సాక్షి, చీరాల రూరల్ (ప్రకాశం): చీరాలలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీకి చెంఇన చిన్న పిల్లలు, ఆడవారిని పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారు. పైపెచ్చు నాయకులను మీ ఇంట్లో ఓటర్ స్లిప్పులు, డబ్బులు దొరికాయంటూ పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి అననుకూలంగా వ్యవహరించనని చెప్పే వరకూ వారిని పోలీసుస్టేషన్‌లోనే ఉంచుతున్నారు. చీరాల, చీరాల రూరల్, వేటపాలెం పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీసులు ముందగానే బైండోవర్లు నమోదు చేస్తున్నారు.
గతంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో గొడవలు పడిన వారిని, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సంఘ పెద్దలుగా చెలామణి అవుతున్న వారిని, వార్డు కౌన్సిలర్లు, గతంలో కౌన్సిలర్లుగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లను ఎన్నికల ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు స్టేషన్లకు తరలించి సెక్షన్ 107 కింద తహసీల్దార్ల ఎదుట హాజరు పరచి బైండోవర్ చేసుకున్నారు. అంతేగాక ఆయా స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లుగా నమోదైన వారిని, సస్పెక్టు షీటులు ఉన్న వారిని, అనుమానితులును కూడా పోలీసుస్టేషన్లకు తరలించి బైండోవర్ చేశారు.
కేసుల నమోదుకు టార్గెట్లా?
చీరాల ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 33 మున్సిపల్ వార్డులున్నాయి. వాటిలో సగం భాగం ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఉండగా మరో సగ భాగం వార్డులు టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్నాయి. పోలీసుస్టేషన్ల వారీగా తీసుకుంటే ప్రతి పోలీసుస్టేషన్‌లో ఒక్కో పోలీసు కానిస్టేబుల్‌కు ఆయా ప్రాంతానికి చెందిన కొంతమందిని టార్గెట్‌గా ఇచ్చి వారితో కచ్చితంగా బైండోవర్ చేయించారు. ఎవరైనా తాను సంఘ పెద్దను మాత్రమేనని, ఎలక్షన్‌తో తనకు సంబంధం లేదని గట్టిగా అడిగితే నీవు ఎలక్షన్‌లో ఓటు కూడా వేసే పనిలేదంటూ పోలీసులు బెదిరిపుంలకు దిగుతున్నారు.
ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సెక్షన్ 107 కింద 24 కేసులు నమోదు చేసి 270 మంది నేతలను బైండోవర్ చేశారు. సెక్షన్ 110 కింద 22 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. ఇక టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో సెక్షన్ 107 కింద 49 కేసులు నమోదు చేసి 344 మందిని బైండోవర్ చేశారు. 40 మందికిపైగా రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో సెక్షన్ 107 కింద 26 కేసులు నమోదు చేసి 473 మందిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. 23 మంది రౌడీషటర్లను కూడా బైండోవర్ చేసుకున్నారు. వేటపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో కూడా అంతే మొత్తంలో బైండోవర్‌లు నమోదు చేశారు.
ఎన్నికల కమిషన్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు
పోలీసుల ఏకపక్ష వైఖరిపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల రాత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ గుంటూరు జిల్లాకు చెందిన జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వరదరాజులను నిచారణ అధికారిగా నియమించింది. రెండు రోజుల క్రితం ఆయన చీరాల చేరుకుని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమంచి టీడీపీ నాయకులు, పోలీసులు చేస్తున్న అరాచకాలను తెలిపే విధంగా పూర్తి సమాచారాన్ని డాక్యుమెంట్లు, సీడీల రూపంలో ఆయనకు అందించినట్లు సమాచారం.
వైఎస్సార్ సీపీ నాయకులే టార్గెట్
బైండోవర్లు చేయడంలో కూడా పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు చెప్పిన పేర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలో కొంచెం ఉత్సాహంగా పనిచేస్తున్న నేతలపైకి టీడీపీ నాయకులు పోలీసులను ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇళ్ల వద్ద నిద్రిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను పోలీసులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పోలీసులు ఆయా ప్రాంతాలకు చెందిన నేతల ఇళ్ల వద్దకు చేరుకుని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల సమయం కాబట్టి సహజంగా ప్రతి వారి వద్ద ఓటర్ల జాబితా ఉంటుంది.
ఓటర్ల జాబితా ఉన్న వారిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. వైఎస్సార్‌లో ఎక్కువగా పని చేస్తున్నావని, టీడీపీలో పనిచేస్తే మంచిదని పరోక్షంగా ఖాకీలు సలహా ఇస్తున్నారు. లేకుంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. చోటామోటా నేతలు చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో ఎవరికి వారు భయపడుతున్నారు. పైపెచ్చు ఆయా నేతలతో తెల్లకాగితంపై సంతకాలు పెట్టించుకుని ఉదయాన్నే వదిలే స్తున్నారు. వారు బతుకు జీవుడా అంటూ ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల 30వ వార్డుకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడిని పోలీసులు అర్ధరాత్రి సమయంలో స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో బెదిరింపులకు దిగారు. నీపై ఇప్పటికే కొన్ని కేసులున్నాయని, మరో రెండు కేసులు తగిలించి రౌడీషీటు కూడా తెరిచే ఆలోచన ఉందని, సక్రమంగా ఉంటే మంచిదంటూ హెచ్చరించి వదిలేశారు.
9వ వార్డుకు చెందిన మరో వైఎస్సార్ సీపీ నాయకుడిని కూడా పోలీసులు ఇదే తరహాలో అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి స్టేషన్‌కు తరలించారు. నీవు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నావని, ఇలాగే పనిచేస్తే కేసులు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉంటే వదిలేస్తామని, లేకుంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తీవ్ర బెదిరింపులకు దిగారు. తెల్ల కాగితంపై సంతకాలు తీసుకుని ఉదయాన్నే వదిలేశారు. ఇలా ప్రతి వార్డులో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను పోలీసులు టార్గెట్ చేసి పోలీసుస్టేషన్లకు తరలించి తమదైన శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఇంకా ఎంతమంది వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు స్టేషన్లకు తరలించి వేధింపులకు గురిచేస్తారోనని నాయకులు బెంబేలెత్తిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment