సాక్షి, చీరాల : తనను ఓడించడానికి చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పన్నినా.. తన గెలుపు ఖాయమని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అసెంబ్లీలో అడుగుపెడితే చంద్రబాబు వెనక డోర్ నుంచి పారిపోతాడా? అని ప్రశ్నించారు. చీరాలలో గానీ, రాష్ట్రంలో గానీ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయన్నారు. వైఎస్ జగన్ కనీసం 125 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జోస్యం చెప్పారు. టీడీపీ... పోలీసులను వెంటబెట్టుకుని మేకవన్నెపులిలా.. కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసిందని విమర్శించారు.
చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా తాను అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని అన్నారు. తాను అసెంబ్లీలోకి రాకూడదని అనుకోవాల్సింది చంద్రబాబు కాదని.. ఇక్కడి ప్రజలు అనుకోవాలన్నారు. తనను అసెంబ్లీకి పంపాలా వద్దా అని ఇక్కడి ప్రజలు నిర్ణయించాలని అన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని, ఏజెంట్లు పెట్టుకుని ఎన్నికలను జరిపిస్తే కాదని.. తనకెంత మెజార్టీ వస్తుందో చూడండని ఆమంచి సవాల్ విసిరారు. ఆరు గంటలకే అధికారికంగా పోలింగ్ సమయం ముగిసినా.. ఈవీఎంలు మొరాయించడం, ఎండ తీవ్రత ఉండటంతో.. ఇంకా ఓటర్లు క్యూలో బారులు తీరారని.. పోలింగ్ రాత్రి ఏడు నుంచి ఎనిమిది వరకు జరగొచ్చని అన్నారు. అధికారాన్ని వైఎస్ జగన్ చేతికిస్తేనే ధర్మంగా ఉంటుందని.. చంద్రబాబును బంగాళాఖాతంలో కలపాలని ఓటర్లు నిశ్చయించుకున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment