దమ్మిడీ సాయం లేదు | TDP government on its failure to provide relief to cyclone affected people | Sakshi
Sakshi News home page

దమ్మిడీ సాయం లేదు

Published Sat, Dec 20 2014 12:49 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

TDP government on its failure to provide relief to cyclone affected people

* హుద్‌హుద్ తుపాను ప్రాంతాలకు సహాయంలో ఏపీ సర్కారు ఘోర వైఫల్యం
* ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
* తుపాను నష్టం రూ. 80 వేల కోట్లో, ఇంకెంతో అర్థం కావడంలేదని సీఎం చెప్పినట్టు ఓ పత్రికలో వచ్చింది..  844 కోట్లు ఖర్చు చేసినట్టు సర్కారు చెబుతోంది
* అంటే ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టలేకపోయారా? అంచనాకి, వాస్తవానికి ఇంత తేడానా?
* రూ. 3 వేల కోట్ల పంట నష్టం జరిగితే దమ్మిడీ అయినా ఇచ్చారా?
* మత్స్యకార గ్రామాల్లో 50 కిలోలు, కొన్ని చోట్ల 25 కిలోలు, మరికొన్ని ప్రాంతాల్లో 10 కిలోల బియ్యం ఇచ్చారు
* ఇవి కిలో రూపాయి బియ్యం.. అంటే మత్స్యకారులకు రూ.50,
* ఇతరులకు రూ.25, 10 చొప్పున సాయం చేశారే తప్ప ఇంతకుమించి ఏమిచ్చారు?
* వర్షాలతో పనులు లేక, నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో
* ఇంటికి కనీసం రూ. 5 వేలు ఇమ్మంటే రూపాయైనా ఇచ్చారా?
* విపక్ష నేత ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ఎదురుదాడికి దిగిన అధికారపక్షం
* తుపానుపై చర్చ సమయంలో ముఖ్యమంత్రి సభలో లేకపోవడాన్ని తప్పుపట్టిన జగన్
* సీఎం లేకుండా తుపాను నష్టంపై ఏకగ్రీవంగా తీర్మానమెలా చేస్తామని ప్రశ్న
* సీఎం వచ్చాక శనివారం చర్చ జరుపుదామని, ఈరోజు రైతుల సమస్యలు,
* ఆత్మహత్యలపై చర్చిద్దామని సూచన.. అయినా చర్చ కొనసాగింపు

విశాఖలో బాధితులకు ఆహార పొట్లాలు, నిత్యావసర వస్తువులు ఎలా సరఫరా చేశారో మీకు తెలుసా? ఈవేళ నేను గానీ మా పార్టీ వాళ్లు గానీ ఆహార పొట్లాలు తెప్పించి మీకు అలా విసిరేస్తే తీసుకుంటారా? తీసుకోరు గదా. కానీ మీరక్కడ చేసిందందే. బాధితులకు అలా ఎందుకిచ్చారు? ప్రతి గడప గడపకూ ఎందుకు చేర్చలేకపోయారు?

సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపానుకు కకావికలమైన ఉత్తరాంధ్ర జిల్లాలకు సహాయ సహకారాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తుపాను వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టలేకపోయారని విమర్శించారు. బాధితులను ఆదుకోవడానికి దమ్మిడీ విదల్చలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తుపాను కారణంగా దాదాపు రూ.80 వేల కోట్లు నష్టం జరిగిందని ముఖ్యమంత్రే చెప్పినట్లు ఓ పత్రికలో వచ్చిందని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకు ఖర్చు చేసింది రూ. 844 కోట్లని ప్రభుత్వమే చెబుతోందని అన్నారు. అంటే ఒక శాతం కూడా ఖర్చు పెట్టలేదని చెప్పారు.

హుద్‌హుద్ తుపానుపై శుక్రవారం శాసన సభలో జరిగిన చర్చలో జగన్ మాట్లాడారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అత్యంతు ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం సభలో లేకపోవడాన్ని తప్పుపట్టారు. అధికారపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా పలు ప్రశ్నలు సూటిగా సంధించారు. తన ప్రశ్నలకు అవునో కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పక్షానికి జగన్‌మోహన్‌రెడ్డి వేసిన ప్రశ్నలు..

* హుద్‌హుద్ తుపాను వల్ల జరిగిన అపార నష్టంపై శాసన సభలో అర్థవంతమైన చర్చ చేసి కేంద్రం నుంచి మరింత సాయం కోరేలా ఏకగ్రీవంగా తీర్మానం చేయాలనుకున్నప్పుడు ఈ చర్చను వదిలేసి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లారు? ఈరోజు విశాఖలో భారత ప్రధాన న్యాయమూర్తి కార్యక్రమం, 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిందీ ఈ ప్రభుత్వమే కదా? అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి ఈవేళ సభలో లేకుండా ఎందుకు వెళ్లారు?

* చంద్రబాబు గురించి, ప్రభుత్వం గురించి మంత్రి గంటా శ్రీనివాస్ గొప్పగా చెప్పుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేను 10 రోజులు పర్యటించా. ఇంత నష్టం జరిగినా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించలేదు. అవునో, కాదో చెప్పాలి.

* తుపాను నష్టం 70 వేల కోట్లో, 80 వేల కోట్లో, ఇంకెంతో అర్థం కావడంలేదంటూ ముఖ్యమంత్రే చెప్పినట్టు ఓ పత్రికలో వచ్చింది. అంత నష్టం జరిగితే ఇంతవరకు 844.60 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. అంటే 1% కూడా ఖర్చు పెట్టలేకపోయారా? అంచనాకి, వాస్తవానికి ఇంత తేడానా?

* తుపానుకు 400 సోనా బోట్లు, 10 వేల ఫైబర్ బోట్లు గల్లంతయితే మత్స్యకారులకు కనీసం ఒక్క రూపాయి అయినా సాయం చేశారా?

* 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఎకరాకి 20 వేల రూపాయల చొప్పున నష్టం జరిగిందనుకున్నా మొత్తం పంట నష్టం 3 వేల కోట్ల రూపాయలవుతుంది. కానీ ఇప్పటివరకు ఒక్క దమ్మిడీ అయినా విదిల్చారా?

* మీరిచ్చిన హామీని నమ్మి రుణాలు కట్టని కారణంగా పంటల బీమా కూడా రైతులు కోల్పోయారు. దానికి పూచీ ఎవరు?

* మీరు మత్స్యకార గ్రామాల్లో 50 కిలోలు, కొన్ని చోట్ల 25 కిలోలు, మరికొన్ని ప్రాంతాల్లో 10 కిలోల బియ్యం ఇచ్చారు. ఇవి కిలో రూపాయి బియ్యం. అంటే మీరు మత్స్యకారులకు రూ.50, ఇతరులకు 25, 10 రూపాయల చొప్పున సాయం అందించారే తప్ప ఇంతకుమించి ఒక్క రూపాయైనా అదనంగా ఇచ్చారా?

* వర్షాలతో పనులు లేక, నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రతి ఇంటికి కనీసం 5 వేల రూపాయలు ఇమ్మంటే రూపాయైనా ఇచ్చారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించా రు. వీటికి ఏ మంత్రీ సూటిగా సమాధానం చెప్పలేదు. పైగా ఎదురుదాడికి దిగారు.

సీఎం సభలో లేకపోవడం అన్యాయం
మొదట హుద్‌హుద్ తుపాను సహాయంపై సభలో చర్చ ప్రారంభించే ముందు దానిపై జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇంతటి కీలకమైన అంశంపై చర్చ చేపట్టే సమయంలో సభలో ముఖ్యమంత్రి లేకపోవడం అన్యాయమని అన్నారు. ఇంత ముఖ్యమైన అంశం మీద చర్చ జరిగే సమయంలో సభా నేత ఊర్లోనే లేకుండా పోయారని విమర్శించారు. ‘‘శాసన సభ జరిగేదే నాలుగు రోజులు. ఆ మేరకు తేదీలు ఖరారు చేసిందీ వాళ్లే. ఆ నాలుగు రోజులు కూడా ముఖ్యమంత్రి సభలో లేకపోతే ఎలా? హుద్‌హుద్ నష్టంపై సీఎం సమక్షంలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దాం. సీఎం సభలో లేని సమయంలో ఏకగ్రీవ తీర్మానం చేయలేం. కాబట్టి ఈ చర్చను శనివారానికి వాయిదా వేద్దాం’’ అని సూచించారు.

344 నిబంధన కింద రైతుల సమస్యలు, ఆత్మహత్యల మీద చర్చ చేపడదామని చెప్పారు. ప్రతిపక్ష నేత సూచనను స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అంగీకరించలేదు. సీఎం లేకపోయినా చర్చ చేద్దామని చెప్పారు. ఈ సందర్భంలో మంత్రి గంటా శ్రీనివాసరావు జోక్యం చేసుకొని.. ‘‘ఏకగ్రీవ తీర్మానం చేద్దామని ప్రతిపక్ష నేత సూచించడం బాగుంది. విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరవుతున్న కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వెళ్లారు’’ అని చెప్పారు.

తుపాను వచ్చినా పర్యటించని గంటా
తుపాను సమయంలో విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా తిరగకుండా ఇంటికే పరిమితమయ్యారని జగన్ విమర్శించారు. అదేమని అడిగితే మంత్రి జ్వరంతో ఇంట్లోనే ఉన్నట్టు తెలిసిందని, ఇది అవునో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి సమాధానం ఇవ్వడానికి బదులు మంత్రి గంటా ఎదురు దాడికి దిగారు. జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో ధర్నా చేపట్టినప్పుడు తాము కూడా 25 ప్రశ్నలు అడిగామని, ఇప్పటికీ సమాధానం రాలేదని అన్నారు. ప్రతిపక్షం నుంచి సరైన సూచనలు వస్తే స్వీకరిస్తామని, లోటుపాట్లు సహజమని అన్నారు. తన నియోజకవర్గంలో పర్యటించారా లేదా అనే ప్రశ్నకు బదులివ్వకుండా.. ‘‘నేను రాజీనామా చేస్తా. మీరూ చేయండి. భీమిలీలో పోటీ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం’’ అని కూర్చుండిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement