వారిది పాపం...  వీరికి శాపం... | TDP Government Not Releasing Welfare Funds In Vizianagaram | Sakshi
Sakshi News home page

వారిది పాపం...  వీరికి శాపం...

Published Fri, Aug 23 2019 9:59 AM | Last Updated on Fri, Aug 23 2019 10:01 AM

TDP Government Not Releasing Welfare Funds In Vizianagaram - Sakshi

కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్ధులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

గత పాలకుల పాపం ఇంకా వెంటాడుతోంది. విద్యార్థుల జీవితాలను అవస్థల మయం చేసింది. వారికి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పంగనామాలు పెట్టింది. స్కాలర్‌షిప్‌లకు చెల్లు చెప్పింది. మెస్‌బిల్లులను ఎగ్గొట్టింది. తీరా వాటిగురించి అడిగేందుకు సాహసిస్తే హౌస్‌ అరెస్టులు చేసి అణగదొక్కింది. ఇప్పుడు ప్రజాసంక్షేమ పాలనలో తమ కోర్కెలు తీరుతాయని ఆశపడిన విద్యార్థి లోకం మరోసారి గళమెత్తింది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళనకు దిగింది. స్వేచ్ఛగా చేపట్టిన ఆందోళన అనుకోకుండా గతితప్పింది. చట్ట ఉల్లంఘనకు దారితీసింది. ఫలితంగా చట్టం తన పనితాను చేసుకుపోయింది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యార్థిలోకానికి గత ప్రభుత్వం ఇవ్వాల్సిన పలు రకాల నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేసింది. మెస్‌ బిల్లులు, మౌలిక సదుపాయాల నిధులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు వంటివి చెల్లించకుండా మొండిచెయ్యి చూపింది. ఇప్పుడు ఆ మొత్తం భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడింది. వాటిని చెల్లించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ వద్ద గురువారం విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో వసతులు మెరుగుపరచాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు జ్వరాలలో మగ్గిపోతుంటే జిల్లా కలెక్టర్, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరి ష్కరించకపోతే కలెక్టరేట్‌ నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. అప్పటికే అధికారులతో సమావేశంలో ఉన్న కలెక్టర్‌ బయటకు రాకపోవడంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మరింత కోపోద్రిక్తులయ్యారు. కలెక్టరేట్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ విద్యార్థులతో మా ట్లాడాల్సిందిగా జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావును పంపించారు. కానీ ఆయనతో మాట్లాడేందుకు విద్యార్థులు అంగీకరించలేదు.

రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం..
కలెక్టర్‌ తమతో మాట్లాడేంతవరకూ కదిలేది లేదంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. నాలుగు రోడ్ల కూడలిలో దాదాపు రెండు గంట ల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవడంతో అక్కడి నుంచి వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు విద్యార్ధులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఎస్‌ ఎఫ్‌ఐ నాయకులు శాంతించకపోవడంతో వారి ని బలవంతంగా అక్కడి నుంచి పంపిం చేందుకు పోలీసులు ఉపక్రమించారు. విద్యార్థులు ప్రతిఘటించడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక చేసేది లేక వారిని బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్, ఆటోల్లో ఎక్కించారు. వాటిని కూడా విద్యార్థులు అడ్డగించడంతో పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో 47మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి జామి పోలీస్‌స్టేషన్‌కు 36మందిని, ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కి 11 మందిని తరలించారు.

గత ప్రభుత్వ బకాయి రూ. 102కోట్లు..
జిల్లా వ్యాప్తంగా 61 బీసీ హాస్టళ్లు, 37 ఎస్సీ హాస్ట ళ్లు ఉండగా ఎస్సీ హాస్టల్స్‌లో 3400 మంది, బీసీ హాస్టళ్లలో 5537 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరికి 2018–19 విద్యా సంవత్సరానికి బీసీలకు రూ.73 కోట్లు, ఎస్సీలకు రూ.29 కోట్లు చొప్పున మొత్తం దాదాపు రూ.102 కోట్లు బకాయిలను గత ప్రభుత్వం విడుదల చేయలేదు. వీటిని  అప్పుడే టీడీపీ ప్రభుత్వం విడుదల చేసి ఉంటే ఈ రోజు విద్యార్థులు ఇలా రోడ్డు మీదకు రావాల్సి వచ్చేది కాదు.

మాట్లాడటానికి పిలిచినా రాలేదు..
ఇరిగేషన్‌ అధికారులతో ముఖ్యమైన సమావేశంలో ఉన్నందున విద్యార్థులను నా వద్దకు రావాల్సిందిగా సూచించాను. 20 మంది వరకూ వచ్చి వారి సమస్యలు చెప్పుకోవచ్చని అవకాశం ఇచ్చాను. కానీ వారు రాలేదు. జిల్లా మెజిస్ట్రేట్, అందునా ముఖ్యమైన ఇరిగేషన్‌ సమావేశాన్ని, జిల్లా అధికారులను వదిలి రావాలని కోరడం వెనుక ఉద్దేశం వేరుగా ఉన్నట్లు కనిపించింది. అయినప్పటికీ డీఆర్‌ఓను, జాయింట్‌ కలెక్టర్‌ను విద్యార్థులతో మాట్లాడాలనీ, వారి సమస్యలు వినాలని పంపించాను.  విద్యార్థులు లెక్కచేయలేదు. వాస్తవానికి ప్రతి సోమవారం జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో తమ సమస్య చెప్పుకోవచ్చు. ఆ పని కూడా చేయలేదు. ప్రభుత్వం వారి విషయంలో సానుకూలంగా ఉంటోంది. వారి సమస్యలు పరిష్కరించేందుకు యత్నిస్తోంది. 
– డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా కలెక్టర్‌

శాంతిభద్రతల పరిరక్షణకే విద్యార్థుల ముందస్తు అరెస్టు..
కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం జ రిగిన ధర్నాలో ఎటువంటి లాఠీ చార్జీ చేయలేదు. సుమారు 1500 మందికి పైగా విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు. ఎ లాంటి హింసాత్మక సంఘటనలు జరగకుం డా ఉండేందుకు ముందుగానే పోలీసులను లాఠీలు ఉపయోగించ వద్దని, సంయమనం పాటించాలని ఆదేశించాం. అయితే ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కొందరు విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి, వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగించడంతో, వారిని శాంతి యుతంగానే పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొంతమంది విద్యార్థుల ముసుగులో దురుద్దేశంతోనే వాహనంపైకి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. మరి కొంతమంది విద్యార్థులు కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణకు తప్పనిసరి పరిస్థితుల్లో కొందర్ని 151 సీఆర్‌పీసీ కింద ముందస్తు అరెస్టు చేశాం.     
– బి.రాజకుమారి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement