసం చెక్‌పోస్టుల వద్ద వారి వాహనాలను ముందస్తు అనుమతుల పేరుతో ఎలాంటి తనిఖీలు చేయలేదు. దీంతో టీడీపీ అభ్యర్థికి కావాల్సిన కోట్లాది రూపాయలు చీరాలకు వారి వాహనాల్లో తరలివచ్చాయి. అందుకు రాష్ట్ర పోలీస్‌ బాస్‌తో పాటు జిల్లా, స్థానిక పోలీస్‌ అధికారులు పూర్తిగా టీడీపీ నాయకులకు సహకరించినట్లు సమాచారం. పోలీసులు నిజాయితీగా వ్యవహరిస్తే కనీసం ఒక్క టీడీపీ నాయకుడు, కార్యకర్తల ఇళ్లల్లో సోదాలు చేయని పోలీసులు మాత్రం వైఎస్సార్‌ సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తల ఇళ్లల్లో వరుసగా సోదాలు చేస్తున్నారు. 


కోట్లాది రూపాయల నిధులు చీరాలకు వస్తున్న కనీసం పట్టించుకోకపోగా చెక్‌పోస్టుల్లో టీడీపీ నాయకుల వాహనాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఈ అక్రమ వ్యవహారంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement